వ్యవసాయ నిధి

ABN , First Publish Date - 2020-08-12T07:42:20+05:30 IST

కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి ఇటీవల తెచ్చిన మూడు ఆర్డినెన్సులనూ వ్యతిరేకిస్తూ, ‘కార్పొరేట్లను తరుముదాం–వ్యవసాయ రంగాన్ని రక్షించుకుందాం’ అంటూ...

వ్యవసాయ నిధి

కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి ఇటీవల తెచ్చిన మూడు ఆర్డినెన్సులనూ వ్యతిరేకిస్తూ, ‘కార్పొరేట్లను తరుముదాం–వ్యవసాయ రంగాన్ని రక్షించుకుందాం’ అంటూ భారత రైతాంగం ఉద్యమించిన రోజునే, ప్రధాని నరేంద్రమోదీ లక్షకోట్లతో ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ని ప్రకటించారు. పంట ఉత్పత్తుల నిల్వకోసం శీతల గిడ్డంగులు, పంట సేకరణ కేంద్రాలు, ప్యాకింగ్‌ కేంద్రాలు ఇత్యాది సదుపాయాలతో పాటు, ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కూడా కేంద్రం ఈ నిధితో తోడ్పాటునందిస్తుంది. నాగలిని చేబూనిన బలరామ జయంతినాడు ఆరంభమైన ఈ పథకం, రైతుకు ఎంతో మేలు చేస్తుందనీ, కొత్త ఉద్యోగాలు కల్పిస్తుందనీ, వ్యవసాయరంగంలో స్టార్టప్స్‌కు ఊతాన్నిస్తుందని ప్రధాని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాల ద్వారా రైతులకు రుణాలు ఇచ్చే ఈ పథకం కోసం ప్రభుత్వం పదకొండు ప్రభుత్వరంగ బ్యాంకులతో ఒప్పందం కుదర్చుకుంది. మే నెలలో ఆవిష్కరించిన 20లక్షలకోట్ల ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో ఇది అంతర్భాగమైనప్పటికీ, లెక్కలు తేల్చడానికి మూడునెలలు పట్టినట్టుంది. ఈ పథకంలో బయటకు చెప్పని అంశాలు, మతలబులు చాలా ఉన్నాయన్నది రైతు నాయకుల విమర్శ.


పండిన పంటను నిల్వచేసుకొనే సదుపాయాలు లేక రైతులు వచ్చినకాడికి పంటను అమ్ముకోవడమో, పారబోయడమో చూస్తూనే ఉన్నాం. అలాంటి దృశ్యాలకు ఇకపై తావివ్వకుండా, ఏకంగా లక్షకోట్లతో రైతులే తమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి వీలు దక్కడం విశేషమే. గ్రామాల్లోనే పంటసేకరణ కేంద్రాలు, శీతల గిడ్డంగులు, ఆహారశుద్ధి కేంద్రాలు ఏర్పాటైతే రైతులకు పండుగే. మంచి ధర వచ్చేవరకూ వారు భద్రంగా తమ ఉత్పత్తులు దాచిపెట్టుకోవచ్చు. ఇక, ప్రాథమిక పరపతి కేంద్రాలు, రైతు సంఘాలు, ఉత్పత్తి దారుల సంఘాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, అగ్రీ టెక్‌ కంపెనీలు, వ్యాపార సంస్థలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, స్టార్టప్స్‌ సహా అనేకానేక లబ్ధిదారులను గుదిగుచ్చి ఈ నిధిద్వారా రుణాలు అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. వ్యవసాయ రంగాన్ని వాణిజ్య ప్రయోజనాలతో ముడివేస్తేనే రైతుకు మేలు చేకూరుతుందని ప్రభుత్వం విశ్వసిస్తున్నదానికి అనుగుణంగానే ఈ పథకం రూపకల్పన ఉంది. దీని అమలు కాలం పదేళ్ళన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదన్న విమర్శ అటుంచితే, ఈ ఆర్థిక సంవత్సరంలో పదివేలకోట్లతో మొదలై రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో ముప్పైవేల కోట్ల చొప్పున రుణవితరణ జరగబోతున్నది. మరోవిధంగా చెప్పుకోవాలంటే, సార్వత్రిక ఎన్నికల నాటికి ఇది ముగుస్తుంది. నిధులు మంజూరు చేసేది బ్యాంకులయితే, మూడుశాతం వడ్డీ మినహాయింపు, క్రెడిట్‌ గ్యారంటీ భాగమే ప్రభుత్వానిది. వడ్డీ మినహాయింపు వర్తించేది ఏడేళ్ళకయితే, తీసుకున్న రుణం ఎంత ఉన్నా, ఆయా సంస్థలు సంఘాలకు వడ్డీరాయితీ రెండుకోట్లకు మించదు. క్రెడిట్‌ గ్యారంటీ హామీ కూడా రెండుకోట్ల రుణాల లోపే. ఇక, రుణాల చెల్లింపుల మీద ప్రస్తుతం మారటోరియం అమల్లో ఉంది కనుక, ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రాయితీల రూపంలో ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడదు. చిన్న తరహా పరిశ్రమల బ్యాంక్‌ సహకారంతో ప్రభుత్వం ఇటీవల ఆరంభించిన ‘క్రెడిట్‌ గ్యారంటీ సొసైటీ’ ద్వారా ఆయా పరిశ్రమలూ సంస్థలకూ, వ్యవసాయ మంత్రిత్వశాఖలోని రైతు సంక్షేమ విభాగం ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకూ క్రెడిట్‌ గ్యారంటీ లభిస్తుంది. రుణాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థలన్నీ నాబార్డ్‌తో ఒప్పందాన్ని కుదర్చుకొని ఈ పథకాన్ని అమలు చేస్తాయట. బ్యాంకులన్నీ పారుబాకీల్లో నిండామునిగి, రుణాలు ఇచ్చేందుకు వెనుకాడుతూ, ఉన్నదాన్ని భద్రంగా దాచుకుంటున్న తరుణంలో వాటికి నాబార్డ్‌ ద్వారా ఆర్థిక సాయం అందుతుందని అర్థం. 


రైతుల సమస్యలను పరిష్కరించి, సహకార సంఘాలను మరింత ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం, మూడు ఆర్డినెన్సులతో వాటి ఉనికికే ముప్పుతెచ్చిందని రైతు సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ ఆర్డినెన్సులు భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపనీల కబంధ హస్తాల్లోకి నెట్టివెయ్యడానికి ఉద్దేశించినవని వాటి వాదన. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయరంగం మీద ఆధారపడిన ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు ప్రత్యక్షంగా ఆర్థిక లబ్ధి చేకూర్చే చర్యలు అవసరమని వ్యవసాయ నిపుణులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తుందంటున్న ఈ పథకం వారికి ప్రత్యక్షంగా ఎంత మేలు చేయగలదో, ఆ రంగానికి ఎంత జీవం పోయగలదో చూడాలి.

Updated Date - 2020-08-12T07:42:20+05:30 IST