తీరు మారేనా..?

ABN , First Publish Date - 2022-04-19T05:25:57+05:30 IST

వ్యవసాయశాఖ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఉద్యో గుల మధ్య సఖ్యత లేదు. ఇక్కడ కుల రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తీరు మారేనా..?
జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం

వ్యవసాయశాఖలో వర్గ విభేదాలు

జిల్లా అధికారినే ప్రశ్నించేంతగా గొడవలు

విధులకు సరిగా హాజరుకాని కొందరు ఉద్యోగులు

కొత్త డీఏవోతో మార్పు వచ్చేనా..?


ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వ కార్యాలయాలు వర్గవిభేదాలకు నిలయంగా మారాయి. గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ అందరికీ ఆద ర్శంగా నిలవాల్సిన ఉద్యోగులు వర్గాలుగా విడిపోయి  నలు గురితో ఛీ కొట్టించుకుంటున్నారు. నెల్లూరు వ్యవసాయశాఖ లో నెలకొన్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం. కింది స్థాయి ఉద్యోగులు జిల్లా అధికారినే ప్రశ్నించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఓ వర్గం మాట వినకపోతే ఇకవారికి వేధింపులు తప్పవు. కొన్ని కార్యాల యాలకు అయితే అధికారులు ఎప్పుడు వస్తారో... ఎప్పుడు పోతారో..? కూడా తెలియని పరిస్థితి. మొత్తం మీద వ్యవసాయశాఖలో పరిపాలన పూర్తిగా  గాడి తప్పింది. కొత్తగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏవో)గా జి.సుధాకర్‌రాజు బాధ్యతలు చేపట్టడంతో కొంత మార్పు వస్తుందని కొంతమంది అధికారులు, సిబ్బంది భావి స్తున్నారు. ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకోకపోతే ఆయనకే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయంటూ వారు పేర్కొన్నారు.


 నెల్లూరు(వ్యవసాయం), ఏప్రిల్‌ 18 :   వ్యవసాయశాఖ జిల్లా ప్రధాన కార్యాలయంలో  ఉద్యో గుల మధ్య సఖ్యత లేదు.  ఇక్కడ కుల రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అగ్రవర్ణాలకు చెందిన వారి మాటలు వినకపోయినా, వారు చెప్పిన పని చేయకపో యినా వారిపై పరోక్ష వేధింపులుంటాయి. వీరి వేధింపులు తట్టుకోలేక బదిలీ, డిప్యుటేషన్‌ పేరుతో బయట ప్రాంతాలకు వెళ్లిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది. ఇటీవల కొత్తగా జిల్లాల కేటాయింపుల్లో జరిగిన బదిలీల్లోనూ జిల్లా అధికారితోనే వాదనకు దిగన సంఘటన చోటుచేసుకుంది. నాపేరునే జాబితాలో చేరుస్తారా..? అంటూ ఓ ఉద్యోగి ప్రశ్నించడంతో చేసేదిలేక తనకు తెలి యదని అకౌంట్స్‌ సెక్షన్‌లో వాళ్లని అడగండంటూ సం జాయిషీ ఇచ్చుకునే పరిస్థితి నెలకొంది. చివరికి జిల్లానుంచి బదిలీ అయిన వారికోసం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలోనూ ఓ అధికారి వస్తే తమ వర్గం దూరంగా ఉంటామని చెప్పడంతో ఆ అధికారికి రావాలని ఉన్నా కా ర్యక్రమానికి హాజరుకాలేదని తెలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో  ఉదంతాలు ఉన్నాయి. చాడీలు చెప్పడం ఇక్కడ  కొందరికి అలవాటుగా మారింది.


ఎప్పుడొస్తారో.. ఎప్పుడుపోతారో ? 

వ్యవసాయశాఖలో సాయిల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌(ఎస్‌టీఎల్‌), డిస్ర్టిక్ట్‌ రీసోర్స్‌ సెంటర్‌(డీఆర్‌సీ), బయో కెమికల్‌(బీసీ) ల్యాబ్‌ విభాగాలు ఎంతో ముఖ్యమైనవి. మట్టి నమూనాలు సేకరించడం, పురుగు మందులు, ఎరువుల వాడకం, పంటలను పరిశీలించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం వంటి కీలకమైన బాధ్యతలు వీరివి. అయితే ఆయా విభాగాల్లో అధికారులు ఎప్పుడు వస్తున్నారో .. తిరిగి ఎప్పుడు ఇంటికి వెళతారో..? తెలియని పరిస్థితి నెలకొంది. కొంతమంది ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాకుండా, హాజరు పుస్తకంలో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు చేయాల్సిన పనిని అక్కడ వారికి అనుకూలంగా ఉండే వారికి కేటాయిస్తున్నట్లు సమాచారం. వారికి అవసరం అయినప్పుడు సెలవులు ఇస్తే చాలన్నట్లు  వ్యవహారం నడుస్తోంది. ఆయా విభాగాలపై పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు అధికారులు చెబుతున్నారు. 


ప్రక్షాళనతోనే మార్పు.. 

వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో పని చేస్తున్న అధికారుల విధులను ప్రతి మూడేళ్ల కొకసారి మారుస్తూ ఉంటే అన్ని పథకాలపై అందరికి అవగాహన ఉంటుంది. అయితే ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదనే వాదన ఉంది. ఒకవేళ మార్పులు చేద్దామన్నా కొందరు ఒప్పుకోకపోవడంతో  అలానే కొనసాగిస్తున్నారని తెలిసింది. కాదని మార్పులు చేస్తే అత్యవసర సమయాల్లో రిపోర్టుల తయారీకి సహకరించకుండా ఇబ్బందులకు గురిచేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా  ప్రక్షాళన చేస్తేతప్ప పరిస్థితుల్లో మార్పు రాదని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.


ఉన్నతాఽధికారుల్లోనూ అసంతృప్తి

జిల్లా వ్యవసాయశాఖ పనితీరుపై జిల్లా ఉన్నతాధికారు ల్లోనూ తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల పనితీరును బట్టి వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యవసాయశాఖకు ఒక్కటంటే ఒక్క ప్రశంసా పత్రం కూడా లభించలేదు. దీన్నిబట్టి వ్యవసాయ శాఖపై ఉన్నతాఽధికారులకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్థం అవుతుంది. 

Updated Date - 2022-04-19T05:25:57+05:30 IST