అగ్రంపహాడ్‌లో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-01-23T05:22:08+05:30 IST

అగ్రంపహాడ్‌లో ఉద్రిక్తత

అగ్రంపహాడ్‌లో ఉద్రిక్తత
స్మారక స్తూపాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యం

 కొండా మురళి తల్లిదండ్రుల స్మారక స్తూపం ధ్వంసం

జాతర పాలకవర్గ  ప్రమాణ స్వీకారం వేళ ఘటన

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై మాజీ మంత్రి సురేఖ ఫైర్‌

 శిశుపాలుడిలా చివరి తప్పు చేశావని హెచ్చరిక

ఆత్మకూరు, జనవరి 22: మేడారం మహా జాతర తర్వాత రెండో మహాజాతరగా ప్రసిద్ది పొందిన అగ్రంపహాడ్‌లో శనివారం జరిగిన పరిణామాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఇక్కడి వనదేవతల గద్దెల ప్రాంగణానికి సమీపంలో ఉన్న కాంగ్రెస్‌ నేత కొండా మురళి తల్లిదండ్రుల స్మారక స్తూపాన్ని ధ్వంసం చేయడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై కొండా మురళి సతీమణి, మాజీ మంత్రి సురేఖ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, స్మారక స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. స్తూపం ధ్వంసం వెనుక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉన్నారంటూ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు.  వివరాల్లోకి వెళితే..

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని అగ్రంపహాడ్‌లో ప్రతీ రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. ఇక్కడ 2010లో కొండా మురళి తన కూతురు సుస్మిత పటేల్‌ పేర  మూడెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అందులో ఒక చోట తన తల్లిదండ్రుల పేర స్మారక స్తూపాన్ని నిర్మించారు. మిగతా స్థలాన్ని జాతరకొచ్చే భక్తుల కోసం వదిలేశారు. 

ఎమ్మెల్యే ధర్మారెడ్డి దృష్టి...

అగ్రంపహాడ్‌లో వచ్చే ఫిబ్రవరిలో జరిగే జాతర కోసం కొత్త పాలక వర్గం ఏర్పాటైంది. శనివారం జాతర ప్రాంగణంలో పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  తొలుత ఆయన గద్దెలను సందర్శించి అమ్మవార్లకు  మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెలు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జాతర  ప్రాంగణంలో గల కొండా మురళి తల్లిదండ్రుల స్మారక స్థూపం ఆయన కంట పడింది. దాని చుట్టూ తిరిగి నిశితంగా పరిశీలించారు.

అనంతరం జరిగిన పాలక వర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తల్లుల గద్దెల వద్ద విగ్రహాలు (స్మారక స్తూపంపై బొమ్మలు) ఉండడం పట్ల భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దేవతల గద్దెల వద్ద స్మారక స్తూపం ఉండడమేమిటని ప్రశ్నించారు. జాతర జరిగే వరకు అది కనిపించకుండా నల్లగుడ్డతో కప్పేయ్యాల్సిందిగా సూచించారు. కప్పేస్తారా లేక మొత్తానికి తీసేస్తారా? అది మీ ఇష్టం అన్నారు.  ఇది ఆర్డర్‌ అనుకోండి.. అంటూ హుకుం జారీ చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోయిన కొద్దిసేపటికే టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఒకరు గునపంతో స్మారక స్తూపం గద్దెను కూల్చడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడికి చేరుకొని అభ్యంతరం చెప్పడంతో కూల్చివేత నిలిచిపోయింది. ఈ సంఘటనపై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. 

శిశుపాలుడిలా చివరి తప్పు చేశావు...

ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై సురేఖ ఫైర్‌

కొండా మురళి తల్లిదండ్రుల స్మారక స్థూపం ధ్వంసం ఘటన తెలిసిన వెంటనే మాజీ మంత్రి సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేఖ మాట్లాడినట్టు చెబుతున్న ఒక ఆడియో విడుదలైంది. అందులో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లపై పరుష పదజాలంతో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నిద్రపోతున్న పులిని తట్టి లేపావు ఇక కాస్కో.. ఏం చేస్తారో.. చేయండి... పాపాలు పండే రోజు వచ్చింది. ప్రజలు తిరగబడే రోజు దగ్గర పడింది. మీకు ఇప్పటికే ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉంది. శిశుపాలుడిలాగా చివరి తప్పు చేశావు..’ అంటూ ద్వజమెత్తారు. 

ఆ తర్వాత సురేఖ తన కూతురు సుస్మితా పటేల్‌, మద్దతుదారులతో కలిసి అగ్రంపహాడ్‌కు చేరుకున్నారు. ధ్వంసమైన స్తూపాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మరోసారి ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై విమర్శలు గుప్పించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చాలా ఏళ్ల కిందటే గద్దెల సమీపంలో మూడెకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేశామన్నారు. అందులో ఒక మూలన కొండా మురళి తల్లిదండ్రుల స్మారక స్తూపం నిర్మించగా, మిగతా స్థలాన్నంతా భక్తుల కోసం వదిలేశామని వివరించారు. ఈ దారుణ చర్యకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే ధర్మారెడ్డిని హెచ్చరించారు.

కాగా, సురేఖ తన మద్దతుదారులతో తరలివస్తున్నారనే సమాచారం రావడంతో  గొడవ జరుగుతుందని గ్రహించిన పోలీసులు.. అందరినీ అక్కడ నుంచి పంపించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. 



Updated Date - 2022-01-23T05:22:08+05:30 IST