ఎయిడెడ్‌ను బతికించండి

ABN , First Publish Date - 2021-10-28T05:39:53+05:30 IST

ఎయిడెడ్‌ పాఠశాలల విలీనానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోకి తమ పిల్లలను బలవంతంగా తరలిస్తామంటే ఊరుకునేది లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారు.

ఎయిడెడ్‌ను బతికించండి

విద్యాసంస్థల ఎత్తివేతపై తల్లిదండ్రుల విముఖత

 అంగీకార పత్రాలను వెనక్కి తీసుకుంటున్న పాఠశాలల యాజమాన్యాలు

 దూరాభారం, జీరో సర్వీస్‌ సీనియార్టీ భయాందోళనలతో టీచర్లదీ అదేబాట


ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 27 : ఎయిడెడ్‌ పాఠశాలల విలీనానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోకి తమ పిల్లలను బలవంతంగా తరలిస్తామంటే ఊరుకునేది లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారు. మరోవైపు విలీనానికి తొలుత నయానో, భయానో అంగీకారం తెలిపిన యాజమాన్యాలు సైతం పున రాలోచన చేసుకుని తమ విద్యా సంస్థలను సొంతంగానే నిర్వహించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. జిల్లాలో విలీనానికి అంగీకార పత్రాలు ఇచ్చిన 177 ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాల్లో సగం మంది తమ అంగీకారాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పోస్టుల విలీనం /సర్దుబాటు వల్ల ఇప్పుడు పనిచేస్తున్న తమకు అనుకూలమైన, అలవాటైన స్థానాల నుంచి కనీసం 40–50 కిలోమీటర్ల దూరంలో ఉండే కేటగిరి–3, 4లలోని పాఠశాలలకు వెళ్లాల్సి వస్తుందని టీచర్లు వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తోంది. జీరో సర్వీస్‌ సీనియారిటీ వల్ల నష్టమే తప్ప ప్రయోజనం శూన్యమన్న భావన వ్యక్తం చేస్తున్నారు.


సగానికి పైగా తల్లిదండ్రులు ‘నో’ 

జిల్లాలో 177 ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనానికి(టీచర్‌ పోస్టులతో సహా) జిల్లా విద్యా శాఖకు అంగీకార పత్రాలు అందించాయి. ఇలా విలీనానికి అంగీకరించిన వారిలో 40 పాఠశాలల యాజమాన్యాలు సొంతంగా నిర్వహించుకుంటామని (అంటే ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌గా) విద్యాశాఖకు స్పష్టం చేయగా మిగతా పాఠశాలలన్నీ మూసివేతకు అంగీకారం తెలియజేశాయి. ఇలా మూసివేసే పాఠశాలల యాజమాన్యాలన్నీ తమ విద్యాసంస్థల్లోని బాల బాలికలను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి అభ్యంతరం లేదని తెలియజేస్తూ ఆ మేరకు తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలను తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతు న్న 11,463 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 5,762 మంది నుంచి మాత్రమే సేక రించగలిగారు. ఇలా అంగీకార పత్రాలు ఇచ్చి న పలువురు తల్లిదండ్రు లు ఒత్తిళ్లకు గురై ఇచ్చారని చెబుతున్నారు. అంగీకార పత్రాలు తీసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉంది. 


