అగ్రికల్చర్‌.. అవుట్‌!

ABN , First Publish Date - 2021-07-24T04:42:26+05:30 IST

నెల్లూరు నగరానికి శివారున ఉన్న అనేక ప్రాంతాలలో గడిచిన ఆరు మాసాలలో వందల ఎకరాలు వాణిజ్యపరంగా మారాయి.

అగ్రికల్చర్‌..  అవుట్‌!
నారాయణరెడ్డిపేట వద్ద వ్యవసాయ భూముల్లో రూపుదిద్దుకున్న వెంచరు

సేద్యానికి దూరం.. దూరంగా అన్నదాత

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లు 

నెల్లూరు నగర శివార్లలో జోరుగా క్రయ, విక్రయాలు 

నాటికి నేటికి రెట్టింపైన భూమి ధర

ఆరు నెలల్లో వెయ్యి ఎకరాల్లో ప్లాట్లు 


మొన్నటిదాకా పచ్చని పైరుతో ఆ పొలాలు కళకళలాడాయి. రెక్కాడిన వారికి డొక్క నింపాయి. ఎంతోమందికి అన్నం పెట్టాయి. అలాంటి భూములు కర్షకుడి నుంచి చేజారుతున్నాయి. వందల ఎకరాలు వ్యాపారవేత్తల చేతుల్లోకి వెళ్లి నివాస ప్లాట్లుగా  మారిపోతున్నాయి. నెల్లూరు నగర శివార్లలో రూ.కోట్లు పలుకుతున్న భూములు భారీగా క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా ఆకాశానికి చేరిన భూముల ధరలు ఎందరికో తలరాతలు మార్చాయి. సుమారుగా 1000 ఎకరాల్లో ప్లాట్ల నిర్మాణం జరుగుతుండగా 99 లక్షల మందికి ప్రత్యక్షంగా ఒకపూట ఆహారం ఈ భూముల ద్వారా దూరమైంది. 


నెల్లూరు - మైపాడు రహదారి నారాయణరెడ్డిపేటలో  గతేడాది డిసెంబరు వరకు ఎకరా రూ.కోటి వరకు ధర పలికింది. తాజాగా అదే ఎకరా రూ.కోటిన్నరకు చేరింది. ఇలా 125 ఎకరాల వరకు వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు లే అవుట్లుగా మార్చుతున్నారు. ఈ భూములపై సుమారుగా రూ.250 కోట్ల వ్యాపారం జరుగుతుందని రైతు వర్గాల్లో  చర్చ నడుస్తోంది. అదేవిధంగా కాకుపల్లిలో గడిచిన ఆరు మాసాల వరకు ఎకరా రూ.2 కోట్లు పలుకుతుండగా తాజాగా రూ.4 కోట్లకు చేరింది. దీంతో 50 ఎకరాలలో నూతన వెంచర్లను నిర్మిస్తున్నారు. వీటిపై రూ.350 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకుని ప్లాట్ల నిర్మాణం చేపట్టినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. 


నెల్లూరు రూరల్‌, జూలై 23 :  నెల్లూరు నగరానికి శివారున ఉన్న అనేక ప్రాంతాలలో గడిచిన ఆరు మాసాలలో వందల ఎకరాలు వాణిజ్యపరంగా మారాయి. మధ్య తరగతి, ఉన్నత శ్రేణి వర్గాలు లాక్‌డౌన కాలం నుంచి ఆర్థికపరమైన లావాదేవీలన్నీ పక్కనపెట్టి స్థిరాస్తిలపై దృష్టి సారిస్తుండటంతో రియల్‌ భూం పెరిగిందని వ్యాపారవేత్తలు అంచనా వేస్తున్నారు. కొనుగోళ్లు పెరుగుతుండటంతో వ్యాపారులంతా నెల్లూరు కేంద్రంగా రూరల్‌ ప్రాంతాన్ని లక్ష్యం చేసుకుని వందల ఎకరాలు రూ.కోట్లు దారపోసి లాగేసుకుంటున్నారు. గతంలో విలీన ప్రాంతాలలోని అల్లీపురం, గుడిపల్లిపాడు, పెద్దచెరుకూరు, నారాయణరెడ్డిపేట, నవలాకులతోట, ధనలక్ష్మీపురం, కాకుపల్లి, గుండ్లపాళెం, చింతారెడ్డిపాళెం, పొట్టేపాళెం, కనుపర్తిపాడులలో అంకణం రూ.లక్షకు కొనుగోలు చేసేవారు కరువయ్యారు. కానీ ప్రస్తుతం అంకణం రూ. 1.30లక్షలకు పైమాటే. ధనలక్ష్మీపురంలో ఏకంగా రూ.3 లక్షల వరకు  పలుకుతోంది. అదే వ్యవసాయ భూములైతే ఎకరాల రూ.కోటి నుంచి 4 కోట్లకు చేరడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 


