తగ్గిన ధాన్యం దిగుబడి

ABN , First Publish Date - 2020-12-05T05:37:44+05:30 IST

తగ్గిన ధాన్యం దిగుబడి

తగ్గిన ధాన్యం దిగుబడి
ప్రతాప్‌సింగారంలో ధాన్యాన్ని లారీల్లో లోడ్‌చేస్తున్న హమాలీలు

  • ముగిసిన ధాన్యం కొనుగోళ్లు 
  • అన్నదాతలను నట్టేట ముంచిన భారీవర్షాలు, వరదలు 
  • గత యాసంగి సీజన్‌ ధాన్యం సేకరణలో మనమే టాప్‌
  • ఈసారి పంటబాగా పండినా చేతికి వచ్చింది సగమే  
  • మూడుసెంటర్లలో కలిపి 84,842 బస్తాల ధాన్యం సేకరణ


ఘట్‌కేసర్‌ రూరల్‌: ‘‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’’ అన్నట్లుగా ఉంది అన్నదాతల పరిస్థితి. పంటలకు రోగాలు లేకపోవడంతో దిగుబడి బాగా ఉంటుందనుకుంటే వరుణుడు రైతుల నోట్లో మట్టికొట్టి వెళ్లాడు. గత యాసంగి సీజన్‌ ఎదులాబాద్‌, ప్రతాప్‌ సింగారం, మాదారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి లక్షా26 వేల 255 బస్తాల ధాన్యాన్ని సేకరించి జిల్లాలోనే ఆగ్రస్థానంలో నిలిచాము. వానాకాలం సీజన్‌లో పంట బాగారావడంతో మళ్లీ జిల్లాలో మన మండలం నుంచి అధికంగా ధాన్యాన్ని సేకరిస్తామనుకున్న అధికారులకు భారీవర్షాలు కురిసి అనుకున్నదానికన్నా సగం ధాన్యం వచ్చినట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. మండలంలో ఈ సీజన్‌లో 4200 ఎకరాల్లో వరిసాగు చేశారు. దోడ్డు రకాలు 60శాతం, సన్నాలు 40శాతం విత్తనాలు వేశారు. పంట బాగా రావడంతో ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని సేకరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌ డీసీఎంఎస్‌, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఘట్‌కేసర్‌ మండలంలో ఎదులాబాద్‌, మాదారం, ప్రతాప్‌సింగారం గ్రామాల్లో అక్టోబర్‌ 28న రాష్ట్ర ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డిలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు మద్దతుధర కల్పించాలని ప్రభుత్వం ఏ గ్రేడు ధాన్యానికి రూ.1885, కామన్‌ రకానికి రూ.1835లను చెల్లించింది. ఎదులాబాద్‌ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఎదులాబాద్‌తో పాటు మర్రిపల్లిగూడ, కొత్తగూడెం, ఘణపురం, పోతరాజిగూడ, ఘట్‌కేసర్‌ గ్రామాల రైతులు, మాదారం సెంటర్‌కు మాదారంతో పాటు అంకుశాపూర్‌, అవుశాపూర్‌ గ్రామాల రైతులు, ప్రతాప్‌సింగారం కేంద్రానికి ప్రతాప్‌సింగారంతో పాటు కొర్రెముల, పోచారం, కాచవానసింగారం, ముత్వేల్లిగూడ, వెంకటాపూరం తదితర గ్రామాల రైతులు ధాన్యాన్ని విక్రయించడానికి తరలించారు. వరిపంట ప్రారంభంలో బాగుండటంతో వానాకాలం సీజన్‌లో దాదాపు రెండులక్షల బస్తాల ధాన్యం సేకరించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వరికోత సమయంలో వచ్చిన భారీ వర్షాలకు, వరదలకు వరిపంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీంతో సగానికి సగం పంట నష్టం జరిగింది. మూడు సెంటర్లలో కలిపి 84 వేల842 బస్తాల ధాన్యాన్ని సేకరించారు. మాదారం ధాన్యం కేంద్రం నుంచి 23,203 బస్తాలు, ఎదులాబాద్‌ సెంటర్‌ నుంచి 38,289, ప్రతాప్‌సింగారం సెంటర్‌ నుంచి 23,350 బస్తాల ధాన్యాన్ని సేకరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ఇప్పటివరకు 95శాతం మందికి తమ బ్యాంకుఖాతాల్లో డబ్బులు వచ్చాయి. యాసంగి సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌లో 41వేల 413 బస్తాల ధాన్యంతగ్గింది. పంటలకు ఈసారి ఎలాంటి వ్యాధులు లేక పంటబాగా వస్తుందనుకునే సమయానికి వర్షాలతో నట్టేట మునిగి అప్పుల పాలయ్యామని రైతులు అవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు పంటనష్టం రాసుకొని వెళ్లినా ఇప్పటి వరకు పరిహారం అందలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


తెలంగాణసోన వేస్తే కొంపముంచింది: చింతపంటి లింగంయాదవ్‌, రైతు వెంకటాపూర్‌


రెండెకరాల్లో తెలంగాణసోన విత్తనాలు వేస్తే 20బస్తాల ధాన్యం మాత్రమే వచ్చింది. చివరి దశలో వరికి కాండంతొలుచు పురుగు వచ్చి తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనికి వర్షాలు తోడవడంతో చేతికొచ్చిన పంట నష్టాన్ని మిగిల్చింది. 


సగానికి సగం పంట పోయింది: ఉప్పు లింగేశ్వర్‌రావు, రైతు ఎదులాబాద్‌


గత యాసంగి సీజన్‌లో 1300 బస్తాల ధాన్యాన్ని విక్రయిస్తే రూ.8లక్షల 50వేల బిల్లు వస్తే ఇప్పుడు మాత్రం 800బస్తాల ధాన్యం విక్రయించాము. ఇందుకు రూ.5లక్షల బిల్లు వచ్చింది. రెండు మూడురోజులకే డబ్బులు బ్యాంకులో ఒకేసారి జమయ్యాయి.


వర్షాలతో తీవ్ర నష్టం: ఎంఎ.బాసిత్‌, మండల వ్యవసాయ అధికారి 


మండలంలోని మాదారం, ఎదులాబాద్‌, ప్రతాప్‌సింగారం గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను నిలిపివేశాం. ఈసీజన్‌లో వరికి వ్యాధులు సోకలేదు. కానీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. పంట నష్టం వివరాలను సేకరించి జిల్లా అధికారులకు నివేదిక పంపించాం.

 రెండు లక్షల బస్తాల ధాన్యం వస్తుందనుకున్నాం : పాండురంగం, డీసీఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌


మండలంలోని అన్ని గ్రామాలలో వరికోతకు ముందు పంటను చూస్తే దాదాపు రెండు లక్షల బస్తాల ధాన్యం వస్తుందని అంచనా వేసుకున్నాము. దాని ప్రకారమే ప్రణాళికలు వేసుకొని బస్తాలు, హమాలీల కొరత లేకుండా చూడాలని అనుకున్నాం. కాని ఇప్పటి వరకు 84,842 బస్తాల ధాన్యాన్ని సేకరించాం. ఇంకా మూడువేల బస్తాల ధాన్యం వస్తుండొచ్చు.  


Updated Date - 2020-12-05T05:37:44+05:30 IST