రబీ 120 రోజుల పంటే..

ABN , First Publish Date - 2020-11-25T05:15:05+05:30 IST

గోదావరి డెల్టా కాలువలను మార్చి 31న మూసివేస్తాం. అందువల్ల రబీ సాగు ముందుగానే మొదలు పెట్టాలి. 120 రోజుల్లో పంట వచ్చే వరి విత్తనాలు వాడుకోవాలి.

రబీ 120 రోజుల పంటే..
సమావేశంలో మంత్రి వనిత, ఎంపీలు భరత్‌,చంద్రబోస్‌

విత్తనాలు వెదజల్లితేనే మేలు..

మార్చి 31నే కాలువల మూత

పూర్తి ఆయకట్టుకు నీరు.. 

పశ్చిమ డెల్టాకు జూన్‌ 5న విడుదల 

31కి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తి

ఉభయ గోదావరి జిల్లాల ఐఏబీసమావేశంలో నిర్ణయం

 రేపు పశ్చిమ ప్రజా ప్రతినిధులతో సమీక్షించి యాక్షన్‌ ప్లాన్‌ 


రాజమహేంద్రవరం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి):‘గోదావరి డెల్టా కాలువలను మార్చి 31న మూసివేస్తాం. అందువల్ల రబీ సాగు ముందుగానే మొదలు పెట్టాలి. 120 రోజుల్లో పంట వచ్చే వరి విత్తనాలు వాడుకోవాలి. ఆకుమడులు వేసి, నాట్లు వేస్తే ఈ సీజన్‌లో సమయం సరిపోదు. అందువల్ల విత్తనాలు వెదజల్లే పద్ధతిలోనే రబీ సాగుకు రైతులు సిద్ధం కావడం మంచిది. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తి చేసేందుకు మార్చి 31 నుంచి పోలవరం దిగువకు నీటిని నిలుపుదల చేస్తారు. అందువల్ల తర్వాత గోదావరికి నీరు రాదు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్‌, రెవెన్యూ, ఆర్‌డబ్య్లుఎస్‌, వ్యవసాయ శాఖ అఽధికారులు సమన్వయ పరుచుకుని యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలి’ అని ఉభయ గోదావరి జిల్లాల నీటిపారుదల సలహా మండలి(ఐఏబీ) నిర్ణయించింది. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో డిప్యూటీ సీఎం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రైతులు తమ సూచనలు చెప్పిన తర్వాత జిల్లా కలెక్టర్‌ డి.మురళీధరరెడ్డి, పశ్చిమ గోదావరి కలెక్టర్‌ ముత్యాలరాజు మార్చి 31నే కాలువలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. 


రేపు పశ్చిమ ప్రజా ప్రతినిధులతో సమీక్ష

పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 26న మళ్లీ ప్రజా ప్రతినిధులతో సమీక్షించి యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటిస్తామని కలెక్టర్‌ ముత్యాలరాజు ప్రకటించారు. ఈ సీజన్‌లో మూడు డెల్టాల్లోనూ పూర్తి ఆయకట్టుకు నీరివ్వడానికి నిర్ణయించారు. 2020–21 రబీ అంచనాల ప్రకారం తూర్పు గోదావరిలో 4,36,533 ఎకరాలు, పశ్చిమ గోదావరిలో 4,60,000 ఎకరాలతోపాటు మంచినీటి అవసరాలకు మొత్తం 90.22 టీఎంసీల నీరు అవసరం. కానీ 68.553 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అందువల్ల తూర్పు గోదావరిలో 3,60, 533 ఎకరాలు, పశ్చిమ గోదావరిలో 3,79,914 ఎకరాలకు నీరు సరిపోతుంది. కానీ పూర్తి ఆయకట్టుకు నీరివ్వడం కోసం డ్రెయిన్లపై అడ్డుకట్టలు వేసి, ఇంజన్ల ద్వారా నీరు అందివ్వడానికి నిర్ణయించారు. రబీ కాలువలు డిసెంబరు 1న తెరిచి, మార్చి 31న మూసివేస్తామని, 2021 ఖరీఫ్‌కు జూన్‌ 10న కాలువలకు నీరు వదులుతామని కలెక్టర్‌ ముత్యాలరాజు ప్రకటించారు. మార్చి 31 వరకూ పోలవరం కాఫర్‌ డ్యామ్‌ నుంచి 10 వేల క్యూసెక్కుల నీరు అవసరమని అధికారులు ప్రతిపాదించగా, అక్కడి సీఈ నాగిరెడ్డి మాత్రం 9 వేల క్యూసెక్కుల నీరే ఇవ్వగలమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన పశ్చిమ డెల్టా కాలువలను జూన్‌ 5న తెరవడానికి నిర్ణయించారు. మార్చి 31 కాఫర్‌ డ్యామ్‌ వద్ద తూములు పూర్తిగా మూసివేసి,కాఫర్‌ డ్యామ్‌లో మిగిలిన భాగాన్ని నిర్మిం చడానికి నిర్ణయించడం వల్ల పలు ఎత్తిపోతల పథకాలకు నీరు ఇవ్వలేమని అధికారులు ప్రకటించారు. 


