అన్నదాతకు బెంగ

ABN , First Publish Date - 2022-05-16T05:39:36+05:30 IST

మరికొన్ని రోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. దీంతో వర్షాలు పడితే విత్తనాలు విత్తేందుకు అన్నదాతలు ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ సారి రుతుపవనాలు కొంచం ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో.. విత్తనాల కోసం మదనపడుతున్నారు రైతులు. కర్షకుల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, నాసీరకం విత్తనాలను దళారులు అంటగట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ఈ మారు కూడా అలాంటి బెడద తప్పదేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.

అన్నదాతకు బెంగ

నాసిరకం విత్తనాలపై కలవరం
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రమాదం
గ్రామాల్లో అధికారుల నిఘా కరువు
జిల్లాలో గత ఏడాది ఆరు కేసుల నమోదు
నివారణకు టాస్క్‌ఫోర్స్‌ బృందాల ఏర్పాటు


మహబుబాబాద్‌, అగ్రికల్చర్‌ మే 15 :
మరికొన్ని రోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. దీంతో వర్షాలు పడితే విత్తనాలు విత్తేందుకు అన్నదాతలు ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ సారి రుతుపవనాలు కొంచం ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో.. విత్తనాల కోసం మదనపడుతున్నారు రైతులు. కర్షకుల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, నాసీరకం విత్తనాలను దళారులు అంటగట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ఈ మారు కూడా అలాంటి బెడద తప్పదేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.

అయితే నకిలీ విత్తనాలు అరికట్టడానికి రాష్ట్రప్రభుత్వం ఆదేశం మేరకు మహబూబాబాద్‌  జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ అధికారుల బృందం ఏర్పాటైంది. మరోవైపు రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ అధికారుల బృందాలు పలు మండలాల్లో విత్తన దుకాణాలపై దాడులు ప్రారంభించారు. కాగా, గ్రామాల్లో పటిష్టమైన నిఘా లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి నకిలీ విత్తనాలు, ప్రభుత్వం అనుమతి లేని విత్తనాలు వచ్చే ప్రమాదం పొంచిఉంది.

గత ఏడాది దొరికాయి ఇలా..

గత సంవత్సరం జిల్లాలో ఆరు కేసులు నమోదయ్యాయి. జూన్‌ 4న కొత్తగూడ మండలం ఎంచగూడెంలో రూ.2.32 లక్షల విలువైన ప్రభుత్వ అనుమతిలేని 16 క్వింటాళ్ల ధాన్యం విత్తనాలను పట్టుకుని, ఒకరిని అరెస్టు చేశారు. అదేనెల 6న మహబూబాబాద్‌లో నకిలీ మిర్చి ఎఫ్‌1 హైబ్రిడ్‌ విత్తనాలను గుంటూరు జిల్లా నుంచి తీసుక వచ్చి విక్రయిస్తుండగా.. రూ. 13.56 లక్షల విలువ చేసే 32 కిలోల మిర్చి విత్తనాలను పట్టుకుని ముగ్గురు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు.

గత జూన్‌నెల 14న వరంగల్‌  విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంటు అఽధికారులు మానుకోట జిల్లా కేంద్రంలోని ఓ అగ్రిమాల్‌ దుకాణంపై దాడులు చేసి రూ.14,100 విలువ చేసే 4.23 కిలోల కాల పరిమితి దాటిన కూరగాయల విత్తనాలను పట్టుకుని ఒకరిని అరెస్టు చేశారు. అదే విధగా మరిపెడలో జూన్‌ 4న రూ. 3.33 లక్షల విలువ చేసే 5.43 కిలోల ప్రభుత్వం అనుమతిలేని మిర్చి విత్తనాలను రాత్రి సమయంలో ఇంటింటికి తిరిగి అమ్ముతుండగా అధికారులు పట్టుకుని ఒకరిని అరెస్టు చేశారు. 7న రూ. 4.33 లక్షల విలువ చేసే 7.90 కిలోల మిర్చి విత్తనాలను పట్టుకుని ఒకరిని అరెస్టు చేశారు. 19న రూ. 84వేలు విలువ చేసే 1.03 కిలోల మిర్చి విత్తనాలను పట్టుకొని ఒకరిపై 6ఏ కేసు నమోదు చేశారు.

టాస్క్‌ఫోర్స్‌ బృందాల ఏర్పాటు..

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం పోలీసు, వ్యవసాయ అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో వ్యవసాయ అధికారి, ఎస్సై, సీడ్స్‌ సర్టిఫికేషన్‌ అధికారి కలిపి మండలస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని, డివిజన్‌ స్థాయిలో డీఎస్పీ, ఏడీఏ, సీడ్స్‌ సర్టిఫికేషన్‌ అధికారి, జిల్లాస్థాయిలో ఎస్పీ, జిల్లా వ్యవసాయ అధికారి, సీడ్స్‌ సర్టిఫికేషన్‌ అధికారులు కలిసి టాస్క్‌ఫోర్స్‌ బృందాలుగా కలిసి పనిచేస్తాయి. దీంతో పాటు రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ బృందాలు జిల్లాలోని విత్తన దుకాణాలపై దాడులు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ బృందం మహబూబాబాద్‌, కురవి, మరిపెడ, తొర్రూరు ప్రాంతాల్లో శనివారం ఒకేరోజు దాడులు నిర్వహించి, దడ పుట్టించింది.

ఇతర జిల్లాల నుంచి నకిలీ విత్తనాలు.. మిర్చి నారు..

గుంటూరు, ఖమ్మం, వరంగల్‌ ప్రాంతాల నుంచి మహబూబాబాద్‌ జిల్లాకు ప్రభుత్వం అనుమతి లేని నకిలీ వితనాలు సరఫరా, మిర్చినారు వస్తుంది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో కంపెనీల ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని రైతులకు విక్రయిస్తూ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. గిరిజన రైతుల అమాయకత్వాన్ని నిరక్ష రాస్యతను ఆసరా చేసుకొని రైతులకు నకిలీ విత్తనాలు అంటకట్టి నట్టేట ముంచుతున్నారు. గ్రామాలతో పాటు మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని పలు విత్తనషాపుల్లో నకిలీ మిర్చి విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది.

గత సంవత్సరం కూడా మానుకోటలో విక్రయించిన విత్తనాలు మిర్చిపంట పండక పోవడంతో అనేక గ్రామాల రైతులు విత్తన దుకాణాల ఎదుట ఆందోళనలు చేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో రైతులకు కొంతమేర నష్టపరిహారం అందించి పోలీసు కేసులు కాకుండా జాగ్రత్తపడ్డారు. జిల్లాలోని గ్రామాల్లో వ్యవసాయ అధికారుల అప్రమత్తం, నిఘాలేక పోవడంతోనే నకిలీ విత్తనాల బెడద ఎక్కువైంది.  మహబూబాబాద్‌ జిల్లాలో ఈ ఏడాదైనా విత్తన సీజన్‌లో టాస్క్‌ఫోర్స్‌  బృందాల నిఘా పెంచి నకిలీ విత్తనాలు రాకుండా అరికడతరా..? లేదా..! వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-05-16T05:39:36+05:30 IST