14 నుంచి అగ్నిపథ్‌ ఆర్మీ ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-10T06:21:19+05:30 IST

నగరంలోని వన్‌టౌన్‌ పరిధి ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియంలో ఈ నెల 14 నుంచి 31వ తేదీ వరకు అగ్నిపథ్‌ ఆర్మీ ర్యాలీ నిర్వహించనున్నారు.

14 నుంచి అగ్నిపథ్‌ ఆర్మీ ర్యాలీ
ట్రాక్‌ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న కార్మికులు

నెలాఖరు వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా నిర్వహణ

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం

వర్షం పడితే బీచ్‌లో పరుగు ర్యాలీ చేపట్టేందుకు ముందస్తు చర్యలు

సుమారు 60 వేల మంది అభ్యర్థులు పాల్గొనే అవకాశం

విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): నగరంలోని వన్‌టౌన్‌ పరిధి ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియంలో ఈ నెల 14 నుంచి 31వ తేదీ వరకు అగ్నిపథ్‌ ఆర్మీ ర్యాలీ నిర్వహించనున్నారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు (పాత జిల్లాలు), యానాం కేంద్ర పాలిత ప్రాంత యువకులకు అగ్నిపథ్‌ ఆర్మీ నియామకాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మీ ర్యాలీలో వేలాది మంది యువత పాల్గొననున్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్టు చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతుంది. స్టేడియంలో 400 మీటర్ల పరుగు పోటీ కోసం ప్రత్యేకించి ట్రాక్‌ వేస్తున్నారు. వర్షాలకు స్టేడియం బురదగా మారే అవకాశం వున్నందున పరుగు పోటీకి ఇబ్బంది లేకుండా ట్రాక్‌ను పటిష్టపరచనున్నారు. ట్రాక్‌ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మధ్యలో ఎన్‌క్లోజర్లు పెట్టారు. రోజుకు నాలుగు వేల మందికి పరుగు పోటీకి అనుమతించనున్నారు. వీరిలో సుమారు వెయ్యి మందిని ఎంపిక ఎంపిక చేస్తారు. మొత్తంమీద సుమారు 60 వేల మంది పాల్గొంటుందని, వీరిలో మొత్తం 15 వేల మందిని ఎంపిక చేస్తారని అంచనా. ర్యాలీలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్న యువతకు స్లాట్లు కేటాయించారు. ఆర్మీ ర్యాలీ కోసం మైదానంతో పాటు స్టేడియంలో గ్యాలరీలు, ప్రధాన ద్వారం పరిసరాలను మరమ్మతులు చేస్తున్నారు. గ్యాలరీల్లో ఒకవైపు రిసెప్షన్‌, మరో గ్యాలరీలో స్ర్కీనింగ్‌ పరీక్ష అంటే.. కొలతలు తీసుకోవడంతో పాటు ఎంపికకు సంబంధించి శరీరంపై టాటూస్‌ వంటి వాటిని పరిశీలించనున్నారు. మైదానంలో బారికేడ్లు పెట్టి వాటికి మెస్‌ ఏర్పాటు చేసే పనులను రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ జాన్‌ సుధాకర్‌, డీఈ ఫణి పర్యవేక్షిస్తున్నారు. వర్షాకాలం కావడంతో స్టేడియం లోపల చిత్తడిగా వున్నందున అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చదును చేయిస్తామని డీఈ ఫణి తెలిపారు. ఒకవేళ ర్యాలీ ప్రారంభించిన తర్వాత వర్షాలు కురిస్తే పరుగు పోటీని బీచ్‌ రోడ్డులో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్మీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తుందన్నారు. అలాంటప్పుడు కేవలం పరుగు పోటీ బీచ్‌లో నిర్వహించి, మిగిలిన స్ర్కీనింగ్‌, వైద్య పరీక్షలను స్టేడియంలో చేపడతామని పేర్కొన్నారు.

వేకువజామునే పరుగు పోటీ

ఆర్మీ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థుల నుంచి గతనెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుదారులకు ఈ నెల ఏడు నుంచి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అడ్మిట్‌ కార్డుతోనే స్టేడియం లోపలకు అనుమతిస్తారు. అడ్మిట్‌ కార్డు మేరకు రిసెప్షన్‌లో పేర్లు నమోదు చేసుకున్నాక కొలతలు తీసుకుని పరుగు పోటీకి అనుమతిస్తారు. ర్యాలీకి సంబంధించి ఈ నెల 13వ తేదీ రాత్రి నుంచి అభ్యర్థుల రాక మొదలవుతుంది. 14వ తేదీ వేకువజాము మూడు గంటలకు పరుగు పోటీ ప్రారంభిస్తారు. ఇలా రోజూ పరుగు పోటీ ప్రారంభించి ఉదయం 11 గంటలకల్లా ప్రక్రియను ముగిస్తారు. పగటి పూట వైద్య పరీక్షలు, ఇతర కార్యకలాపాలను చేపడతారు. ఆర్మీ ర్యాలీకి సంబంధించి జిల్లా యంత్రాంగం పలు శాఖల అధికారులతో కమిటీలు వేసింది. సుమారు 300 మంది అధికారులు, సిబ్బంది ర్యాలీలో విధులు నిర్వహించనున్నారు. అడ్మిట్‌ కార్డుతో లోపలకు వచ్చిన ప్రతి అభ్యర్థికి స్టేడియంలో ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్‌ అందిస్తోందని సెట్విజ్‌ సీఈవో పి.నాగేశ్వరరావు తెలిపారు. స్టేడియం వద్ద అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ప్రతిరోజు ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వే స్టేషన్‌ నుంచి స్టేడియం వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందన్నారు. స్టేడియం వద్ద తాగునీరు, వైద్య సాయం, అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.




Updated Date - 2022-08-10T06:21:19+05:30 IST