120 రోజుల పంటే సరైంది : మంత్రి రంగనాథరాజు

గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ వాస్తవానికి డిసెంబర్‌ 1న రబీ నాట్లు మొదలెట్టి జనవరి 10కి పూర్తి చేస్తే సమస్య ఉండదు. మార్చి 20 వరకూ పశ్చిమ డెల్టాకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలి. 120 రోజుల పంటే సరైంది. మార్చిలో తమకు ఏడు వేల క్యూసెక్కుల వంతున నీరివ్వాలి. పోలవరం పనులకు ఆటంకం రాకూడదని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ఈఈ, డీఈలు క్షేత్రస్థాయిలో తిరిగితే సమస్యలు ఉండవ న్నారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు మాట్లాడుతూ పోలవరం పూర్తి కావాలంటే, రబీ సీజన్‌లో సమన్వయంతో యాక్షన్‌ప్లాన్‌ చేసుకోవాలన్నారు.  . సమావేశంలో చెల్లుబోయిన వేణుగోపాల్‌, పినిపే విశ్వరూప్‌, తానేటి వనిత, ఎంపీలు పిల్లి సుభాసుచంద్రబోసు, మార్గాని భరత్‌, వంగా గీత, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, అబ్బయ్య చౌదరి, ఇరిగేషన్‌ సీఈ శ్రీధర్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.  


నిమ్మల వర్సెస్‌ కురసాల

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మంత్రి కురసాల కన్నబాబు మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ గతేడాది నీటి ఎద్దడి వల్ల పంట నష్టపోయింది. ఈ ఏడాది డిసెంబరు 10 వరకూ వరి కోతలు పూర్తి కావు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ 20 వరకూ నీరివ్వాలి. 120 రోజుల పంట మంచిదే. కానీ ఎంటీయూ 1121, 1156 రకాల్లో కొన్ని టికి గింజలపై మచ్చలు రావడం వల్ల మిల్లర్లు కొనడం లేదు. ఈసారి కొనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో సమస్యను పత్రికల్లో వచ్చిన క్లిప్‌లను చూపించారు. అవి ఏ పేపరు కటింగులని మంత్రి వేణు ప్రశ్నించగా మీ పేపరు కూడా ఉందని జవాబిచ్చారు. ఇంతలో మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ పాత కటింగ్‌లు చూపి సమస్యను పక్కదారి పట్టించవద్దని, మీ హయాంలో చిన్న ఎత్తిపోతల పఽథకం కూడా కట్టలేదు. పట్టిసీమ, పురుషోత్తపట్నాలకే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రైతులకు సమస్య రాకూడదని తాను చెబుతున్నానని నిమ్మల అన్నారు. వ్యక్తిగత విషయాలు ఇక్కడ వద్దని మంత్రి అనగా, ఇవి వ్యక్తిగతమేంటి, రైతు సమస్యలని నిమ్మల చెప్పారు. 26న పశ్చిమలో జరిగే మీటింగ్‌లో చర్చిద్దామని మంత్రి చెరుకువాడ,మీరు వివరంగా రాసి కలెక్టర్‌కు ఇవ్వండి, అన్ని సమస్యలు సానుకూలంగా పరిష్కరిద్దామని మరో మంత్రి ధర్మాన చెప్పడంతో అందరూ ఆగారు.


Updated Date - 2020-11-25T05:15:05+05:30 IST