Twitter: ట్విట్టర్‌ టాప్ ట్రెండ్‌లో #GoBackModi.. మోదీ రాకను ఇంతలా వ్యతిరేకిస్తోంది ఎవరంటే..

ABN , First Publish Date - 2022-05-26T21:18:51+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో.. అక్కడి అధికార యంత్రాంగం ప్రధానికి ఐదంచెల భద్రతను కల్పించే విషయంలో..

Twitter: ట్విట్టర్‌ టాప్ ట్రెండ్‌లో #GoBackModi.. మోదీ రాకను ఇంతలా వ్యతిరేకిస్తోంది ఎవరంటే..

చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో.. అక్కడి అధికార యంత్రాంగం ప్రధానికి ఐదంచెల భద్రతను కల్పించే విషయంలో తలమునకలై ఉంది. తమిళనాడులో ప్రధాని పర్యటనకు సంబంధించి చర్చ నడుస్తుంటే.. సోషల్ మీడియాలో మాత్రం ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ #GoBackModi హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు.. ఈ హ్యాష్‌ట్యాగ్‌కు ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడుకు చెందిన కొందరు నెటిజన్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ సిద్ధాంతాలు, ధరల పెరుగుదల, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, హిందీ భాషపై వివాదం, వ్యాపారవేత్తలకు ప్రధాని మోదీ కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు.. ఇలా రకరకాల కారణాలతో మోదీ చెన్నై పర్యటనను కొందరు తమిళ తంబీలు నిరసిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కానీ.. కొసమెరుపేంటంటే.. ఈ #GobackModi హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవడం ఇప్పుడు కొత్తేమీ కాదు. తమిళనాడులో మోదీ పర్యటించిన ప్రతిసారీ ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వస్తుండటం గమనార్హం.



ఇదిలా ఉంటే.. ఈసారి తమిళనాడు బీజేపీ సోషల్ మీడియా కూడా ఈ హ్యాష్‌ట్యాగ్‌ను తిప్పికొడుతూ #VanakkamModi హ్యాష్‌ట్యాగ్ చేస్తున్నారు. ఈ ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్ వార్ మోదీ చెన్నైకి చేరుకునే సమయానికి పరాకాష్టకు చేరేలా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు చెన్నైకి చేరుకుంటారు. పూర్తయిన 1,152 గృహాలను మోదీ ప్రారంభించనున్నారు. రూ.28,500 కోట్లతో చేపట్టనున్న ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. విమానాశ్రయంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు స్వాగతం పలకనున్నారు. ‘WELCOME MODI JI’ అంటూ మోదీకి స్వాగతం పలుకుతూ నగరంలో పోస్టర్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అంతేకాదు.. కొన్ని పోస్టర్లపై 2024లో మధురై నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరుతూ కార్యకర్తలు తమ అభిమతాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

Updated Date - 2022-05-26T21:18:51+05:30 IST