ఒక్కరోజులోనే వెనక్కి తగ్గిన 14 పాఠశాలలు 

తల్లిదండ్రుల ఆందోళన, న్యాయస్థానం అండ తదితర కారణాలతో తొలుత విలీనానికి అంగీకార పత్రాలు ఇచ్చిన 177 ఎయిడెడ్‌ పాఠశాలల్లో మంగళవారం ఒక్కరోజే 14 యాజమా న్యాలు తమ అంగీకారాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు విద్యాశాఖకు మౌఖికంగా తెలియజేశాయి. మరోవైపు ప్రభుత్వం కూడా విలీనానికి బలవంతం ఏమీ లేదని, ఎవరైనా సొంతంగా నిర్వహించుకునేందుకు ఇప్పటికైనా ముందుకు వస్తే ఆ మేరకు పత్రాలను వెనక్కి తీసుకోవచ్చని స్పష్టం చేయడంతో మరికొన్ని విద్యాసంస్థలు ఉపసంహరణ బాటలో అడుగులు వేస్తున్నాయి. క్రైస్తవ మిషనరీ ఎయిడెడ్‌ పాఠశాలలన్నీ ఇప్పుడున్న మాదిరిగానే ప్రభుత్వ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులతో యథాతథంగానే కొనసాగే అవకాశాలున్నాయి. సర్దుబాటు/విలీనానికి అంగీకారం తెలిపిన 463 మంది ఎయిడెడ్‌ టీచర్ల సీనియార్టీ జాబితాలను రూపొందించి కౌన్సెలింగ్‌ దశకు వచ్చే నాటికి పలువురు వెనుకంజ వేయడం ఖాయమని తెలుస్తోంది.



మా బడి .మాకు కావాలి 

ఏలూరు ఫైర్‌స్టేషన్‌/భీమడోలు, అక్టోబరు 27 : అమ్మ ఒడి మాకొద్దు.. మా బడి మాకు కావాలంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు రూరల్‌ మండలం కాట్లం పూడి ఐసీఎం ఎయిడెడ్‌ పాఠశాలను మూసి వేయకుండా కొనసాగించాలని బుధవారం విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో జనరల్‌ మేనేజర్‌ బిషప్‌ జాన్‌ ఎస్‌డీ రాజు మాట్లాడుతూ ఎయిడెడ్‌ పాఠశాలలు మూసి వేయడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. విద్యాసంస్థను మూసి వేయడానికి వీలులేదని తల్లి దండ్రులు నిరసన తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యే  అబ్బయ్యచౌదరికి వినతిపత్రం సమర్పించారు. భీమడోలు మండలం గుండుగొలను పాఠశాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సీఎస్‌ఐ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాఠశాల నుంచి పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. సీఎస్‌ఐ పాఠశాలలను ఎంపీపీ పాఠశాలల్లో విలీనం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని నినాదాలు చేశారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 



 రేపటిలోగా తేల్చండి : ఆర్జేడీ

ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో చదువుతున్న బాలబాలికలను సమీప ప్రభుత్వ పాఠశా లల్లో చేర్చేందుకు వీలుగా మండలాల వారీ గా విద్యార్థుల మ్యాపింగ్‌ను పూర్తి చేసి కొత్తగా అవసరమైన చోట ప్రభుత్వ పాఠశా లల ఏర్పాటుకు వివరాలను తెలియచేస్తూ ఈ నెల 29లోగా నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు డి.మధుసూదనరావు ఆదేశిం చారు. బుధవారం ఏలూరు సమగ్ర శిక్ష జిల్లా మీటింగ్‌ హాలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నాడు– నేడు, మధ్యాహ్న భోజన పథకం, విద్యా కానుక కిట్లు, పాఠ్య పుస్తకాల సరఫరా తదితర అంశాలపై ఎంఈవోలు, ఎస్‌ఎస్‌ఏ అధికారులు, విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు, సూపరింటెండెంట్‌లతో చర్చించారు. భోజన పథకం ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దన్నారు. ఏలూరు సెయింట్‌ గ్జేవియర్‌ ఎయిడెడ్‌ పాఠశాలను ఆర్జేడీ సందర్శించి భోజన పథకం ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఎంఈవో నరసింహమూర్తి, మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వరదాచారి, అసిస్టెంట్‌ డైరెక్టర్లు విజయలక్ష్మి, ఎన్‌.వి.రమణ, సూపరింటెండెంట్లు సూరిబాబు, నరసింహారావు తదితరులు ఉన్నారు.






Updated Date - 2021-10-28T05:39:53+05:30 IST