లక్ష ఎకరాల్లో వ్యవసాయ పనులు

ABN , First Publish Date - 2021-06-19T06:22:31+05:30 IST

అన్నదాతలు ఖరీఫ్‌సాగు పనుల్లో తలమునకలవుతున్నారు. తొలకరి జల్లులు భూమిని తడిసి ముద్ద చేయడంతో రైతులు ఖరీఫ్‌ విత్తనాలను నాటే పనుల్లో మునిగిపోయారు.

లక్ష ఎకరాల్లో వ్యవసాయ పనులు
ముథోల్‌ మండలంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు

60వేల ఎకరాల్లో పత్తి, 40వేల ఎకరాల్లో సోయా 

విత్తనాలు నాటే పనుల్లో అన్నదాతలు బిజీ 

నకిలీ విత్తనాలపై జిల్లా  రైతుల బెంబేలు

ఈ సారి ఖరీఫ్‌సాగు విస్తీర్ణం 3.95 లక్షల ఎకరాలు 

నిర్మల్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి) : అన్నదాతలు ఖరీఫ్‌సాగు పనుల్లో తలమునకలవుతున్నారు. తొలకరి జల్లులు భూమిని తడిసి ముద్ద చేయడంతో రైతులు ఖరీఫ్‌  విత్తనాలను నాటే పనుల్లో మునిగిపోయారు. ఓ వైపు నకిలీ విత్తనాల భయం అన్నదాతను వెంబడిస్తున్నప్పటికీ గుండెధైర్యం చేసుకొని వారంతా పంట సాగుపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ సారి 3.95 లక్షల ఎకరాల్లో పంటసాగును వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అనుగుణంగానే 1.70లక్షల ఎకరాల్లో పత్తిపంట, 75వేల ఎకరాల్లో సోయా, 1.05 ఎకరాల్లో వరి, 30వేల ఎకరాల్లో కంది, మరో 10వేల ఎకరాల్లో ఇతర పంటలను సాగుచేయాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా లక్షఎకరాల్లో రైతులు సోయా, పత్తి విత్తనాలను విత్తారు. 60 వేల ఎకరాల్లో పత్తి పంటను, 40వేల ఎకరాల్లో సోయాపంట సాగును మొదలుపెట్టారు. మరికొద్ది రోజుల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు పత్తి, సోయాపంటలను సాగు చేయనున్నారు. దీంతో పాటు మరి కొద్దిరోజుల్లో వరిపంట సాగును కూడా రైతులు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతీయేటా ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వరిపంట సాగుకోసం అటు రైతులు, ఇటు వ్యవసాయాధికారులు కుస్తీ పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయి. ఓ వైపు ప్రకృతి మరోవైపు నకిలీ విత్తనాల కారణంగా పంటనష్టం జరగడం లాంటివే కాకుండా ధరలు, మార్కెటింగ్‌ సౌకర్యం లాంటి అంశాలు సాగుకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం పత్తి, వరి పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ ఆ పంటలను కొనుగోలు చేస్తున్నాయి. అయితే కొనుగోలు కేంద్రాల్లో వరుసగా జరుగుతున్న మోసాలు ఆ అన్నదాతను నష్టాల పాలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో పత్తి, సోయాబీన్‌ పంటలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. దీంతో పాటు వరిపంటకు సైతం ఇదే తరహా సర్కారు అండగా నిలుస్తోంది. ముఖ్యంగా వరి పంట నిర్దేశించిన లక్ష్యం కన్నా అదనంగా సాగవుతుండడమే కాకుండా అధికంగా దిగుబడులు సాధిస్తోంది. దీంతో కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతుండడమే కాకుండా పంటలను నిల్వ చేయడం సర్కారుకు సమస్యగా మారింది. జిల్లాలోని పత్తికి నాణ్యత విషయంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కారణంగా ప్రభుత్వం ఈ పంటల సాగుకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోంది. 1.70లక్షల ఎకరాల్లో పత్తిపంటను సాగు చేయాలని నిర్దేశించారు. ముథోల్‌, భైంసా, తానూర్‌, కుభీర్‌, కుంటాల, మామడ, సారంగాపూర్‌, ఖానాపూర్‌, పెంబి తదితర మండలాల్లో పత్తిపంటను అలాగే సోయాబీన్‌ పంటను రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. వర్షాధారంపైనే ఈ రెండు పంటలసాగు ఆధారపడి ఉంది. కాలువలు, బోరు బావులు, చెరువుల ద్వారా నీటి సౌకర్యం అందుబాటులో ఉన్న రైతులు వరితో పాటు ఇతర వాణిజ్య పంటలసాగును చేపడుతున్నారు. ఈసారి ఖరీఫ్‌లో 4వేల ఎకరాల్లో మినుము, 1000 ఎకరాల్లో పెసర, 30వేల ఎకరాల్లో కందుల పంటలను కూడా సాగుచేయనున్నారు. అ యితే  అధికారులు మొక్కజొన్న విషయంలో లక్ష్యాన్ని స్పష్టంగా ఖరారు చేయలేదు. నిర్భంధ సాగు విధానంలో భాగంగా మొక్కజొన్నను పక్కన పెట్టాలని ఇప్పటికే సర్కారు రైతులకు సూచించింది. అయినప్పటికి ఇటీవల రైతులు మొక్కజొన్నను సాగుచేసి కొనుగోళ్ళ కోసం ఆందోళనలు చేశారు. దీంతో సర్కారు పంటను కొనుగోలు చేసినప్పటికి మళ్ళీ తిరిగి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోమని మద్దతు కూడా ధర ప్రకటించబోమంటూ స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగానే ఈసారి మొక్కజొన్న పంటపై వ్యవసాయశాఖ అంటిముట్టనట్లుగా వ్యవహారిస్తోంది. రైతులను పత్తి, సోయాబీన్‌ పంటల సాగుకే ప్రొత్సాహిస్తూ ఉండడమే కాకుండా వరి విషయంలో కూడా అండగా నిలుస్తోంది. 

