AIADMK నుంచి పన్నీర్ సెల్వం గెంటివేత..

ABN , First Publish Date - 2022-07-11T22:11:57+05:30 IST

ఏఐఏడీఎంకే (AIADMK)లో ద్వంద్వ నాయకత్వానికి ముగింపు పడింది. పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమితులైన ఎడప్పాడి పళనిస్వామి(EdappadiK Palaniswami) సంచలనం నిర్ణయం తీసుకున్నారు.

AIADMK నుంచి పన్నీర్ సెల్వం గెంటివేత..

చెన్నై: ఏఐఏడీఎంకే (AIADMK)లో ద్వంద్వ నాయకత్వానికి ముగింపు పడింది. పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమితులైన ఎడప్పాడి పళనిస్వామి(EdappadiK Palaniswami) సంచలనం నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తన ప్రత్యర్థి ఓ.పన్నీర్ సెల్వాన్ని(O Panneerselvam) పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంతో ఆయనపై తొలగింపు వేటు వేశారు. ఈ మేరకు ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పన్నీర్ సెల్వం, పళని స్వామి చేపడుతున్న పార్టీ కోఆర్టినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ పదవులను కూడా రద్దు చేశారు. పార్టీలో అంతర్గత నిర్ణయాల్లో ఏకాభిప్రాయం విషయంలో ఇబ్బందులు, అసంతృప్తులకు ఆస్కారమిస్తున్న ఈ పదవులను రద్దు చేసినట్టు భేటీలో పేర్కొన్నారు.


కాగా పార్టీలో ఏకనాయకత్వానికి అనుగుణంగా ఎడప్పాడి పళని స్వామికి పార్టీ కేడర్ భారీ మద్దతిచ్చింది. జనరల్ కౌన్సిల్ మీటింగ్‌లో ఏకంగా 2500 మంది సభ్యులు పళని స్వామికే ఓటేశారు. డీఎంకే ప్రభుత్వానికి పన్నీర్ సెల్వం వత్తాసు పలుకుతున్నారని ఈపీఎస్‌తోపాలు పలువురు సీనియర్లు ఆరోపించారు. ఈ పరిణామంపై పన్నీర్ సెల్వం స్పందించారు. ఏఐఏడీఎంకే పార్టీ కోఆర్టినేటర్ 1.5 కోట్ల మంది పార్టీ కార్యకర్తలు తనను ఎన్నుకున్నారని, పళని స్వామి లేదా ఇతర నాయకులెవరూ తనను ఎన్నుకోలేదన్నారు. చట్టవిరుద్ధంగా తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు.


4 నెలల్లో అంతర్గత ఎన్నికలు...

పార్టీ జనరల్ సెక్రటరీని ఎన్నుకునేందుకు 4 నెలల్లో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని జనరల్ కౌన్సిల్ భేటీలో నిర్ణయించారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. కాగా పార్టీలో టాప్ పదవితోపాటు పలు పదవులకు సంబంధించిన పలు మార్పులు తీసుకొచ్చారు. 10 ఏళ్ల ప్రాథమిక సభ్యత్వం కలిగిన వ్యక్తే పార్టీ ఉన్నత పదవులకు అర్హుడనే ఓ నిబంధన కూడా ఈ జాబితాలో ఉంది.


మద్రాస్ హైకోర్ట్ తీర్పుతో మారిన సీన్..

మద్రాస్ హైకోర్ట్ తీర్పుతో పార్టీ అంతర్గత పోరులో పన్నీర్ సెల్వానికి(OPS) ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధినాయకత్వాన్ని నిర్ణయించేందుకు తలపెట్టిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్‌కు మద్రాస్ హైకోర్ట్(Madras High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎడప్పాటి పళనిస్వామి(EPS) సారధ్యంలో పార్టీ జనరల్ సెక్రటరీ సమావేశంపై స్టే విధించాలంటూ ఓపీఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్ట్ తోసిపుచ్చింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్ట్ సోమవారం ఉదయం 9 గంటల సమయంలో కీలక తీర్పునిచ్చింది.


తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళని స్వామి ఎన్నికమద్రాస్ హైకోర్ట్తీ ర్పు నేపథ్యంలో సోమవారం ఉదయం 9:15 నిమిషాలకు ఏఐఏడీఎంకే  ప్రిసీడియం చైర్మన్ ఏ తమిళ్ మహన్ హుసేన్ నేతృత్వంలో జనరల్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశంలో పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళని స్వామి ఎన్నికయ్యారు. ఏకంగా 2500 మంది మద్దతు పళనిస్వామికి మద్దతు తెలిపారు. దీంతో పార్టీలో ద్వంద్వ నాయకత్వానికి ముగింపు పడినట్టయ్యింది. ఇకపై పళని స్వామి ఒక్కరే పార్టీ అధినేతగా ముందుకు నడిపించనున్నారు.

Updated Date - 2022-07-11T22:11:57+05:30 IST