దురాక్రమణ

ABN , First Publish Date - 2022-05-16T04:30:44+05:30 IST

బేతంచెర్ల మండలం సీతారామాపురం వైసీపీ సర్పంచ్‌ అండదండలతో ఫారెస్టు భూములను కొందరు ఆక్రమించుకున్నారు.

దురాక్రమణ
ఫారెస్టులో సాగు చేసిన భూములు ఇవే

అటవీ భూముల సాగు 

చోద్యం చూస్తున్న అధికారులు 


బేతంచెర్ల, మే 15 : బేతంచెర్ల మండలం సీతారామాపురం వైసీపీ సర్పంచ్‌ అండదండలతో ఫారెస్టు భూములను కొందరు ఆక్రమించుకున్నారు. నలుగురు వ్యక్తులు చెట్లు నరికించి పొలాలుగా సాగు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఫారెస్టు అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బేతంచెర్ల మండలంలోని సీతారామాపురం- ముద్దవరం గ్రామాల మధ్య 30 హెక్టార్లలో 750 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. ఇందులో సర్వే నెంబరు 153లో ఉన్న ఉన్న టేకు, వెలమ, వేప, సోమ చెట్లను తొలగించి సుమారు వంద ఎకరాల మేర గ్రామానికి చెందిన ఎం. వెంకటేశ్వర్లు, ఎం. శ్రీనివాసులు, చింతకాయల వెంకటేష్‌, చింతకాయల లక్ష్మయ్య సాగు చేసుకుంటున్నారు. దురాక్రమణదారులకు ఫారెస్టు అధికారులకు లోపాయికారి ఒప్పందం ఉందని, అందుకే కింది స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 


 దౌర్జన్యం చేస్తున్నారు


ఫారెస్టు భూమిలోకి వెళ్లేందుకు రస్తా లేకున్నా నా పొలం లోంచి వెళ్లడానికి నలుగురు వ్యక్తులు దౌర్జన్యం చేస్తున్నారు. వారు ఫారెస్టు భూమి ఆక్రమించుకొని  రస్తా కోసం నాపైన దౌర్జన్యం చేస్తున్నారని ఫారెస్టు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. 


 - తెలుగు లక్ష్మన్న, రైతు, సీతారామాపురం


ఆక్రమిస్తే చర్యలు తప్పవు


సీతారామాపురం-ముద్దవరం గ్రామాల మధ్య ఉన్న అటవీ భూములు ఆక్రమించుకున్నట్లు తెలిసింది. చర్యలు తీసుకుంటామని దురాక్రమణదారులకు హెచ్చరికలు జారీ చేశాం. 


 - నవీన్‌ కుమార్‌, అటవీ శాఖ సెక్షన్‌ అధికారి

Updated Date - 2022-05-16T04:30:44+05:30 IST