అజెండా వార్‌!

ABN , First Publish Date - 2022-07-24T09:42:33+05:30 IST

అజెండా వార్‌!

అజెండా వార్‌!

  • కేంద్ర ప్రభుత్వానికి పోటీగా 
  • స్వాతంత్య్ర వజ్రోత్సవాలు!
  • భారీ కార్యక్రమానికి కేసీఆర్‌ యత్నం
  • ప్రతీ ఇంటిపై జెండా ఎగరేయాలి
  • 1.20 కోట్ల జెండాలకు 
  • ఆర్డర్‌ ఇవ్వాలని ఆదేశాలు
  • జెండాల ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వానిదే
  • ఆజాదీ ఉత్సవాల్లో భాగంగా జెండా 
  • ఎగరేయాలని ఇప్పటికే కేంద్రం ప్రకటన
  • ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీ పిలుపు
  • మర్నాడే కేసీఆర్‌ వజ్రోత్సవాల ప్రకటన

హైదరాబాద్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏడాది కాలంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌  మహోత్సవ్‌’కు పోటీగా సీఎం కేసీఆర్‌ భారీ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15కు ముందు ఏడు రోజులు.. తర్వాత ఏడు రోజులు.. మొత్తం 15 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’ వేడుకలు నిర్వహించనున్నట్టు శనివారం ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఇందుకోసం 1.20 కోట్ల త్రివర్ణ పతాకాల తయారీకి గద్వాల, నారాయణ పేట్‌, సిరిసిల్ల, పోచంపెల్లి, భువనగిరి, వరంగల్‌ తదితర ప్రాంతాల్లోని చేనేత పవర్‌ లూమ్‌ కార్మికులకు ఆర్డర్లివ్వాలని అధికారులను ఆదేశించారు. జెండాల తయారీ సహా ప్రచార కార్యక్రమాల కోసం ఎంత ఖర్చైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రచారం చేస్తోంది. ఆగస్టు 13-15 తేదీల మధ్యలో భారత ప్రజలంతా తమ ఇండ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని మోదీ శుక్రవారం ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు.  మరుసటి రోజే.. అదే తరహా కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ వజ్రోత్సవాల పేరుతో సొంతంగా అమలు చేయ సంకల్పించడం గమనార్హం.  


15 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలకు సంబంధించి కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ‘రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న భారత దేశాన్ని మరింత గుణాత్మకంగా రూపొందించుకోవాల్సి ఉంది. నాడు వారు పొందుపరిచిన ప్రజాస్వామిక, లౌకిక, సమాఖ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. సాంకేతికత, పని ఒత్తిడితో నేటి యువతలో దేశభక్తి భావన కొరవడుతున్నది. ఈ నేపథ్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం తెలంగాణ బిడ్డలకుంది. పల్లె.. పట్నం.. ఒక్కటై  భారతావని ఘనకీర్తిని చాటాలి’ అని కేసీఆర్‌ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు నేటి తరానికి అర్థమయ్యేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా ఆటలపోటీలు, వ్యాసరచన, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఇందుకు విద్యాశాఖ తగిన చర్యలు తీసుకోవాలన్నారు.


15 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు

పంచాయతీ రాజ్‌, మునిసిపల్‌ శాఖల సారథ్యంలో పల్లె నుంచి పట్నం దాకా స్వాతంత్య్ర వజ్రోత్సవ దీప్తిని వెలగాలని, ఆ దిశగా తగు చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తమ లెటర్‌ హెడ్స్‌పై జాతీయ జెండా చిహ్నాన్ని ముద్రించుకోవాలని సూచించారు. పదిహేను రోజుల పాటు పత్రికల మాస్టర్‌ హెడ్స్‌ మీద జాతీయ పతాకాన్ని ముద్రించాలని, టీవీ చానళ్లలో 15 రోజుల పాటు త్రివర్ణ పతాకం కనిపించేలా కార్యక్రమాలను ప్రసారం చేయాలని మీడియా యాజమాన్యాలకు సీఎం విజ్ఞప్తి చేశారు. దేశ భక్తిని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించాలన్నారు.


ఫ్రీడమ్‌ రన్‌లను నిర్వహించండి

ప్రతి ప్రభుత్వ వాహనం మీద జాతీయ జండా ఎగిరేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా జెండాలను రూపొందించాలని కేసీఆర్‌ సూచించారు. బస్టాండ్లు, రైల్వే ేస్టషన్లు, సినిమా హాల్లు, షాపింగ్‌ మాల్స్‌, పట్టణాల్లోని స్టార్‌ హోటళ్లు సహా ప్రధాన  రహదారుల వెంట అనువైన చోటల్లా దేశభక్తి స్ఫూర్తి జాలువారేలా, జాతీయ జెండా రెపరెపలాడేలా చర్యలు చేపట్టాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం ఆదేశించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ‘ఫ్రీడం రన్‌’లను నిర్వహించాలన్నారు. 

Updated Date - 2022-07-24T09:42:33+05:30 IST