ఈ సారి ఖరీఫ్‌లక్ష్యం 3.95 లక్షల ఎకరాలు

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 3.95 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. ఇప్పటికే దీనికి అనుగుణమైన అన్ని రకాల ఏర్పాట్లను వ్యవసాయశాఖ చేపట్టింది. ఇందులో నుంచి 1.70 వేల ఎకరాల్లో పత్తిపంటసాగును, 1.05 లక్షల ఎకరాల్లో వరి, 75 వేల ఎకరాల్లో సోయాపంటను సాగుచేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. అయితే మొదట భూమి తడిచిన నేలల్లో రైతులు విత్తనాలను విత్తేందుకు సిమవుతున్నారు. ఇప్పటికే 60వేల ఎకరాల్లో పత్తి పంటకు సంబంధించిన విత్తనాలను అలాగే మరో 40వేల ఎకరాల్లో సోయాబీన్‌ విత్తనాలను విత్తారు. గత రబీ, ఖరీఫ్‌లలో కూడా సంబంధిత అధికారులు ఆశించిన పంట దిగుబడులు రావడంతో ఈ సారి ఖరీఫ్‌ఫై మరింత ఫోకస్‌ పెడుతున్నారు. మొత్తం 1.70 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దీనిలక్ష్యం మరో 30వేల ఎకరాల వరకు పెరగవచ్చంటున్నారు. అలాగే సోయాబీన్‌ పంట పరిస్థితి కూడా అలాగే మారింది. కాగా 30వేల ఎకరాల్లో కందుల పంట మరో 10వేల ఎకరాల్లో ఇతర పంటలను సాగుచేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 

పత్తికి మరింత ప్రోత్సాహం

ఉమ్మడి జిల్లాలో పండించే పత్తికి దేశవ్యాప్తంగా మంచి పేరు ఉండడమే కాకుండా ఇతర ప్రాంతాలకు సైతం ఇక్కడి పత్తిని ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం పత్తిపంటసాగును పెంచాలని ఇక్కడి పత్తికి భారీగా డిమాండ్‌ ఉందంటూ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ పంటసాగుకు వెన్ను తడుతోంది. గత సంవత్సరం 1.50 లక్షల ఎకరాల్లో పత్తిపంటను సాగుచేయగా ఈ సారి దాని లక్ష్యాన్ని మరో 20వేలకు పెంచడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. దీంతో పాటు సోయా పంటకు కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సారి 75వేల ఎకరాల్లో సోయాపంటను సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

లక్ష ఎకరాల్లో వరిసాగు లక్ష్యం

ప్రస్తుత ఖరీఫ్‌లో వరి పంటసాగుకు కూడా వ్యవసాయశాఖ ప్రాధాన్యత కల్పిస్తోంది. సాగుప్రణాళికల్లో భాగంగా 1.05 లక్షల ఎకరాల్లో వరిపంటను సాగు చేయాలని నిర్ణయించారు. ప్రతీ ఖరీఫ్‌, రబీసీజన్‌లలో వరి లక్ష్యం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. గిట్టుబాటు ధర మార్కెటింగ్‌ సౌకర్యం ఉన్న కారణంగా రైతులు సైతం ఈ పంటసాగుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రతీ ఖరీఫ్‌, రబీసీజన్‌లలో ఖరీఫ్‌సాగు ఆశించిన లక్ష్యం కన్నా ఎక్కువగా సాగుతోంది. 

కొద్దిపాటి జాగ్రత్తలతో అధిక దిగుబడులు

రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించి నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు. విత్తనాలు విత్తిన ఇరవై నాలుగు గంటల కాలవ్యవధిలోనే కలుపు మందు పిచికారీ చేసినట్ల యితే కలుపు నివారించవచ్చు. అధికతేమలో కానీ తక్కువ తేమలో కానీ ఎక్కువ లోతులో కానీ విత్తనాలు వేసినట్ల యితే మొలకశాతం తగ్గును. కాబట్టి జాగ్రత్త వహిం చాలి. విత్తనాలు వేసి నట్లయితే శాతం తగ్గుతుంది. దీన్ని జాగ్రత్తగా గమనించాలి. పత్తి, సోయా, మొక్క జొన్నలో అంతర పంటగా కంది, పెసర, తదితర పప్పు దినుసులు వేసుకోవచ్చు. 

- డా. జి. వీరన్న, జిల్లా ఏరువాక ముథోల్‌ కేంద్రం సమన్వయ కర్త

ఈ సంవత్సరం సోయా వేశాను

నాకున్న ఐదు ఎకరాల భూమిలో ఈ సంవత్సరం సోయాపంట వేశాను. గత సంవత్సరం పత్తి వేసినప్పటికీ సరపడా దిగుబడి రాకపోవడంతో పత్తి వేయ లేదు. ఈ సంవత్సరం ఈ సోయా వేశాను. ఈ పంట వెళ్లిన తర్వాత రబీలో మొక్కజొన్న, శనగపంట వేస్తాను. 

- పెండెల ఆనందం, రైతు , గ్రామం : చించాల , మండలం : ముథోల్‌ 

Updated Date - 2021-06-19T06:22:31+05:30 IST