ఎన్నికల ముంగిట బీజేపీకి కీలకాస్త్రం!

ABN , First Publish Date - 2020-10-01T08:24:52+05:30 IST

సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు.. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి...

ఎన్నికల ముంగిట బీజేపీకి కీలకాస్త్రం!

సీబీఐ కోర్టు తీర్పుతో కమలనాథుల్లో సమరోత్సాహం..

బెంగాల్లో పాగాకు సమాయత్తం


హిందూ ఓట్ల సంఘటితంపై కన్ను

బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌, సంఘ్‌పరివార్‌ నేతలందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు.. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తమకెతో కీలకమైన బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెలువడిన ఈ తీర్పు కచ్చితంగా తమకు విజయావకాశాలను అందిస్తుందని బీజేపీ నాయకత్వం విశ్లేషిస్తోంది. ప్రధానంగా బెంగాల్లో పాగా వేయడానికి ఇది రాజకీయంగా తమకెంతో ఉపకరిస్తుందని అంచనా వేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా 56 శాసనసభ స్థానాలకు, ఓ లోక్‌సభ స్థానానికి నవంబరు 3న జరిగే ఉప ఎన్నికల్లో గెలిచేందుకు బాటలు వేస్తుందని అనుకుంటోంది. బాబ్రీ విధ్వంసం ఆకస్మిక భావోద్వేగంతో జరిగిన సంఘటనేనని... దీని వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని సీబీఐ కోర్టు ప్రకటించడం.. బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతి సహా 32 మంది సంఘ్‌ నేతలను కేసు నుంచి విముక్తి కలిగించడం.. బీజేపీ నాయకత్వానికి మరో ప్రచారాస్త్రాన్ని అందించిందని విశ్లేషకులు అంటున్నా రు. ‘రామజన్మభూమి ఉద్యమం విజయవంతం కావడంతో పాటు రామాలయ నిర్మాణాన్ని సాకారం చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది. ఇదే సమయంలో బాబ్రీ విధ్వంసం వెనుక తన హస్తం లేనే లేదని చట్టబద్ధంగా చాటుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. 3 దశాబ్దాలకు పైగా తనపై మైనారిటీ వ్యతిరేకి అని ముద్ర వేసి న కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలపై ఎదురుదాడికి బీజేపీకి అవకాశం లభించింది’ అని వ్యాఖ్యానిస్తున్నారు.


మమతతో ఢీ..

నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో 42 స్థానాలకు గాను బీజేపీ అనూహ్యంగా 18 స్థానాలను కైవసం చేసుకుంది. ఏకంగా 40.64 శాతం ఓట్లు సాధించింది. 2014 ఎన్నికల్లో 34 ఎంపీ స్థానాలను గెలుచుకున్న పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ).. 43.69 శాతం ఓట్లతో 22 స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది. కాంగ్రెస్‌, వామపక్షాలు ఘోర పరాజయం చవిచూశాయి. బీజేపీ, టీఎంసీ మధ్య 3ు ఓట్లు మాత్రమే తేడా ఉండడంతో.. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన పట్టు సడలకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర జనాభాలో నాలుగో వంతు వరకు ఉన్న ముస్లిం ఓట్లపై కన్నేశారు. బీజేపీని మైనారిటీలకు వ్యతిరేక పార్టీగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీబీఐ కోర్టు తీర్పు తనకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇన్నేళ్లుగా తనపై టీఎంసీ, కాంగ్రెస్‌, వామపక్షాలు దుష్ప్రచారం చేశాయన్న సంగతి ఈ తీర్పుతో రుజువైందంటూ ప్రజల్లోకి వెళ్లడానికి అవకాశం లభించిందని.. అంతేగాక.. హిందూ ఓట్లు సంఘటితం కావడానికి దోహదపడుతుందని భావిస్తోంది. అక్టోబరు 28, నవంబరు 3, 7 తేదీల్లో జరిగే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏను విజయం దిశగా నడుపుతుందని కమలనాథులు భావిస్తున్నారు. తాజా పరిణామం కాంగ్రెస్‌, వామపక్షాలు, బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలకు రాజకీయంగా ఇబ్బంది కలిగించేదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించడంతోనే శతాబ్దాల వివాదానికి దాదాపు తెరపడింది. రామాలయ నిర్మాణం కూడా మొదలైంది. ఈ వాతావరణం బీజేపీకి తప్ప ఇతర పార్టీలకు రాజకీయంగా సానుకూలంగా లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలపై కుట్ర కేసును కోర్టు కొట్టివేయడం.. ఆయా పార్టీలను మరింత ఇబ్బంది పెట్టినా.. బీజేపీపై ఎదురుదాడికి కూడా వాటికి అవకాశం కలిగిందని చెబుతున్నారు. ఇన్నాళ్లూ ముస్లిం ఓ ట్ల చుట్టూ వాటి రాజకీయాలు నడిచాయని.. ఇప్పుడు హిందువుల ఓట్లను సైతం పొందడానికి వాటికి వీలు కలిగిందని విశ్లేషిస్తున్నారు. రామజన్మభూమి ఉద్యమం తో బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందిందని.. ఇప్పుడు ఆలయ నిర్మాణం కూడా జరుగుతుండడంతో హిందువుల్లో మునుపటి భావోద్వేగాలు తగ్గాయని.. అది రాజకీయంగా తమకు లాభిస్తుందని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. 

- సెంట్రల్‌ డెస్క్‌


మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలు కీలకం..

మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మనుగడకు నవంబరు 3వ తేదీన జరిగే 28 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు కీలకంగా మారాయి . జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధికులు విజయం సాధించడంపైనే చౌహాన్‌ సర్కారు భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు తీర్పు తమ గెలుపు అవకాశాలను మెరుగుపరచిందని కమలనాథులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని, అది పాటిస్తూ వస్తున్న మైనారిటీల బుజ్జగింపు విధానాన్ని తిప్పికొడుతూ ప్రచారం చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయని అనుకుంటున్నారు.

Updated Date - 2020-10-01T08:24:52+05:30 IST