Bihar political crisis: నితీష్-తేజస్వి అగ్రిమెంట్...ఎవరికి ఏమిటి..?

ABN , First Publish Date - 2022-08-09T23:07:04+05:30 IST

బీజేపీతో పొత్తుకు ఉద్వాసన చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్...

Bihar political crisis: నితీష్-తేజస్వి అగ్రిమెంట్...ఎవరికి ఏమిటి..?

న్యూఢిల్లీ: బీజేపీతో పొత్తుకు ఉద్వాసన చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish kumar), తిరిగి నితీష్ జేడీ(యూ)తో పాత పొత్తులను పునరుద్ధరించి కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi yadav) చురుకుగా మంతనాలు సాగిస్తున్నారు. వామపక్షాలు, కాంగ్రెస్ సైతం కొత్త ప్రభుత్వంలో భాగస్వామ్యం నెరపేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఎవరెవరికి ఏయే పదవుల విషయంలో జేడీయూ, ఆర్జేడీల మధ్య అగ్రిమెంట్ సైతం దాదాపు ఖరారు దశలో ఉందంటున్నారు. ఆ ప్రకారం, నితీష్ కుమార్ సీఎంగా పగ్గాలు చేపడతారు. తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి అవుతారు. ఇతర మంత్రిత్వ శాఖల కేటాయింపుపై నిర్ణయాధికారం నితీ‌ష్ కుమార్‌కే అప్పగిస్తారు. తేజస్వి యాదవ్ పార్టీ ఆర్జేడీ నుంచి స్పీకర్‌ను ఎన్నుకుంటారు.


కాగా, నితీష్ కుమార్‌తో (జేడీయూతో) తిరిగి పొత్తు పెట్టుకునే విషయంలో ఆర్జేడీ నేతలు కూడా లాంఛనంగా తమ అంగీకారం తేజస్వికి తెలియజేశారు. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో నితీష్ మాట్లాడటంతో కాంగ్రెస్ పార్టీ సైతం కూటమి భాగస్వామిగా ఉండేందుకు సుముఖంగానే ఉందంటున్నారు. బీహార్ పరిణామాలు మహారాష్ట్ర తరహా కుట్ర ఎంతమాత్రం కాదని నితీష్ అనుచరగణం తెగేసి చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా వీరు ప్రస్తావిస్తున్నారు. ఇతర పార్టీలు ఏమీ సాధించలేవనీ, బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని, మిగతావన్నీ  కుటుంబాలు, వంశపాలనకే పరిమితమని జేపీ నడ్డా ఇటీవల బహిరంగంగా వ్యాఖ్యానించడం ద్వారా బీజేపీ మిషన్ ఏమిటో బయటపడిందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నితీష్ సరైన సమయంలో సరైన నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారని వారు తెలిపారు.

Updated Date - 2022-08-09T23:07:04+05:30 IST