సాగు ‘అవుట్‌’

ABN , First Publish Date - 2022-08-04T05:44:28+05:30 IST

కోడూరు మండల వ్యాప్తంగా వేలాది ఎకరాలు సాగుకు దూరమవుతున్నాయి.

సాగు ‘అవుట్‌’
సముద్రపు నీరు నిలిచి బీడుగా మారిన 18వ నెంబర్‌ కాల్వ కింద భూములు

బీడుగా మారుతున్న 3 వేల ఎకరాలు 

  అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ గేట్లు లేకపోవడమే కారణం

  సముద్రపు నీరు పొలాల్లోకొస్తున్న వైనం

  సాగుకు పనికిరాకుండాపోతున్న భూములు

  దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు 

కోడూరు, ఆగస్టు 3 : కోడూరు మండల వ్యాప్తంగా వేలాది ఎకరాలు సాగుకు దూరమవుతున్నాయి. కోడూరు దిగువ ప్రాంతాలైన హంసలదీవి, పాలకాయితిప్ప, దింటిమెరక, ద్వారకా గ్రామాల సమీపంలోని భూములు బీళ్లుగా మారుతున్నాయి. ఈస్ట్‌ చానల్‌ 15, 16, 17, 18, 14బీ కాలువల కింద 3 వేల ఎకరాల్లో సాగుచేసే అవకాశం కనిపించటం లేదు. పాలకాయితిప్ప అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ గేట్లు లేకపోవడంతో సముద్రపు ఉప్పునీరు నేరుగా పెద్ద మురుగు కాలువ ద్వారా పంట పొలాల్లోకి చేరడమే ప్రధాన కారణమని రైతులు వాపోతున్నారు. రామకృష్ణాపురం, ఇరాలి గ్రామాల మధ్యలో రత్నకోడు (తాలేరు)లో ఎటువంటి అనుమతులూ లేకుండా ఆక్వా సాగు నిమిత్తం రెండు మీటర్ల సైజు తూములు వేసి కాలువ తవ్వుకుని వచ్చి న్యూ ఇరాలి డ్రెయిన్‌ (పెద్ద మురుగు కాలువ)లో కలిపారు. దీంతో ఎగువ నుంచి వస్తున్న మురుగునీరు నిరంతరం దిగువకు ప్రవహించి పంట భూముల్లో నిలిచిపోవడం మరో కారణంగా చెబుతున్నారు. రెండేళ్లుగా అధిక వర్షపాతానికి వేసిన పంటలు నీటమునిగి తీవ్రంగా నష్టపోయామని, ఈ సంవత్సరమైనా పంట వేద్దామంటే వీలు లేకుండా పొలాల్లో నీరు నిలిచిపోయిందని, వ్యవసాయం మీదే ఆధారపడి జీవించే తాము వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురించిందని దింటిమెరకకు చెందిన రైతు సైకం శివ వాపోయారు. అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ గేట్లు లేనందున సముద్రపు నీరు నేరుగా పంట పొలాల్లోకి చేరుతోందని, ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రత్నకోడు నుంచి ఆక్వా సాగు నిమిత్తం ఇరాలి గ్రామానికి ఎగువ పక్క, దిగువ పక్క తూములు వేసి దిగువనున్న పెద్ద మురుగు కాల్వలోకి డ్రెయిన్‌ కలిపారని, దీనివల్ల దిగువ ప్రాంతంలోని తమ భూములు మునిగిపోతున్నాయని పాలకాయితిప్పకు చెందిన వడుగు పాండు వాపోయారు. 



Updated Date - 2022-08-04T05:44:28+05:30 IST