రాఘవాపురం కొండ వద్ద ఉద్రిక్తత..!

ABN , First Publish Date - 2022-05-25T06:23:14+05:30 IST

రాఘవాపురం కొండ వద్ద ఉద్రిక్తత..!

రాఘవాపురం కొండ వద్ద ఉద్రిక్తత..!
సోమవారం అర్ధరాత్రి దాటాక అక్రమ తవ్వకాలు జరుపుతున్న వాహనాల వద్ద నిద్రిస్తున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

తెల్లవారుజామున సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అనంతరం రెండు టిప్పర్లు, రెండు ఎక్స్‌కవేటర్లు మాయం

అధికారులకు వినతిపత్రం అందజేసిన టీడీపీ శ్రేణులు


నందిగామ, మే 24 : మట్టి అక్రమ తవ్వకాలపై ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాఘవాపురం కొండ వద్ద మట్టిని అక్రమంగా తవ్వుతున్నారంటూ సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఆమె నిరసన చేపట్టగా, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు రంగప్రవేశం చేసి నిద్రిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. సౌమ్యతో పాటు శాఖమూరి స్వర్ణలత, ఇంటిమాల ప్రవీణను బలవంతంగా ఇళ్లకు తరలించారు. ప్రజా సంపద కాపాడేందుకు తాము శాంతియుతంగా పోరాడుతుంటే, ఎందుకు అడ్డుకుంటున్నారంటూ సౌమ్య పోలీసుల తీరుపై మండిపడ్డారు. 

మట్టి మాఫియాకు తలొగ్గిన అధికారులు

మట్టి మాఫియాను కట్టడి చేయాలంటూ ఆందోళన చేస్తున్న సౌమ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండు టిప్పర్లు, రెండు ఎక్స్‌కవేటర్లు తెల్లారేసరికి మాయమయ్యాయి. సౌమ్య మంగళవారం ఉదయం తన కార్యకర్తలతో కలిసి ఆర్‌డీవో కార్యాలయానికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో తహసీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ, తహసీల్దార్‌ తన కార్యాలయం నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు. టీడీపీ శ్రేణుల ఆందోళనతో  బయటకు వచ్చిన తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి వెనుదిరిగారు. అక్కడి నుంచి మైనింగ్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మైనింగ్‌ ఏడీ లేకపోవడంతో జియాలజిస్టుకు వినతిపత్రం అందజేశారు. సౌమ్య ఒత్తిడి మేరకు జియాలజిస్టు రాఘవాపురం కొండ వద్దకు వచ్చారు. వారంతా కొండ వద్దకు వెళ్లే సమయానికి అక్కడ వాహనాలేమీ లేవు. దీనిపై సౌమ్య సీఐకు ఫోన్‌ చేశారు. వాహనాలు ఎక్కడని ప్రశ్నించారు. రెండు లారీలను తాము అదుపులోకి  తీసుకున్నామని సీఐ సమాధానం చెప్పడంతో మరి ఎక్స్‌కవేటర్ల సంగతి ఏమిటనగా, రాత్రి ఆందోళన విరమించి ఉంటే పట్టుకునే వాడినని, ఇప్పుడు వాటి  సంగతి తనకు తెలియదని సమాధానమిచ్చారు. మైనింగ్‌ జియాలజిస్టు మాట్లాడుతూ తాను ఎవరిపైనా చర్యలు తీసుకోలేనని, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని చెప్పారు. ఈ పరిణామాలపై ఆగ్రహానికి గురైన సౌమ్య ఏసీపీ నాగేశ్వరరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. 

మట్టి దోపిడీ చేస్తున్నది అధికార పార్టీ నాయకులే..

రాఘవాపురం కొండను అధికార పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారని సౌమ్య ఆరోపించారు. అధికార బలంతో అధికారులను లోబరుచుకుని అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు అత్యంత హేయంగా ప్రవర్తించారని విమర్శించారు. అక్రమ తవ్వకాలపై తన పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. 



Updated Date - 2022-05-25T06:23:14+05:30 IST