న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవడంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మంగళవారం ఆమె ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. వివిధ పార్టీల నేతలతో ఆమె బుధవారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే.
ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, మమత బెనర్జీ మంగళవారం న్యూఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించారు. శరద్ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపేందుకు ప్రతిపక్షాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని మీడియా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.
మమత శనివారం రాసిన లేఖలో రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు రావాలని 22 మంది నేతలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ 22 మంది నేతల్లో బీజేపీయేత పార్టీల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఉన్నారు.
16వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు జూలై 18న పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూలై 21న జరుగుతుంది. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఇప్పటి వరకు తన అభ్యర్థిని ప్రకటించలేదు. అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వీలుగా కూటమిలోని పార్టీలతోపాటు ప్రతిపక్షాలతో చర్చించే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు అప్పగించింది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24న ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి