Amit Shah's Bihar visit: అమిత్ షాకు తేజస్వి యాదవ్ సూటి ప్రశ్నలు

ABN , First Publish Date - 2022-09-23T00:54:33+05:30 IST

బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో పర్యటించాలనుకోవడం వెనుక అసలు ఉద్దేశం

Amit Shah's Bihar visit: అమిత్ షాకు తేజస్వి యాదవ్ సూటి ప్రశ్నలు

పాట్నా : బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో పర్యటించాలనుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ను ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఇస్తుందా? అని నిలదీశారు. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి, హిందువులను రెచ్చగొట్టడానికి వస్తున్నారని దుయ్యబట్టారు. 


బిహార్‌లో జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వం గత నెలలో కూలిపోయింది. జేడీయూ-ఆర్జేడీ, మరికొన్ని పార్టీలు కలిసి మళ్లీ నితీశ్ కుమార్ నేతృత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా శుక్రవారం నుంచి రెండు రోజులపాటు బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో పర్యటించబోతున్నారు. ఇక్కడ ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.  ఆయన పూర్నియాలో ఓ బహిరంగ సభలో మాట్లాడతారు. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో కూడా మాట్లాడతారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో 35 స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో అమిత్ షా వస్తున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. 


ఈ నేపథ్యంలో తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) గురువారం విలేకర్లతో మాట్లాడుతూ, అమిత్ షా బిహార్ రావడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం  బిహార్‌కు ప్రత్యేక హోదాను ఇస్తుందా? ఆయన పర్యటన లక్ష్యం ఏమిటి? అని ప్రశ్నించారు. ‘‘ఆయన వచ్చి, ఆటవిక రాజ్యం ఉందంటారు, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడతారు, హిందువులను రెచ్చగొడతారు. వాళ్లు (BJP) చేసేది అదే’’ అన్నారు. 


ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే : జేడీయూ

అమిత్ షాపై జేడీయూ కూడా విరుచుకుపడుతోంది. జేడీయూ (JDU) నేత రాజీవ్ రంజన్ (Rajiv Ranjan) ఇటీవల మాట్లాడుతూ, అమిత్ షా పర్యటన మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నమని చెప్పారు. ముస్లింలు అధికంగా ఉండే సీమాంచల్‌లో బహిరంగ సభను నిర్వహించాలనుకోవడంలోనే బీజేపీ లక్ష్యం వెల్లడవుతోందని ఆరోపించారు. 


లాలూ హెచ్చరిక

ఆర్జేడీ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కూడా ఆ పార్టీ కార్యకర్తలకు ఓ హెచ్చరిక చేశారు. బీజేపీ నేతల మనసులో మాయదారి ఆలోచనలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 


బెయిలు రద్దుకు సీబీఐ పిటిషన్

ఇదిలావుండగా, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణం కేసులో తేజస్వి బెయిలును రద్దు చేయాలని సీబీఐ కోరుతోంది. దర్యాప్తు అధికారులను ఆయన బహిరంగంగా బెదిరిస్తున్నారని ఆరోపించింది. దీంతో ఢిల్లీలోని స్పెషల్ కోర్టు ఆయనకు శనివారం నోటీసు జారీ చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ, తాను భయపడేది లేదన్నారు. కోర్టులోనే జవాబు చెబుతానని తెలిపారు. అయితే దర్యాప్తునకు తాను అన్ని విధాలుగానూ సహకరిస్తానని చెప్పారు. తనను చూసి కేంద్రం బెదిరిపోతోందన్నారు. బిహార్‌లో జరిగినదే కేంద్రంలో కూడా జరుగుతుందనేదే వారి భయమన్నారు. 


Updated Date - 2022-09-23T00:54:33+05:30 IST