వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడికి చుక్కలు..!

ABN , First Publish Date - 2021-10-27T14:45:42+05:30 IST

ప్రభుత్వానికి ఎయిడెడ్‌ సెగ రాష్ట్రమంతా తగులుతోంది. ఎక్కడికక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుకు నిరసనగా అధికార ఎమ్మెల్యేలను నిలేస్తున్నారు. విశాఖ బాటలోనే కాకినాడలోనూ ఎయిడెడ్‌ విద్యాసంస్థలో చదివే పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. సెయింట్‌ ఆన్స్‌ బాలికోన్నత పాఠశాల విలీనంపై..

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడికి చుక్కలు..!

సర్కారుకు ఎయిడెడ్‌ సెగ

కాకినాడలోనూ కదిలిన తల్లిదండ్రులు

సెయింట్‌ ఆన్స్‌ విలీనంపై నిరసనలు

ద్వారంపూడి కారును ఆపి..ఘెరావ్‌

‘అమ్మఒడి మాకొద్దు’ అంటూ నినాదాలు

గంటపాటు చిక్కుకున్న ఎమ్మెల్యే

అప్పటికప్పుడు డీఈవోను పిలిచి చర్చలు

సీఎం దృష్టికి తీసుకువెళతానని హామీ

పాఠశాలలను కొనసాగిస్తాం

సేక్రెడ్‌ హార్ట్‌, సెయింట్‌ పీటర్స్‌ లేఖ


కాకినాడ(ఆంధ్రజ్యోతి):

‘‘రూపాయి కూడా తీసుకోకుండా సెయింట్‌ ఆన్స్‌ బాలికోన్నత పాఠశాల యాజమాన్యం మా పిల్లలకు చదువు చెబుతోంది. ఇప్పుడు ఎయిడ్‌ ఆపేయడంతో రూ.15 వేలు ఫీజు కట్టాలని అడుగుతోంది. ఒకపక్క అమ్మఒడి అంటూ రూ.15 వేలు వేస్తున్నారు. ఇప్పుడు ఇలా లాగేసుకుంటున్నారు. ప్రభుత్వానికి ఇది న్యాయమేనా? మీ అమ్మఒడి మాకు వద్దు.. మా పిల్లల భవిష్యత్తు తిరిగి ఇవ్వండి’’

- కాకినాడలో ఎయిడెడ్‌ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన


ప్రభుత్వానికి ఎయిడెడ్‌ సెగ రాష్ట్రమంతా తగులుతోంది. ఎక్కడికక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుకు నిరసనగా అధికార ఎమ్మెల్యేలను నిలేస్తున్నారు. విశాఖ బాటలోనే కాకినాడలోనూ ఎయిడెడ్‌ విద్యాసంస్థలో చదివే పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. సెయింట్‌ ఆన్స్‌ బాలికోన్నత పాఠశాల విలీనంపై ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని దాదాపు గంట సేపు ఘెరావ్‌ చేశారు. పాఠశాల మూసివేతపై ఎమ్మెల్యేను చుట్టుముట్టి, ధాటిగా ప్రశ్నిస్తూ, ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..


కాకినాడ జగన్నాథపురంలో సెయింట్‌ ఆన్స్‌ బాలికోన్నత ఎయిడెడ్‌ పాఠశాల నలభై ఏళ్లకుపైగా నడుస్తోంది. ఇప్పుడు ఈ పాఠశాలను ప్రభుత్వం విలీనం చేయాలని నిర్ణయించింది. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ ఉద్దేశం తెలిపేందుకు స్కూలు యాజమాన్యం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వందలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. వారంతా ఉదయం 11 గంటలకు స్కూలు వద్దకు వచ్చారు. యాజమాన్యం నిర్ణయం వారిని దిగ్ర్భాంతికి గురిచేసింది.


ఇదే సమయంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అటువైపు వెళ్తున్నారు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. గంటకుపైగా ఆయనను ఘెరావ్‌ చేశారు. ఆక్రోశం, ఆగ్రహం కలగలిసి ప్రశ్నలతో ద్వారంపూడిని నిలేశారు. ఇన్నేళ్లలో రూపాయి కూడా తీసుకోకుండా చదువు చెబుతున్న సెయింట్‌ ఆన్స్‌ బాలికోన్నత పాఠశాలను తమకు దూరం చేయొద్దు అని డిమాండ్‌ చేశారు. విలీన ప్రక్రియలో భాగంగా ఎయిడెడ్‌ నిధులు నిలిపివేతతో రూ.15 వేలు ఫీజు కట్టమంటున్నారని.... ప్రభుత్వానికి ఇది న్యాయమేనా అంటూ నిలదీశారు. 


ద్వారంపూడికి చుక్కలు..

తాను చెప్పేది వినాలంటూ ఎమ్మెల్యే మాట్లాడే ప్రయత్నం చేయగా.. తల్లిదండ్రులు తమ నిరసన మరింత పెంచారు. ఎమ్మెల్యేను కదలనీయకుండా నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. తల్లిదండ్రులను పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేసినా వందలాది మంది ఉండడంతో వారు నిస్సహాయులుగా మారారు. అయితే అతి కష్టంపై నినాదాల మధ్యనే.. ‘‘విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం’’ అంటూ ద్వారంపూడి ఏదో చెప్పబోయారు. ఆయనను అడ్డుకున్న తల్లిదండ్రులు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ’’మా పిల్లలు ఇక్కడే పుట్టారు. ఇక్కడే చదువుకుంటున్నారు. ఈ ప్రాంతాన్నీ, పాఠశాలనూ వదిలి ఎక్కడకు వెళ్లమంటారు?’’ అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోందని..ఏ పాపం చేశారని చదువు చెప్పే పాఠశాలలను ప్రభుత్వం తీసేసుకుంటుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణం ఎయిడెడ్‌ స్కూళ్ల విలీనం ఆపాలని, తమ పిల్లలకు ఇక్కడ ఉన్న రక్షణ ఎక్కడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడ నుంచి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి బయటపడేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. వందలాది మంది చుట్టుముట్టడంతో బయటపడలేక, విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చచెప్పలేక చాలాసేపు చిక్కుకుపోయారు. అప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖాధికారిని అక్కడకు ఎమ్మెల్యే పిలిపించారు. స్కూలు ఫీజు కింద ఒక్కరూపాయి కూడా కట్టాల్సిన పనిలేదని..న్యాయం చేస్తానని ద్వారంపూడి హామీ ఇచ్చారు. ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం రాష్ట్రవ్యాప్త నిర్ణయం కాబట్టి సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని నచ్చచెప్పి అక్కడి నుంచి ఎట్టకేలకు బయటపడ్డారు. 

Updated Date - 2021-10-27T14:45:42+05:30 IST