ఆర్టీసీలోనూ ‘అగ్నిపథ్‌’

ABN , First Publish Date - 2022-07-28T10:17:14+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆర్టీసీలో ఖాళీలన్నీ భర్తీ అవుతాయని, పనిభారం తగ్గుతుందని ట్రేడ్‌ యూనియన్లు ఆశించాయి....

ఆర్టీసీలోనూ ‘అగ్నిపథ్‌’

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆర్టీసీలో ఖాళీలన్నీ భర్తీ అవుతాయని, పనిభారం తగ్గుతుందని ట్రేడ్‌ యూనియన్లు ఆశించాయి. కానీ ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆర్టీసీలో కొత్త నియామకాలు జరగకపోగా సుమారు 10 వేల మంది రిటైర్‌ అయినారు. రిటైర్‌ అయిన ఉద్యోగుల భారమంతా సర్వీసులో ఉన్న ఉద్యోగులపై పడి వారి నడ్డి విరుగుతోంది.


ఆర్మీలో లాగే ఆర్టీసీలో కూడా అగ్నిపథ్‌ నియామకాలకు జూన్‌ నెలలోనే తెర లేపారు. వెంటనే ట్రాఫిక్‌ మెకానికల్‌ సూపర్‌వైజర్ల (టిఎస్‌టి, ఎంఎస్‌టి) ఖాళీలను మూడు సంవత్సరాల కోసం తాత్కాలికంగా అప్రెంటిస్‌లుగా నియమిస్తామని ప్రకటించారు. ఆ ఉద్యోగాలకు ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ చేసినవారు అర్హులు అన్నారు. మూడేళ్ళ తరువాత వారికి ఎటువంటి రెగ్యులరైజేషన్‌ ఉండదు. మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే. ఆ తరువాత ఆర్టీసీలో మళ్లీ కొత్త రిక్రూట్‌మెంట్‌, కొత్తగా అప్రెంటీస్‌లు.


విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడం అనేది ఇప్పటికే ఉన్న నిబంధన. దీన్ని ఆర్టీసీలో ‘బ్రెడ్‌ విన్నర్‌ స్కీమ్‌’ అంటారు. గవర్నమెంట్‌లో అయితే కారుణ్య నియామకాలు అంటారు. కాని గత నాలుగు సంవత్సరాలుగా ఈ రిక్రూట్‌మెంట్‌ బొత్తిగా నల్లపూసైపోయింది. వారి పిల్లలు నిరుద్యోగులై రోడ్డున పడ్డారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లలను కన్సాలిడేటెడ్‌ విధానంలో మూడు సంవత్సరాల కోసం నియమిస్తారు. అంటే ఫిక్స్‌డ్‌ జీతం. ఉదాహరణకు డ్రైవర్‌కు రూ.19,000, కండక్టర్‌కు రూ.17,000, కానిస్టేబుల్‌, శ్రామిక్‌లకు రూ.15,000 చొప్పున ఇస్తారు. ఇది కూడా అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌ లాంటిదే. మూడేళ్ళు గడిచిన తరువాత రెగ్యులరైజేషన్‌ కోసం మేనేజిమెంట్‌ నిర్వహించే పెర్ఫార్మెన్స్‌ అసెస్మెంట్‌ టెస్ట్‌లో 60 శాతం మార్కులతో పాస్‌ అవ్వాలి. ప్రతి సంవత్సరం 240 రోజులు పని చేయాలి. ఎటువంటి పనిష్మెంట్లు ఉండరాదు. వారి ట్రాక్‌ రికార్డు క్లీన్‌గా ఉండాలి. ఈ సర్క్యులర్‌పై సంతకం చేసినవారెవరైనా ఈ స్కీమ్‌లో ఉద్యోగం చేసి రెగ్యులర్‌ కాగలరా? ఎంత మాత్రం కాలేరు. ఎందుకంటే 59 కాండక్ట్‌ రెగ్యులేషన్స్‌ ఈ ఉద్యోగులకు వర్తిస్తాయి. ఈ సర్క్యులర్‌లో మరో విశేషమేమంటే ఉద్యోగి ప్రమాదం, గుండెనొప్పి, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చనిపోతే ఆ కుటుంబాలకు బ్రెడ్‌ విన్నర్‌ స్కీమ్ సీనియారిటీతో సంబంధం లేకుండా ఉద్యోగం ఇస్తారు. మేనేజిమెంట్‌, గవర్నమెంట్‌, యూనియన్లు కలిసి చేసిన అగ్రిమెంట్లు, రూల్స్‌ ద్వారా ఆర్టీసీలో ఉద్యోగాలు రావు. మరి ఎలా వస్తాయంటారా? ఆర్టీసీకి ప్రభుత్వం పంపే ‘గాడ్స్‌’ ఆర్డర్స్‌తో మాత్రమే ఉద్యోగాలు అగ్నిపథ్‌ తరహాలో వస్తాయి.


ఆర్టీసీ ఎంప్లాయీ మెడికల్‌ అన్‌ఫిట్‌ అయితే అతన్ని రిటైర్‌మెంట్‌ చేసి కుటుంబంలో అర్హులైన వారిలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. ఇది కూడా అమల్లో ఉన్న నిబంధనే. కాని గత నాలుగేళ్ళుగా ఇలాంటివారి పరిస్థితి మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకపోసుకున్నట్లయింది. కుటుంబ పెద్దకు ఉన్న ఉద్యోగం ఊడింది. పిల్లలకు వస్తుందనుకున్న ఉద్యోగం కనుచూపు మేరలో కనబడడం లేదు. ఇంటిల్లిపాదీ కట్ట కట్టుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. మెడికల్‌ రిటైర్‌మెంట్‌ చేసి ఆ ఉద్యోగి నోటి కాడ కూడు తీసిన అధికారులకు, వెంటనే ఆ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకునే బాధ్యత లేదా? 


ఇకనైనా ‘అగ్నిపథ్’ తరహా ఉద్యోగాల ప్రయోగాలు మాని ఉన్న స్కీమ్‌లలోనే ఉద్యోగాలు ఇవ్వాలని చనిపోయిన, మెడికల్‌ రిటైర్‌ అయిన కుటుంబసభ్యులతో పాటు నిరుద్యోగులు కూడా కోరుకుంటున్నారు.

ఎస్‌.బాబు

అధ్యక్షులు, ఎంప్లాయీస్‌ యూనియన్‌

Updated Date - 2022-07-28T10:17:14+05:30 IST