ముందస్తు దాళ్వా సాధ్యమేనా..?

ABN , First Publish Date - 2020-11-30T05:09:50+05:30 IST

మందస్తు దాళ్వా సాధ్యమేనా..? నివర్‌ తుఫాన్‌తో సార్వా పనులు ఆలస్యమవుతున్నాయి. దీనితో ముందస్తు దాళ్వాపై రైతులు ఆందోళనలో ఉన్నారు.

ముందస్తు దాళ్వా సాధ్యమేనా..?

నివర్‌ తుఫాన్‌తో నిలిచిన సార్వా మాసూళ్లు

మాసూళ్లకు మరికొన్ని రోజులు ఆగాల్సిందే

ముంచుకొస్తున్న దాళ్వా గడువుతో రైతుల ఆందోళ

భీమవరం రూరల్‌, నవంబరు 29 :  మందస్తు దాళ్వా సాధ్యమేనా..? నివర్‌ తుఫాన్‌తో సార్వా పనులు ఆలస్యమవుతున్నాయి. దీనితో ముందస్తు దాళ్వాపై రైతులు ఆందోళనలో ఉన్నారు. ముమ్మరంగా సార్వా పంట మాసూళ్లు జరిగే సమయంలో నివర్‌ తుఫాన్‌ పంటలను నిండా ముంచింది. సార్వా ఒబ్బిడి కాకుండా దాళ్వా నారుమడులు ఎలా అనే ఆందోళన నెలకొంది. అయితే జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మార్చి నెలాఖరుకు కాలువలు కట్టేస్తామని చెప్పడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లాలో ఇంకా సార్వాలో లక్ష ఎకరాలుపైనే పంట మాసూళ్ళు జరగాల్సి ఉన్నది. వర్షాలతో చేలలో నీరు చేరడం వలన అవి పూర్తిగా తగ్గితేనేగాని మాసూళ్లుకు వెళ్ళలేరు. వచ్చే నెలలో వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ తెలపడం మాసూళ్లు ఎంత వరకు అవుతాయో అంతుపట్టని విషయంగా మారింది. ఈ నేపథ్యంలో డెల్టాలో డిసెంబరు నెల 10లోపు దాళ్వా నారుమడులు అసాధ్యమేనని అనిపిస్తున్నది. మెట్ట ప్రాంతంలో  కొన్నిచోట్ల పంట మాసూళ్ళు అయినందున అక్కడ సాధ్యమయ్య అవకాశం ఉన్నప్పటికీ తుఫాన్‌లు పడితే అక్కడ కూడా నారుమడులు జాప్యం అయ్యే అవకాశం ఉంది.

గతంలోను ఇంతే..

ముందస్తు దాళ్వా అన్నది రైతులకు అంతగా కలిసిరావడం లేదనిపిస్తున్నది. గతంలోను రెండు మూడు పర్యాయాలు కాల్వల ఆధునికీకరణ, నీటి ఎద్దడి అనే ఆలోచనలతో అప్పట్లో అధికార యంత్రాంగం రైతులకు సూచనలు ఇచ్చినా.. ఇంతలో సార్వా మాసూళ్లు అల్పపీడనాలు, వాయుగుండాలతో ఆలస్యమైంది. ఈసారి అలాంటి పరిస్థితే పునరావృతమైంది. 

Updated Date - 2020-11-30T05:09:50+05:30 IST