ఆగ్రా (ఉత్తరప్రదేశ్): విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయునులు తరగతి గదిలోనే సినిమా పాటకు డాన్స్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అచ్నేరా జిల్లా సంధాన్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు అసిస్టెంట్ టీచర్లు తరగతి గదిలో సినిమా పాటలకు నృత్యం చేశారు. పాఠశాల ఉపాధ్యాయునులు రష్మీ సిసోడియా, జీవికకుమారి, అంజలియాదవ్, సుమన్ కుమారి, సుధారాణిలనే ఐదుగురు మహిళా టీచర్లు తరగతి గదిలోనే ‘‘మైను లెగెంగా లేదే మెహంగా’’ అనే సినిమా పాటకు నృత్యం చేశారు.
టీచర్లు క్లాస్ రూంలోనే డాన్స్ చేసి అనుచితంగా ప్రవర్తించి విద్యా శాఖ ప్రతిష్ఠను దిగజార్చారని, ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు 1978 , విద్యాహక్కు చట్టం ఉల్లంఘన కింద వారిని సస్పెండ్ చేశారు. డాన్స్ వ్యవహారంపై టీచర్లను పాఠశాల ప్రిన్సిపాల్ దినేష్ చంద్ పరిహార్ వివరణ కోరారు. ఈ డాన్స్ బాగోతంపై ముగ్గురు సభ్యుల కమిటీతో దర్యాప్తునకు ఆదేశించారు.