పర్యాటక ప్రాంతాల్లో అగ్రి టూరిజం

ABN , First Publish Date - 2022-08-13T06:00:25+05:30 IST

జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో అగ్రి టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు(ఏడీఆర్‌) డాక్టర్‌ ఎం.సురేష్‌ కుమార్‌ తెలిపారు.

పర్యాటక ప్రాంతాల్లో అగ్రి టూరిజం
పరిశోధన స్థానంలో ప్రయోగాత్మకంగా సాగుచేసిన గ్లాడియోలస్‌

లంబసింగిలో అరుదైన పూల సాగు

ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ సురేష్‌ కుమార్‌


చింతపల్లి, ఆగస్టు 12: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో అగ్రి టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు(ఏడీఆర్‌) డాక్టర్‌ ఎం.సురేష్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు. జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఉండే విభిన్న వాతావరణం ఉత్తర భారతదేశాన్ని పోలి వుంటుందన్నారు. ఈ ప్రాంతంలో అరుదైన పంటల సాగుకు అనుకూలమన్నారు. ఈ ప్రాంత వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ పర్యాటక ప్రాంతాల్లో అగ్రి టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. తొలివిడతగా తాజంగి, లంబసింగి, చింతపల్లి ప్రాంతాలను ఎంపిక చేశామని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా అరుదైన పంటల సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఇప్పటికే లంబసింగి పరిసర ప్రాంతాల్లో ఆదివాసీ రైతులు స్ట్రాబెర్రీ, డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారన్నారు. పర్యాటక ప్రాంతాల్లో వలిసెల సాగు విస్తీర్ణం పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రధానంగా రహదారికి ఇరువైపులా వలిసెల సాగు చేపట్టేందుకు కృషి చేస్తామని చెప్పారు. లంబసింగి, చింతపల్లి ప్రాంతాలకు పర్యాటకులు అధికంగా శీతాకాలంలో వస్తున్నారని, కేవలం ప్రాంతీయ వాతావరణం, మంచు అందాలను ఆస్వాదించి వెళ్లిపోతున్నారన్నారు. ప్రాంతీయ వాతావరణంతో పాటు అదనంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు స్థానిక గిరిజనులు, రిసార్ట్స్‌ నిర్వాహకులతో అగ్రి టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. కుటుంబంతో సందర్శించే ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనేది ఆర్‌ఏఆర్‌ఎస్‌ లక్ష్యమన్నారు. 


లంబసింగిలో పూలసాగు

లంబసింగిలో ఈ ఏడాది అరుదైన పూల సాగు చేపట్టాలని ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని ఏడీఆర్‌ డాక్టర్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. 2021లో ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం ఉప కులపతి విష్ణువర్ధన్‌ ప్రోత్సాహంతో స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆర్గానిక్‌ కార్యక్రమంలో భాగంగా ప్రయోగాత్మకంగా చేపట్టిన పూల సాగు విజయవంతమైందన్నారు. పరిశోధన స్థానంలో సాగుచేసిన శాస్త్రవేత్తలు గ్లాడియోలస్‌, చైనా ఆస్టర్‌, తులిప్‌, లిల్లియమ్‌, జెర్బరా, ముద్దబంతి, నేల సంపంగి, చామంతి పూల సాగు చేపట్టారన్నారు. ఈ పూల సాగు ఆశాజనకంగా ఉందన్నారు. ఈ ఏడాది పరిశోధన స్థానంతో పాటు లంబసింగిలోనూ పూల సాగు చేపట్టనున్నామన్నారు. ప్రధానంగా తాజంగి, లంబసింగి, చెరువులవేనం ప్రాంతాల్లో స్థానిక గిరిజనులు, రిసార్ట్స్‌ నిర్వాహకులతో కలిసి పూల సాగుచేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెప్టెంబరులో నాట్లు వేస్తామని, సీజన్‌ నాటికి పూలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.


పరిశోధన స్థానంలో నమూనా వరి నాట్లు క్షేత్రం

ప్రాంతీయ పరిశోధన స్థానంలో పర్యాటకుల కోసం నమూనా వరి నాట్లు క్షేత్రం ఏర్పాటు చేస్తామని ఏడీఆర్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. పరిశోధన స్థానంలో ఒక మడి(పంట పొలం) హైజనిక్‌గా దమ్ముచేసి నాట్లుకు సిద్ధంగా ఉంచుతామన్నారు. సందర్శనకు వచ్చిన పర్యాటకులు ఈ పొలంలో సరదాగా నాట్లువేసి ఎంజాయి చేసే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆసక్తి కలిగిన పర్యాటకులు నాట్లువేస్తూ, దుక్కి చేస్తూ ఫొటోలు తీసుకుని ఎంజాయ్‌ చేస్తారని చెప్పారు. 


చిరుధాన్యాల భోజనం

పరిశోధన స్థానంలో పర్యాటకులకు చిరుధాన్యాలతో సంప్రదాయ భోజనం ఏర్పాటుచేసేందుకు ఓపెన్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేస్తామని ఏడీఆర్‌ తెలిపారు. లంబసింగి వచ్చిన పర్యాటకులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోఽధన స్థానాన్ని సందర్శిస్తున్నారన్నారు. పరిశోధన స్థానానికి వచ్చిన పర్యాటకులకు చిరుధాన్యాలు(రాగి, సామ, కొర్ర)లతో తయారుచేసిన ఆహారాన్ని విక్రయిస్తామని చెప్పారు. దీని కోసం లంబసింగి రిసార్ట్స్‌ నిర్వాహకులతో కలిసి ఓపెన్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. పరిశోధన స్థానానికి వచ్చిన పర్యాటకులు చిరుధాన్యాల ఆహారం తీసుకుని విభిన్న అనుభూతిని పొందుతారని తెలిపారు.


సందర్శనకు ఔషధ మొక్కల క్షేత్రం

పరిశోధన స్థానంలో తూర్పుకనుముల్లో లభించే 250 రకాల ఔషధ మొక్కలను సాగుచేస్తున్నామని, పర్యాటకు సందర్శన కోసం ఔషధ మొక్కల క్షేత్రాన్ని కూడా సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. పరిశోధన స్థానంలో రాష్ట్రపతి అవార్డు పొందిన ఆయుర్వేద వైద్యుడు కృష్ణారావు విధుల్లో ఉన్నారన్నారు. ఈ ఔషధ మొక్కలు ఎటువంటి వ్యాధులకు ఉపయోగపడతాయనే విషయాన్ని సందర్శకులకు ఆ వైద్యుడు వివరిస్తారని తెలిపారు.


Updated Date - 2022-08-13T06:00:25+05:30 IST