ప్రమాదంలో ‘ఎయిడెడ్‌’!

ABN , First Publish Date - 2021-04-11T09:39:59+05:30 IST

ఏడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థ 1990వరకూ ఒక వెలుగు వెలిగింది. కార్పొరేట్‌ స్కూళ్ల ప్రవేశంతో నిరాదరణకు గురైంది.

ప్రమాదంలో ‘ఎయిడెడ్‌’!

విద్యా వ్యవస్థ ఉనికిపై నీలినీడలు

గతంలో ఆదుకున్న టీడీపీ సర్కారు

కోర్టు కేసులతో మళ్లీ సమస్యలు 

నిధుల లేమి, స్కూళ్లలో సిబ్బంది కొరత

పాదయాత్ర హామీ నెరవేర్చని జగన్‌ 

వ్యవస్థను గాడిలో పెడతానని మాట 

నెరవేర్చాలంటున్న యాజమాన్యాలు


(కాకినాడ, ఆంధ్రజ్యోతి) 

ఏడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థ 1990వరకూ ఒక వెలుగు వెలిగింది. కార్పొరేట్‌ స్కూళ్ల ప్రవేశంతో నిరాదరణకు గురైంది. కాంగ్రెస్‌ హయాంలో అవసాన దశకు చేరుకున్న ఈ వ్యవస్థకు చంద్రబాబు ప్రభుత్వం పునర్జీవం పోసింది. పలు సమస్యలతో సతమతమవుతున్న ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థను ఆదుకుంది. టీడీపీ ప్రభుత్వం 010 హెడ్‌ ద్వారా ట్రెజరీ నుంచి జీతాలు చెల్లించేలా జీవో జారీ చేసింది. దీంతో ఉద్యోగుల వేతనాల సమస్య తీరింది. అలాగే కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పదోన్నతులు, సకాలంలో అందని రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పరిష్కరించింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి కూడా ప్రయత్నించింది. న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడంతో వెనకడుగు వేసింది. 


జోన్‌ 1, 2 పరిధిలో సిబ్బంది కొరత 

జోన్‌ 1 పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. జోన్‌ 2 పరిధిలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. ఈ రెండు జోన్‌లలో సుమారు 555 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. 2001లో ఈ రెండో జోన్‌లలో ఉన్న ఎయిడెడ్‌ స్కూళ్లలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు 3,944 మంజూరు అయ్యాయి. అప్పట్లో 2065 పోస్టులే భర్తీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1,897 ఉద్యోగాలు భర్తీ కాలేదు. దీనికితోడు 2014 నుంచి 2019 వరకు పనిచేస్తున్న 2065 సిబ్బందిలో సుమారు 400 మంది పదవీ విరమణ చేశారు. భర్తీ కానీ ఖాళీలు, ఖాళీలు అయిన ఉద్యోగాలు కలిపి 2279 పోస్టులు భర్తీ కాలేదు. ఈ పోస్టుల భర్తీ కోసం ఎయిడెడ్‌ స్కూల్స్‌ యాజమాన్యాల కమిటీలు గతంలో కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపాయి. కోర్టులో కేసులు పరిష్కారం కాకపోవడంతో వాటిని పక్కనపెట్టేశారు. ఖాళీ అయిన పోస్టులను కూడా భర్తీ చేయలేదు. 


జిల్లాల వారీగా ఖాళీలు 

శ్రీకాకుళం జిల్లాలో టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు 13మంజూరు కాగా, ముగ్గురే పనిచేస్తున్నారు. విజయనగరం జిల్లాలో 311 పోస్టులకు 170 ఖాళీగా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో 486 పోస్టులకు 254 ఖాళీగా ఉన్నాయి. తూర్పుగోదావరిలో 1014 పోస్టులు మంజూరయితే, 390 మంది మాత్రమే ఉన్నారు. 624 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 1427 పోస్టులు మంజూరయితే 578 ఖాళీగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 693 పోస్టులకు 243  ఖాళీగా ఉన్నాయి. 


సొంతంగా జీతాల చెల్లింపులు 

ఎయిడెడ్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు తమ ఉనికి కాపాడుకోడానికి, విద్యార్థుల సంఖ్య పెంచుకోవడానికి, తదనుగుణంగా పెండింగ్‌, కొత్త గ్రాంట్‌ తెచ్చుకోవడానికి సొంతంగా జీతాలు చెల్లించుకునేలా నిర్ణయం తీసుకున్నాయి. కొంతమంది సిబ్బందిని ఆయా స్కూళ్లో చేర్చుకున్నాయి. దీనిపై 2018 జూన్‌ నెలలో టీడీపీ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. కమిటీలు సొంతంగా భర్తీ చేసుకున్న సిబ్బందిలో కొందరిని రెగ్యులర్‌ చేసుకోవచ్చని, ఇందుకు గ్రాంట్‌ మంజూరు చేస్తామని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాగా గుంటూరు జిల్లాలో ఎయిడెడ్‌ స్కూళ్లలో జరిగిన కొన్ని అవకతవకల వల్ల జీవో రద్దు చేసింది.

 

హమీ నెరవేర్చని జగన్‌ 

ఇదే సమయంలో పాదయాత్రలో ఉన్న జగన్‌మోహన్‌ రెడ్డి తాను అధికారంలోకి రాగానే ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థను గాడిలో పెడతానని హామీ ఇచ్చారు. దీంతో యాజమాన్యాల్లో ఆశలు చిగురించాయి. కాగా అధికారంలోకి వచ్చాక ఆయన మాట మార్చారు. ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్వహణను భరించలేని యాజమాన్యాలుంటే.. వాటిని ప్రభుత్వానికి అప్పగించాలని రెండు నెలల క్రితం ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసింది. కాగా ఎయిడెడ్‌ పాఠశాలల్లో స్థితి గతులు, విద్యార్థులు, సిబ్బందిపై ఆరా తీసి నివేదిక ఇవ్వాలని మరో సర్క్యులర్‌ జారీ చేసింది. ఇందుకు డిప్యూటీ డీఈవో, ఎంఈవో, మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంలతో  ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థ భవిష్యత్తు తేలనుంది. తూర్పు గోదావరి జిల్లాలో 39 ఎయిడెడ్‌ స్కూళ్ల యాజమాన్యాలు సందిగ్ధంలో ఉన్నాయి. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్‌   నెరవేర్చాలని కోరుతున్నాయి. ’’


ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థ ప్రస్తుతం సమస్యలతో సతమతమవుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా ఉనికినే కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ వ్యవస్థను గాడిలో పెడతానని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక విస్మరించారు. దీంతో సిబ్బంది కొరత, నిధుల లేమితో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏం చేయాలో తెలియక యాజమాన్యాలు సందిగ్ధంలో ఉన్నాయి. 

Updated Date - 2021-04-11T09:39:59+05:30 IST