అటవీ హక్కుదారులకు వ్యవసాయ రుణాలు

ABN , First Publish Date - 2022-05-25T06:27:22+05:30 IST

జిల్లాలో అటవీ హక్కు పత్రాలను పొందిన గిరిజన రైతులకు వ్యవసాయ రుణాలను ఇవ్వాలని బ్యాంకు అధికారులను జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ కోరారు.

అటవీ హక్కుదారులకు వ్యవసాయ రుణాలు
మాట్లాడున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, పక్కన పీవో గోపాలక్రిష్ణ, సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌

బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ విజ్ఞప్తి 


పాడేరు, మే 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అటవీ హక్కు పత్రాలను పొందిన గిరిజన రైతులకు వ్యవసాయ రుణాలను ఇవ్వాలని బ్యాంకు అధికారులను జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ కోరారు. తన కార్యాలయంలో బ్యాంకర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణ భూములున్న రైతులకు అందిస్తున్నట్టుగానే అటవీ సాగుభూములకు హక్కులు పొందిన రైతులకు పంట రుణాలు ఇవ్వాలన్నారు. అప్పుడే అటవీ హక్కులు కల్పించిన లక్ష్యం నెరవేరుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో అటవీ హక్కులు పొందిన గిరిజన రైతుల వివరాలను బ్యాంకర్లకు అందిస్తామని, వారి అర్హతలను పరిశీలించి, వ్యవసాయ రుణాలను మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే వారికి వ్యవసాయ రుణాల మంజూరులో ఎటువంటి సందేహాలున్నా కచ్చితంగా నివృత్తి చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనైనా వారికి రుణాలు అందించాలని కలెక్టర్‌ కోరారు. గిరిజన రైతులకు వ్యవసాయ రుణాలు అందిస్తే, గిరిజన ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధితోపాటు గిరిజనుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించిన వారవుతారని చెప్పారు. గిరిజనుల జీవనం మెరుగుకు బ్యాంకర్లు సంపూర్ణంగా సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి, వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T06:27:22+05:30 IST