తెలుగు ఓటీటీ ప్లాట్ఫార్మ్ ‘ఆహా’ త్వరలోనే అచ్చమైన తెలుగు వెబ్ ఒరిజినల్ సినిమా ‘సేనాపతి’తో సందడి చేయబోతోంది. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ ఓటీటీలో డెబ్యూ చేస్తున్న సినిమా ఇది. క్రైమ్ డ్రామా జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ పవన్ సాధినేని దర్శకుడు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించారు. తాజాగా ‘వరల్డ్ ఆఫ్ సేనాపతి’ పేరుతో ఈ సినిమాలోని పాత్రలు, వాటి లక్ష్యాలు, వాటి పరిసరాలు, వాటి జీవన విధానం వంటివాటిని ప్రేక్షకులకు తెలిసేలా ఒక స్నీక్‌పీక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ సినిమా సారాంశాన్ని బుర్రకథ రూపంలో వివరించారు. పౌరాణిక విశేషాలతో వివరించే ప్రయత్నం చేశారు. జానపద కళాకారుడి గాత్రంలో సేనాపతిని పరిచయం చేసిన తీరు, కృష్ణభగవానుడు ఈ కలియుగంలో ఉంటే ఎలా ఉండేది? అనే ప్రస్తావన ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకవేళ కృష్ణుడు రెండు అవతారాల్లో ఉంటే, ఒకే లక్ష్యంతో రెండు మార్గాల్లో ప్రయాణిస్తే... అనే ఆలోచన కూడా ఇంట్రస్టింగ్‌గా ఉంది. చెస్ బోర్డ్ మీద వినిపించే రాజేంద్రప్రసాద్ ఫైనల్ డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్. పోలీసుల నుంచి క్రిమినల్స్ వరకు, వాళ్ల సెట్‌బ్యాక్స్, వాళ్ల జీవితాల్లో డ్రామా... ఇలా చాలా అంశాలున్నాయి ఈ ‘వరల్డ్ ఆఫ్ సేనాపతి’లో. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ‘ఆహా’ అనేలా ఉంది.