భువనగిరిలో ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌ కొత్త ప్లాంట్‌

ABN , First Publish Date - 2022-01-25T08:18:13+05:30 IST

హెచ్‌ఎ్‌సఐఎల్‌ లిమిటెడ్‌కు చెందిన ప్యాకేజింగ్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌ ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌... తెలంగాణలోని భువనగిరిలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ..

భువనగిరిలో ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌ కొత్త ప్లాంట్‌


హైదరాబాద్‌ : హెచ్‌ఎ్‌సఐఎల్‌ లిమిటెడ్‌కు చెందిన ప్యాకేజింగ్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌ ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌... తెలంగాణలోని భువనగిరిలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. స్పెషాలిటీ గ్లాస్‌ డివిజన్‌ కోసం రూ.400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ ప్లాంట్‌ సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించిందని కంపెనీ వెల్లడించింది. సౌందర్య ఉత్పత్తుల విభాగంలో ఉపయోగించే ప్రత్యేకమైన గ్లాస్‌ ఉత్పత్తులను ఈ ప్లాంట్‌లో కంపెనీ ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 154 టన్నులు. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్న గ్లాస్‌ ఉత్పత్తులను ప్రధానంగా కాస్మోటిక్స్‌, ఫెర్‌ఫ్యూమ్స్‌, ఫార్మాస్యూటికల్స్‌ ఉత్పత్తులు, ప్రీమియం స్పిరిట్స్‌లో ఉపయోగిస్తారని కంపెనీ తెలిపింది. దేశీయంగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గిస్తూ గ్లాస్‌ ఉత్పత్తులను ప్రమోట్‌ చేయటంతో పాటు దిగుమతులను తగ్గించే ఉద్దేశంతో మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌కు అనుగుణంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 


ఏటా రూ.250 కోట్ల ఆదాయం: ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారు చేయాలనే లక్ష్యంతో పాటు వినియోగదారులకు వినూత్నమైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కొత్త ప్లాంట్‌ ఎంతగానో ఉపయోగపడనుందని ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ ఖోస్లా తెలిపారు. ఈ ప్లాంట్‌ ఏటా 10 శాతం వృద్ధితో రూ.250 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా స్పెషాలిటీ గ్లాస్‌ మార్కెట్లో 10-15 శాతం వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా 350 మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఖోస్లా చెప్పారు. 

Updated Date - 2022-01-25T08:18:13+05:30 IST