జలకళ.. సాగు భళా

ABN , First Publish Date - 2022-08-19T05:30:00+05:30 IST

ఒకప్పుడు వర్షాధార పంటలతోనే సరిపెట్టుకున్న రైతులు నేడు మునుపెన్నడూ లేనివిధంగా ఈ వానాకాలం సీజన్‌లో వరి సాగు వైపు మొగ్గుచూపారు.

జలకళ.. సాగు భళా
శనిగరం ప్రాజెక్టు కింద సాగు చేసిన వరి


పచ్చని పొలాలుగా మారుతున్న పడావు భూములు 

కోహెడ మండలంలో పెరుగుతున్న వరి సాగు విస్తీర్ణం


కోహెడ, ఆగస్టు 19 : ఒకప్పుడు వర్షాధార పంటలతోనే సరిపెట్టుకున్న రైతులు నేడు మునుపెన్నడూ లేనివిధంగా ఈ వానాకాలం సీజన్‌లో వరి సాగు వైపు మొగ్గుచూపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు, చెరువులు కళకళలాడుతుండడంతో వరిసాగు ఊపందుకున్నది. జిల్లాలోని కోహెడ మండలం శనిగరం మధ్యతర ప్రాజెక్టు, చిన్న నీటి పారుదల సింగరాయ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో అన్నదాతలకు సాగు నీటి చింత తీరింది. కరువు సమయంలో పడావుంచిన భూములను సైతం సాగులోకి తీసుకొచ్చారు. సాధారణ విస్తీర్ణాన్ని మించి వరి సాగు చేస్తున్నారు. 

మండలంలోని శనిగరం ప్రాజెక్టు, సింగరాయ ప్రాజెక్టు వరుసగా మూడేళ్లు జలకళను సంతరించుకుంది. శనిగరం ప్రాజెక్టు సామర్థ్యం ఒక టీఎంసీ కాగా ప్రాజెక్టు నిండితే కోహెడ మండలంలోని తంగళ్లపల్లి, శనిగరం, బెజ్జంకి మండలంలోని బెజ్జంకి, రేగులపల్లి, పోతారం, దాచారం, ముత్తన్నపేట్‌, గాగిల్లాపూర్‌, గుగ్గిళ్ల గ్రామాల పరిధిలో 5,100 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. అలాగే సింగరాయ ప్రాజెక్టు పరిధిలో రెండు వేల ఎకరాలకుపైగా వరి సాగు విస్తీర్ణం ఉంది. ప్రస్తుతం ప్రధాన కాలువలు పూడ్చుకుపోవడంతో మండలంలోని కూరేళ్ల గ్రామంలో రెండు చెరువులు నింపి వరి పంట సాగుకు నీళ్లు అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో సమృద్ధిగా నీరు లేనప్పుడు పత్తి పంటను సాగు చేసేవారు. మూడు సంవత్సరాలుగా నీరు సమృద్ధిగా ఉండడంతో కొత్త ఆయకట్టు సాగులోకి వస్తున్నది. కాలువల్లో నీరు పారుతుడడంతో అన్నదాతలు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. కరువు సమయంలో పడావుగా ఉన్న భూములను సైతం సాగులోకి తీసుకొస్తున్నారు. 

 22 వేల ఎకరాల్లో వరి సాగు

రైతులకు సాగునీరు సమృద్ధిగా లభిస్తుండడంతో వరి సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతుంది. మండలంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం కంటే మించి సాగవుతుంది. మండలంలో గతంలో వానాకాలం సీజన్‌లో 15వేల నుంచి 17వేల ఎకరాల వరకు వరి పంట సాగు చేసేవారు. గత సంవత్సరం ఖరీ్‌ఫలో 18 వేల ఎకరాల్లో వరి సాగు అయింది. ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌లో మండలంలో 22 వేల ఎకరాలకుపైగా వరి సాగు చేసినట్లు  వ్యవసాయ శాఖ అధికారులు అంచనా. సెప్టెంబర్‌ రెండో వారం వరకు వరి నాట్లు వేసే అవకాశం ఉండడంతో వరి సాగు విస్తీర్ణం ఇంకా పెరగనుంది.

వరి సాగు విస్తీర్ణం పెరిగింది

సమృద్ధిగా వర్షాలు కురియడంతో శనిగరం ప్రాజెక్టు కింద ఆయకట్టులో వరిసాగు విస్తీర్ణం పెరిగింది. ప్రతి యేటా ప్రాజెక్టు నిండుతుంది. పడావు పడిన భూములను కూడా వరి సాగుకు ఉపయోగిస్తున్నాం. ఇక కరువు పోయినట్లే.

- గాజె తిరుపతి, రైతు, శనిగరం


Updated Date - 2022-08-19T05:30:00+05:30 IST