న్యూఢిల్లీ: తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారు, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు, వారిని సంరక్షిస్తున్నవారికి ఉపయోగపడేలా దేశరాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్) రెండు మొబైల్ యాప్‌లను రూపొందిస్తోంది. ఇటీవలి కాలంలో కరోనా కారణంగా ఒత్తిడికి గురవుతున్నవారు, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది.
ఈ నేపధ్యంలో ఎయిమ్స్ రూపొందించే ఈ రెండు యాప్‌లు బాధితులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. మరోవైపు నేటి బిజీ లైప్ కారణంగానూ కొందరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వీరికి కూడా ఈ యాప్‌ల ద్వారా ఉపశమనం కలగనుంది. ఈ సందర్బంగా ఎయిమ్స్ మానసిక వైద్యులు డాక్టర్ మమతా సూద్ మాట్లాడుతూ ఈ యాప్‌లను 25 మంది బాధితులపై ప్రయోగించామన్నారు. ట్రయల్స్‌లోనే మంచి ఫలితాలు వచ్చాయన్నారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే అన్నిరకాల మానసిక సమస్యలకు ఈ యాప్ సహాయం అందిస్తుందన్నారు. ‘సురక్ష’, ‘దిశ’ పేర్లలో ఈ యాప్‌లు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ యాప్‌లను ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ వార్విక్ భాగస్వామ్యంతో రూపొందించారు. ఈ యాప్‌లు వచ్చే ఏడాది జనవరి నుంచి అందరికీ అందుబాటులోకి రానున్నాయి.