ఉద్యోగ, వ్యాపారుల పెట్టుబడులతో... 


ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులతో పాటు వ్యాపారాలు చేసుకునే అనేక మంది రియల్‌ వ్యాపారాల్లో పెట్టుబడులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటివరకు ప్రైవేట్‌గా డబ్బులన్నీ అప్పుల రూపేణా మార్చుతు వచ్చిన వీరంతా అవి రాక నానా కష్టాలు పడుతుండటంతో ఆర్థికంగా సతమతమవుతున్న అనేక మంది తమ వనరులన్నిటినీ రియల్‌ వ్యాపారంలోకి మళ్లిస్తున్నారు. 


భవిష్యత్తుకు ప్రమాదమే 


నెల్లూరుకు ఆనుకుని ఉన్న విలీన ప్రాంతాలలో రియల్‌ భూం ఉండటంతో రైతులంతా తమ వ్యవసాయ భూములను వ్యాపారులకు కట్టబెడుతున్నారు. రానున్న భవిష్యతలో వ్యవసాయం క్రమీణ అంతరించుకుపోయి ఆహార ముప్పు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క నెల్లూరురూరల్‌ ప్రాంతంలోనే గడిచిన ఆరు నెలల వ్యవధిలో 11 గ్రామాలలో సుమారు 1000 ఎకరాల వరకు వ్యవసాయ భూములు వాణిజ్యంగా మారాయి. ఇదే తంతు కొనసాగితే మానవాళికి ఆహారం అందించే వ్యవసాయ భూములు లేక తిండి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


99 లక్షల మందికి దూరమైన ఆహారం 


గడిచిన ఆరు మాసాలలో నెల్లూరురూరల్‌ ప్రాంతంలో వాణిజ్య పరంగా మారిన వ్యవసాయ భూముల ద్వారా ఒక్కపూటకి 99 లక్షల మందికి ఆహారం అందించే అవకాశం కోల్పోయిందని వ్యసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్క ఎకరా ద్వారా 3 పుట్ల వడ్లు పండుతుండగా అందులో పుట్టి ధాన్యం 840 కేజీ వడ్ల నుంచి 550 కేజీల బియ్యం రాబడుతున్నాయని లెక్కకడుతున్న రైతులు కేజీ ఆరుగురికి ఒక్క పూట ఆహారం అందిస్తూ పుట్టి బియ్యం ద్వారా 9,900 మందికి ఆకలి తీరుతుందని భావిస్తున్నారు. ఇలా ఆరు నెలల్లో రియల్‌ వెంచర్లుగా మారిన 1000 ఎకరాల ద్వారా ఏకంగా 99 లక్షల మంది ఒకపూట ఆహారం లభించేదని లెక్క తేల్చిన అన్నదాతలు అవి కాస్త వాణిజ్యంతో దూరమయ్యాయని చెబుతున్నారు. 


భవిష్యత ప్రమాదమే 


కళ్ల ముందే వందల ఎకరాలు పంట భూములు రియల్‌ ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఇలానే జరిగితే భవిష్యతలో ప్రజలకు ఆహారం లభించే వనరులు లేక ఆకలికి అవస్థలు పడాల్సి వస్తుంది. ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇక ముందు వ్యవసాయం పుస్తకాల్లో చూడాలేమో. 

- జానా గిరిబాబు, రైతు నారాయణరెడ్డిపేట 

Updated Date - 2021-07-24T04:42:26+05:30 IST