చి‘వరి’కి అప్పులే..!

ABN , First Publish Date - 2020-11-24T05:05:08+05:30 IST

సర్కారు చెప్పిందని సన్నవడ్లు సాగు చేసిన రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు. ఈసారి గంపెడాశతో సన్నరకం వరి పంటలను సాగు చేసిన రైతును కష్టాలు చుట్టుముట్టాయి.

చి‘వరి’కి అప్పులే..!
తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామంలో దోమకాటుతో దెబ్బతిన్న వరిపంటను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు (ఫైల్‌)

  • సన్నరకం సాగు చేసిన రైతులను చుట్టుముట్టిన కష్టాలు
  • దొడ్డురకాలతో పోలిస్తే తగ్గిన దిగుబడులు
  • కౌలు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరం


‘‘నిండా ముంచిన సన్నరకం

పరిగి మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన కావలి మారుతి నాలుగు ఎకరాల్లో తెలంగాణ సోనా (సన్నరకం) వరి సాగు చేశాడు. వరిపంటకు కాటుక తెగులు సోకి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. మామూలుగా అయితే ఎకరాకు 22 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కాటుక తెగుళ్ల వల్ల ఇప్పుడు 13 క్విం టాళ్లు మాత్రమే వచ్చింది. ఈసారి సన్నాలకు ధర కూడా లేదు. ఎకరాకు రూ.22 వేల చొప్పున  మొత్తం రూ.88 వేల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం పరిగి మార్కెట్‌లో సన్నాలకు క్వింటాలు ధర రూ.1,450 నుంచి రూ.1,550 మాత్రమే పలికింది. నాలుగు ఎకరాలకు 55 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో కొనే ధర అయితే రూ.82 వేలు వస్తున్నాయి. పెట్టుబడే రావడం లేదు. నాలుగు నెలలపాటు పడిన కష్టానికి ఫలితం లేకుండా పోయింది. సన్నాలు సాగు చేసినందుకు నష్టం తప్ప లాభం లేదు. ప్రభుత్వం సన్నాలను రూ.2500లకు క్వింటాలు చొప్పున కొనుగోలు చేయాలని కోరుతున్నాడు.’’


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : సర్కారు చెప్పిందని సన్నవడ్లు సాగు చేసిన రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు. ఈసారి గంపెడాశతో సన్నరకం వరి పంటలను సాగు చేసిన రైతును కష్టాలు చుట్టుముట్టాయి. పంటకు చీడపీడలు పట్టడం, ధాన్యానికి మద్దతు ధర లేక నష్టాల పాలయ్యారు. ప్రస్తుతం పంట దిగుబడి లేక దిగాలు చెందుతున్నారు. పండించిన సన్న రకం వరిలో తాలు ఎక్కువగా రావడం... గింజలు నల్లబారడంతో రైతులు వరి కోయకుండానే పొలంలో వదిలేస్తున్నారు. కొంతమంది పొలంలోనే వరిని తగలబెడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ప్రధానంగా కౌలు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. పట్టాదారు నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పట్టాదారు తనకు రావాల్సిన వరి ధాన్యం లేదా డబ్బులు ఇవ్వాల్సిందనేనని పట్టుబడుతున్నారు. కొంతమంది పట్టాదారులు వదిలేస్తున్నప్పటికీ మరికొందరు ఇవ్వాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. 


పెరిగిన పంట కాలం, పెట్టుబడి


దొడ్డురకాలు 3 నుంచి 4 నెలల్లో కోతకు వస్తే... సన్నరకాలు 5 నెలలు గడిస్తే గానీ చేతికి రావు. ఈసారి భారీ వర్షాల కారణంగా వరి నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ సీజన్‌లో మొదటి నుంచి అధిక వర్షాల కారణంగా సన్నరకాలను చీడపీడలు ఎక్కువగా ఆశించాయి. వరి పొట్ట దశ నుంచే కంకినల్లి లాంటి తెగుళ్లు, దోమపోటు రావడంతో పంటను కాపాడుకోవడానికి రైతులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. మూడు నాలుగు సార్లు పురుగుల మందు స్ర్పే చేశారు. పురుగుల మందుపైనే రూ.8వేల వరకు అదనంగా ఖర్చు చేశామని రైతులు అంటున్నారు. 


దిగుబడి, మద్దతూ తక్కువే..

