ఏజెన్సీ బంద్‌ ప్రశాంతం

ABN , First Publish Date - 2020-09-29T06:23:59+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో చెన్నారావు గ్రామం ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో

ఏజెన్సీ బంద్‌ ప్రశాంతం

భద్రాద్రి జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు 

ముందుజాగ్రత్త తనిఖీలు చేపట్టిన పోలీసులు


కొత్తగూడెం/చర్ల/గుండాల, సెప్టెంబరు 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో చెన్నారావు గ్రామం ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు ముగ్గురు మావోయిస్టులను హతమార్చినందుకు నిరసనగా సోమవారం రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌ నేపధ్యంలో ముందు జాగ్రత్తగా వ్యాపార వర్గాలు పెట్రోల్‌ బంక్‌లు, హోటల్స్‌, వస్త్ర దుకాణాలు, వివిధ షాపులు బంద్‌ చేశాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చర్ల, దుమ్ముగూడెం, పినపాక, కరకగూడెం, మణుగూరు, అశ్వాపురం, ఆళ్లపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి మండలం, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లో బంద్‌ పాక్షికంగా జరిగింది.


ఆయా మండలాల్లో పోలీసు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. బంద్‌ సందర్భంగా కొన్ని మండలాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టులు అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని, ఆదివాసులపై అరాచకాలు ఇంకెన్నాళ్లంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మావోయిస్టులు అడ్డుకుంటూ గిరిజనులకు తీరని నష్టం చేకూరుస్తున్నారని పోస్టర్లలో ఆరోపించారు. పలు ఏజెన్సీ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో పోస్టర్లు వెలిశాయి.  చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌ జిల్లాలో గంగుళూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఈ సంఘటనలో పోలీసులు భారీగా ఆయుధ సామగ్రి, కిట్‌ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.  

Updated Date - 2020-09-29T06:23:59+05:30 IST