గిరిజన కాంతి!

ABN , First Publish Date - 2020-03-06T05:30:00+05:30 IST

ఏజెన్సీ ప్రాంతాల్లోని బాధలు ఆమెకు తెలుసు. అక్కడ గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలు కూడా తెలుసు. తన వారికి అండగా నిలబడాలంటే..

గిరిజన కాంతి!

ఏజెన్సీ ప్రాంతాల్లోని బాధలు ఆమెకు తెలుసు. అక్కడ గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలు కూడా తెలుసు. తన వారికి అండగా నిలబడాలంటే తానొక శక్తిగా మారాలి. అది చదువుతోనే అని గ్రహించి న్యాయశాస్త్రం వైపు అడుగులు వేశారామె. కృషి, పట్టుదలతో విశాఖ ఏజెన్సీలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ)గా ఎంపికైనా తొలి గిరిజన యువతిగా చరిత్ర సృష్టించారు సంపరి శశి వెంకట కాంతి. ఈ సందర్భంగా ఆమె తన మనోభావాలను ‘నవ్య’తో పంచుకున్నారిలా... 


‘‘మా స్వగ్రామం విశాఖ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన శరభన్నపాలెం. బ్రిటీష్‌ పాలనలో స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఉద్యమానికి స్థావరమైన గ్రామం ఇది. ఆ తర్వాత మావోయిస్టు కార్యకలాపాలకు కీలక కేంద్రంగా ఉండేది. చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున  రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికైన గొడ్డేటి దేముడుది కూడా మా శరభన్నపాలెమే. ఈ గ్రామంలోనే నా బాల్యం గడిచింది. 


చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమయ్యా!

నాన్న సోమరాజు పోలీస్‌శాఖలో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌. నేను ఏడో తరగతి చదుతున్నప్పుడే మా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాన్న, పెద్దక్క నన్ను ప్రేమగా పెంచారు. మేము ఐదుగురం సంతానం. పెద్దక్క ప్రమీలా భారతి విశాఖలో న్యాయవాదిగా పనిచేస్తోంది. చిన్నక్క ఉషాహారతి బీఈడీ పూర్తిచేసింది. తమ్ముళ్లు ఇద్దరూ ఇంకా చదువుతున్నారు. 

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితం అయ్యింది. నేటికీ అణచివేత, వివక్ష కొనసాగుతోంది. ఎన్నో వనరులున్నా గిరిజనుల్లో చట్టాలపై అవగాహన, హక్కులపై పరిజ్ఞానం లేకపోవడం వల్లనే మా మన్యం ప్రాంతాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పరిస్థితి. వాటిని మార్చాలనేది నా కోరిక. అందుకే న్యాయ విద్య అభ్యసించాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఇంటర్‌లో చదివింది బైపీసీ గ్రూప్‌ అయినా ఎంసెట్‌ జోలికి పోకుండా ఎన్‌బీఎం న్యాయ కళాశాలలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేశా. 


నా జీవిత లక్ష్యం అదే!

2016లో న్యాయ విద్య పూర్తి చేశా. తర్వాత విశాఖపట్నంలోని పైడితల్లి    నాయుడు అనే సీనియర్‌ అడ్వొకేట్‌ వద్ద సహాయకురాలిగా ఉన్నా. జిల్లా కోర్టులో ప్రాక్టీసు చేస్తూ నాలుగు పర్యాయాలు జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుకు ప్రయత్నించినప్పటికీ ఎంపిక కాలేదు. అయితే ఏపీపీ పోస్టుకు తొలి ప్రయత్నంలోనే ఎంపిక కావడం సంతోషం కలిగించింది. మొత్తం 56 పోస్టులకు రెండు వేల మందికి పైగా పోటీ పడ్డాం.  నాకు ఎస్టీ కేటగిరీలో మొదటి ర్యాంకు వచ్చింది. మొత్తంమ్మీద 58వ ర్యాంకు సాధించా. విశాఖ ఏజెన్సీలో ఏపీపీ పోస్టుకు ఎంపికైన తొలి మహిళగా నాకు గుర్తింపు లభించించడం ఆనందంగా ఉంది. మా బంధువులు, గ్రామస్థులు ‘ఆడపిల్లలకు పెద్ద చదువులు అవసరమా?’ అని అంటున్నా సరే నాన్న, అక్కల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగాను. జడ్జి కావాలనేది నా ప్రస్తుత లక్ష్యం. అందుకోసం కృషి కొనసాగిస్తూనే ఉంటాను. 


ఆదివాసీలకు అండగా ఉంటా!

గంజాయి రవాణా, మావోయిస్టు కార్యకలాపాలు వంటి నేరాల్లో ఇరుక్కొని జైళ్లల్లో రిమాండ్‌ ఖైదీలుగా మగ్గుతున్న గిరిజనులకు న్యాయ సహాయం అవసరం ఎంతో ఉంది. ఒక గిరిజన మహిళగా నేను ఆదివాసీలకు న్యాయపరంగా అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. ప్రభుత్వం తరఫున పనిచేస్తూనే,నాతో న్యాయ విద్యను అభ్యసించిన కొంతమంది స్నేహితులతో కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి, గిరిజన గ్రామాల్లో న్యాయ సహాయ, అవగాహన శిబిరాలు నిర్వహించాలనుకుంటున్నా. ఏజెన్సీలో గిరిజనుల జీవనోపాధి మార్గాలు పెంపొందించే మార్గాలను అన్వేషించాలి. ముఖ్యంగా గిరిజన యువతను సన్మార్గంలో నడిపిస్తూ, అభివృద్ధి పథం వైపు పయనింపజేసేందుకు అన్ని వర్గాల సహాయ సహకారం కావాలి. ఆ దిశగా నా ప్రయత్నాలు సాగుతాయి.’’


- పీవీ సత్యనారాయణరావు, నర్సీపట్నం, విశాఖ జిల్లా 




Updated Date - 2020-03-06T05:30:00+05:30 IST