ప్రతి ఎకరాకు దొడ్డు రకాలతో పోలిస్తే సన్నరకాల దిగుబడి నాలుగైదు క్వింటాళ్లు తక్కువగా ఉంటుంది. ఎలాంటి చీడపీడలు లేకుంటే దొడ్డు రకం ధాన్యం ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్లు వస్తే.. సన్న ధాన్యం ఎకరాకు 25 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల వరకు వస్తుంది. ప్రస్తుతం తెగుళ్లు ఎక్కువగా ఉండటంతో సన్నరకం ప్రతి ఎకరాకు 15-20 క్వింటాళ్ల లోపే దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు.. కానీ కేంద్రం ప్రకటించిన మద్దతు ధర దొడ్డు రకాలకు ఎక్కువగా, సన్నరకాలకు తక్కువగా ఉంది. గ్రేడ్‌ ‘ఏ’ రకానికి క్వింటాలుకు రూ.1,888 కాగా... సాధారణ రకానికి రూ. 1,868 చెల్లిస్తుంది. గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో సన్నాలకు మార్కెట్‌లో క్వింటాలుకు రూ.2 వేల దాకా పలికింది. అప్పట్లో ఉత్పత్తి తక్కువగా ఉండి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు సన్నాలకు రూ.2 వేలు చెల్లించారు. కానీ.. ఈసారి నియంత్రిత సాగు విధానంతో వరి సాగు ఎక్కువగా చేశారు. సన్నరకాలు సాగు చేసిన పాపానికి ఎకరానికి రూ.20 వేల చొప్పున నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


నష్టపోతున్న రైతులు

ప్రభుత్వం చెప్పినట్లుగా చాలా మంది రైతులు సన్నరకమైన తెలంగాణ సోనను సాగుచేశారు. అయితే అధిక వర్షాలకు తట్టుకోలేని తెలంగాణ సోన వరిపైరుపై తెగుళ్లు, దోమకాటు ఆశించి పంట దిగుబడి సగానికి సగం తగ్గింది. ఒకవైపు పంట తగ్గడం... మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1,888 రూపాయలకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో చాలా మంది రైతులు సన్నరకం వరి ధాన్యాన్ని 1600 రూపాయలకే వ్యాపారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. 


దిగుబడి తగ్గింది..

ఎప్పుడూ దొడ్డు రకాలు వరి సాగు చేసేవాడిని. ఈసారి సర్కారు చెప్పిందని సన్న వడ్లు రెండున్నరెకరాల్లో సాగు చేశా. పంట పెట్టుబడి రూ.50 వేలు అయింది. మొత్తం 34 క్వింటాళ్లు వరి ధాన్యం దిగుబడి రాగా రైస్‌ మిల్లుకు తరలించాను. ధాన్యంలో తాలు, రంగుమారి ఉండటంతో క్వింటాలుకు 12 కిలోల తరుగు తీశారు. ఈసారి తీవ్రంగా నష్టపోయా. ప్రభుత్వం సన్నరకానికి మద్దతుధర రూ.3వేలు ప్రకటించి రైతులను ఆదుకోవాలి.  

- అంజిరెడ్డి, కేసారం, షాబాద్‌ మండలం


తాలు పెరిగింది

ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా వరి పైర్లు దెబ్బతిని దిగుబడులు సగానికి సగం తగ్గాయి. సన్నరకం వరిపైర్లపై తెగుళ్లు, దోమకాటు వల్ల దిగుబడి బాగా దెబ్బతిన్నది. గింజ గట్టిపడకపోవడంతో తాలు పెరిగి నష్టపోవాల్సి వచ్చింది. గత యాసంగిలో 3 ఎకరాల వరిసాగులో 245 బస్తాలు ధాన్యం రాగా... ఈ వర్షాకాలంలో 4ఎకరాలు సాగుచేస్తే 160బస్తాలు ధాన్యం వచ్చింది. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు.  

- యస్‌. గోవర్దన్‌రెడ్డి- రైతు, చేగిరెడ్డిఘనాపూర్‌, చౌదరిగూడ మండలం


తెలంగాణ సోనా వల్ల నష్టాలే..

ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ సోనా రకం వరిని చెంగోల్‌ గ్రామ శివారులోని ఊర చెరువు, పెద్ద చెరువు, ఒడ్డోని కుంట తదితర ప్రాంతాల్లో 400 ఎకరాల్లో సాగు చేశాం. అయితే ప్రస్తుతం ఎకరాకు 15బస్తాలు కూడా దిగుబడి రావడం లేదు. గతంలో బీపీటీ-1050 రకం వరి పంట సాగు చేస్తే ఎకరాకు 25-30 బస్తాల వరకు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం తెలంగాణ సోనా వరి పంట సాగు చేయడం వల్ల తెల్లదోమ, దోమకాటు, కాటుక  వంటి తెగుళ్లు రావడంతో దిగుబడి తగ్గిపోయింది. పండిన ధాన్యం కూడా తూకం రావడం లేదు.

- గోపాల్‌రెడ్డి, రైతు, చెంగోల్‌. 

Updated Date - 2020-11-24T05:05:08+05:30 IST