మిత్ర పురుగులను సంరక్షించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-17T05:46:59+05:30 IST

వరి సాగులో రైతులు మిత్ర పురుగులను సంరక్షించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు.

మిత్ర పురుగులను సంరక్షించుకోవాలి
చేలో మిత్ర పురుగులు పరిశీలిస్తున్న వీరవాసరం సిబ్బంది, రైతులు

వీరవాసరం, ఆగస్టు 16: వరి సాగులో రైతులు మిత్ర పురుగులను సంరక్షించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. విచక్షణారహితంగా చేలల్లో ఎరువు, పురుగుల మందులు వాడడం వలన రైతులకు మేలు చేసే మిత్ర పురుగులు నశిస్తాయని, దీనితో పంటలపై తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉందని వివరించారు. మండలంలోని వీరవాసరం, మడుగుపోలవరం గ్రామాల్లో మంగళవారం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. పంటచేలు మిత్ర పురుగులను గుర్తించే విధానం తెలియజేశారు. క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఎరువులు పురుగుల మందులను వాడకం ద్వారా సాగు ఖర్చును తగ్గించుకోవచ్చని తెలిపారు. వీఏఏ డి.విజయకుమార్‌, కె.నారాయణరావు, రైతులు పాల్గొన్నారు.


ఎరువుల వాడకంలో నియంత్రణ అవసరం


కాళ్ళ: వరి సాగులో ఎరువులు వాడకం తగ్గించాలని ఏడీఏ శ్రీనివాసరావు సూచించారు. సీసలిలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి సీహెచ్‌ జయవాసుకి ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం బడి కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడారు. నాట్లు వేసిన 40 రోజులు వరకు  పురుగు మందులు వినియోగం వద్దన్నారు. సాగుకు ఉపయోగపడే మిత్ర పురుగులకు ఎలాంటి హాని జరగకుండా చూడటం సాగులో ముఖ్యమని రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా ఏవో జయవాసుకి రైతులకు పలు సూచనలు చేశారు. సాగులో పురుగు మందులు, ఎరువులు పిచికారీ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తూ ముందస్తు జాగ్రత్తలతో పాటు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే తీసుకోవలసిన చర్యలను వివరించారు. కలుపు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మందులు రైతులకు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బిళ్ళకుర్తి ధనలక్ష్మి, శ్రీనివాస్‌, రైతు లు, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T05:46:59+05:30 IST