సాగుకు సాయం

ABN , First Publish Date - 2022-07-02T05:15:44+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత వానాకాలంలో పంటలు పండించే రైతులకు రూ.1473 కోట్ల మేర రుణాలను బ్యాంకర్లు ఇవ్వనున్నారు.

సాగుకు సాయం

వానాకాలంలో రూ.1473 కోట్ల పంట రుణాలు

యాసంగిలో రూ.977 కోట్ల రుణాలు

రుణ ప్రణాళికను ఆమోదించిన జిల్లా కమిటీ

గతేడాది కన్నా 13 శాతం పెంపు


ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి, జూలై 1: సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత వానాకాలంలో పంటలు పండించే రైతులకు రూ.1473 కోట్ల మేర రుణాలను బ్యాంకర్లు ఇవ్వనున్నారు. అలాగే వచ్చే యాసంగి సీజన్‌లో రూ.977 కోట్ల మేర పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు నిర్ణయించారు. ఈ మేరకు లీడ్‌ బ్యాంక్‌ రూపొందించిన 2022-23 వార్షిక రుణ ప్రణాళికను గతనెల 29న రాత్రి కలెక్టర్‌ శరత్‌ అధ్యక్షతన జరిగిన జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదించింది. గత ఆర్థిక సంవత్సరం 2021-22లో నిర్ణయించిన రూ.6,188.80 కోట్ల రుణప్రణాళికను 13 శాతం మేర పెంచి రూ.6,997.00 కోట్ల రుణ ప్రణాళికను ప్రస్తుత 2022-23 సంవత్సరం ఆమోదించారు. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి 2,27,494 మంది రైతులకు రూ.2450.01 కోట్ల మేర రుణాలను బ్యాంకర్లు ఇవ్వనున్నారు. వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలుగా 30,603 మంది రైతులకు రూ.564.51 కోట్లను, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, ఉద్యానవన తదితర వాటి కోసం 3,804 మంది రైతులకు రూ.70.50 వ్యవసాయంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం దీర్ఘకాలిక రుణాలుగా 1507 మంది రైతులకు రూ.115.00 కోట్లను ఇవ్వాలని బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాలు, తదితర వాటి కొనుగోలు కోసం దీర్ఘకాలిక రుణాలు 3807 మంది రైతులకు రూ.415.00 కోట్లు ఇవ్వనున్నారు.


ఉపాధి కల్పనకు రూ.950 కోట్లు

ఉపాధి కల్పన యూనిట్లు నెలకొల్పోందుకు జిల్లాలోని 34,958 మందికి రూ.950.00 కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాలుగా ఇవ్వాలని బ్యాంకర్లు నిర్ణయించారు. ఇందులో సూక్ష్మ తరహా పరిశ్రమల కోసం 30,975 మందికి రూ.464.40కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు 3,395 మందికి రూ.152.19కోట్లు, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి 588 మందికి రూ.333.41 కోట్లను రుణాలుగా ఇవ్వనున్నారు. జిల్లాలోని ఔత్సాహికులైన నిరుద్యోగులు ఎవరైనా ఆయా పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తే రుణాలు ఇవ్వనున్నామని బ్యాంకర్లు తెలిపారు. 


విద్యా రుణాలుగా రూ.80 కోట్లు

ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఈ ఆర్థిక సంవత్సరంలో 1,627 మందికి రూ.80 కోట్లను రుణాలుగా బ్యాంకర్లు ఇవ్వనున్నారు. జిల్లాలో ఇళ్లు నిర్మించుకునేందుకు 12,007 మందికి రూ.1200కోట్లు రుణాలుగా ఇవ్వనున్నామని బ్యాంకర్లు తెలిపారు. సామాజిక అవసరాల కల్పనకు ఉపయోగపడే వాటి కోసం 1151 మందికి రూ.45.25 కోట్లను, సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి 375 మందికి రూ.6.75 కోట్లను రుణాలుగా ఇవ్వాలని బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. ఇతర ప్రాధాన్యత రంగాలకు 15,160 మందికి రూ.1332.00 కోట్లను రుణాలను కల్పించనున్నారు. ప్రాధాన్యత లేని వ్యక్తిగత, మార్టిగేజ్‌ రుణాలు, రూ.30లక్షల పై చిలుకు ఇచ్చే ఇళ్ల రుణాలు, రూ.20 లక్షల పైన ఇచ్చే విద్యా రుణాలకు గాను 17003 మందికి రూ.1099.98 కోట్ల రుణాలను ఇవ్వనున్నారు. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,34,336 మందికి రూ.6997.00 కోట్లను రుణాలుగా ఇవ్వాలని జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ బ్యాంకర్లకు లక్ష్యంగా నిర్ధేశించింది.  

Updated Date - 2022-07-02T05:15:44+05:30 IST