పక్కా(ట్టా)గా ఆక్రమణ..!

ABN , First Publish Date - 2022-01-08T05:42:26+05:30 IST

ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. అనలైనలో రికార్డులు మార్చేసి ఆక్రమణలను సక్రమం చేస్తున్నారు. రాత్రికిరాత్రి వెబ్‌ల్యాండ్‌లో పట్టాదారుల పేర్లు మారిపోతున్నాయి. చెరువులు, నదులు, వంకలు పరాధీనం అవుతున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు.. కొందరు రెవెన్యూ అధికారులు పక్కా(ట్టా)గా సపోర్టు చేస్తుండడంతో అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై రెండు రోజుల క్రితం సీకేదిన్నె తహశీల్దారు సస్పెండ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాలో భూ జరిగిన అక్రమాలను పరిశీలిస్తే రెవెన్యూ అధికారుల లీలలెన్నో.

పక్కా(ట్టా)గా ఆక్రమణ..!
ప్రొద్దుటూరులో మైలవరం కాలువను ఆక్రమించి ప్రహరీ గోడ కట్టిన దృశ్యం

కొందరు అధికారుల నిర్వాకంతో ప్రభుత్వ భూములు పరాధీనం

ఆనలైనలో రికార్డులు తారుమారు

అసైన్మెంట్‌ కమిటీ తీర్మానం లేకుండానే డీ పట్టాలు జారీ

చెరువులు, నదులు, వంకలు కబ్జా

రెవెన్యూ ప్రేక్షక పాత్ర

తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్న భూ భాగోతాలు


ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. అనలైనలో రికార్డులు మార్చేసి ఆక్రమణలను సక్రమం చేస్తున్నారు. రాత్రికిరాత్రి వెబ్‌ల్యాండ్‌లో పట్టాదారుల పేర్లు మారిపోతున్నాయి. చెరువులు, నదులు, వంకలు పరాధీనం అవుతున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు.. కొందరు రెవెన్యూ అధికారులు పక్కా(ట్టా)గా సపోర్టు చేస్తుండడంతో అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై రెండు రోజుల క్రితం సీకేదిన్నె తహశీల్దారు సస్పెండ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాలో భూ జరిగిన అక్రమాలను పరిశీలిస్తే రెవెన్యూ అధికారుల లీలలెన్నో.


కడప, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 50 మండలాల్లోని 981 రెవెన్యూ గ్రామాల పరిధిలో 31,21,145.62 ఎకరాలు భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు ద్వారా తెలుస్తోంది. ఇందులో ప్రభుత్వ బంజరు, నదులు, వంకలు, కొండలు, చెరువుల భూములు 13.45 లక్షల ఎకరాలు ఉన్నట్లు అంచనా. వీటిలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. భూ అక్రమాల వెనుక రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఓ కారణమైతే.. ఆర్థికపరమైన అంశాలు ప్రధాన కారణమని జిల్లా అధికారుల విచారణలో గుర్తించినట్లు సమాచారం.

ఆయనో భూ తిమింగలం ?

రెవెన్యూ రికార్డులు మార్చేశారని, ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చేశారని, డీ పట్టా భూములను ప్రైవేటు భూములుగా చూపిస్తూ వెబ్‌ల్యాండ్‌ రికార్డులు మార్చేశారని జిల్లాలో ఐదారుగురు తహశీల్దారులపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. వారిలో ఓ తహశీల్దారు భూ తిమింగలం అని రెవెన్యూ శాఖలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ అధికారి పనిచేసిన ప్రతిచోటా రూ.కోట్ల విలువైన భూములు పరాధీనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో సంబంధాలు పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని పలువురు అంటున్నారు. అయన గతంలో పని చేసిన మండలంలో ఓ ప్రజాప్రతినిధి సమీప బంధువు కబ్జా చేసిన ప్రభుత్వ భూములను అనలైనలో పట్టా భూములుగా మార్చారని, ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారిందనే ఆరోపణలు లేకపోలేదు. ఈ భూ భాగోతంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పాత్ర కూడా కీలకంగా ఉందని అంటున్నారు.

కబ్జాకు కాదేది అనర్హం

జిల్లాలో నదులు, నది ఒడ్డున వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. అంతేకాదు.. చెరువులు, కాలువలు కూడా ఆక్రమణకు గురయ్యాయి. జిల్లాలో 185 చెరువుల పరిధిలో సుమారుగా 15-20 వేల ఎకరాలు అన్యాక్రాంతం అయిందని విశ్వసనీయ సమాచారం. చెరువుల ఆక్రమణలపై ఏకంగా డీడీఆర్‌సీ సమావేశంలోనే చర్చకు వచ్చింది. చెరువుల భూములు ఆక్రమణ నుంచి కాపాడేందుకు డ్వామా, రెవెన్యూ, ఇరిగేషన అధికారులు సంయుక్తంగా సరిహద్దులు గుర్తించి కంచె ఏర్పాటు చేయాలని తీర్మానించినా ఆచరణకు నోచుకోలేదు. ఆక్రమణదారుల్లో మెజార్టీ భాగం రాజకీయ అండదండలు ఉన్నవారు కావడం ఇందుకు ప్రధాన కారణమనే ఆరోపణలు ఉన్నాయి.



ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల పరిధిలో ఉన్న వై.కోడూరు కొండ పరంబోకు భూములు 400 ఎకరాలకు పైగా కబ్జాకు గురయ్యా యి. కబ్జా చేసిన భూములకు ఫెన్సింగ్‌ కూడా వేశారు. ఏడాది కిందట దీనిపై ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేసినా.. మెజార్టీ భూములు నేటికీ కబ్జాలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎర్రగుంట్ల తహశీల్దారుగా పనిచేసిన ఓ అధికారి అసైన్మెంట్‌ కమిటీ తీర్మానం లేకుండానే 100 ఎకరాలకు పట్టాలు ఇచ్చారని సమాచారం.

ఫ ఎర్రగుంట్ల మండలం పెన్నా నది ఒడ్డున ఎంతో విలువైన 13 ఎకరాల ప్రైవేటు భూమికి పట్టాదారులకు తెలియకుండా ఇతరులకు సాగు పట్టాలు ఇచ్చి వెబ్‌ల్యాండ్‌లో ఎంట్రీ చేశారనే ఆరోపణ ఉంది. పట్టాదారులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. 

గోపవరం మండలం మరకవారిపల్లె గ్రామంలో సుమారు 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు కొందరు ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి దిగారు. ఇక్కడ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు సైతం మాయమైంది. 

ప్రొద్దుటూరు రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న మైలవరం ఉత్తర కాలువను దాదాపుగా 3 ఎకరాలకు పైగా కబ్జా చేశా రు. రెవెన్యూ, ఇరిగేషన అధికారులు జాయింట్‌ సర్వే చేసి ఆక్రమణలు గుర్తించి జిల్లా అధికారులకు నివేదిక ఇచ్చినా ఆక్రమణలు తొలగించలేదు. వారికి కీలక ప్రజా ప్రతినిధి అండ ఉండడంతో అధికారులు చూసీ చూడనట్టు ఉన్నారు.


విచారణ చేయిస్తాం

-ఎం.గౌతమి, జేసీ (రెవెన్యూ), కడప

వెబ్‌ల్యాండ్‌ ఎంట్రీలు, మ్యూటేషనపై వచ్చిన ఆరోపణలు, ఆయా మండలాల్లో భూ కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేయిస్తాం. ఫిర్యాదులు నిజమని తేలితే శాఖ పరమైన చర్యలు తప్పవు. 


Updated Date - 2022-01-08T05:42:26+05:30 IST