నేడే ఏపీ మంత్రులకు ఆఖరి రోజు

ABN , First Publish Date - 2022-04-06T20:17:40+05:30 IST

నేడు ఆఖరి రోజు.. ఏపీ మంత్రులకు డెడ్ లైన్. బుధవారంతో వారి మంత్రియోగం ముగియనుంది.

నేడే ఏపీ మంత్రులకు ఆఖరి రోజు

అమరావతి: నేడు ఆఖరి రోజు.. ఏపీ మంత్రులకు డెడ్ లైన్. బుధవారంతో వారి మంత్రియోగం ముగియనుంది. ఇవాళ ఒక్క రోజు మాత్రమే అమాత్యగిరి అనుభవించే అవకాశముంది. గురువారం ఆఖరిసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్న సీఎం జగన్.. అందరితో రాజీనామాలు చేయిస్తారని సమాచారం. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరెవరిని తప్పిస్తున్నారో కేబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి వెల్లడిస్తారు. గవర్నర్ ఆమోదం తెలపగానే అదే రోజు కొత్తగా మంత్రిమండలిలోకి వచ్చేవారికి సమాచారం ఇస్తారని తెలియవచ్చింది. ఈనెల 11న ఉదయం 11:30 గంటలకు సచివాలయం భవన సముదాయం పక్కనున్న స్థలంలో కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.


కేబినెట్‌ను పునర్వవస్థీకరిస్తారని తెలిసిననాటి నుంచి రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మంత్రులు అందరినీ తప్పిస్తారని మొదట్లో భావించారు. రాజకీయ, ప్రాంతీయ, సామాజిక సమీకరణాల దృష్ట్యా కొందరిని కొనసాగించాలని తర్వాత నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో నలుగురు లేదా ఐదుగురికి మళ్లీ అవకాశం ఇస్తారని సమాచారం. మంత్రి పదవుల నుంచి తప్పించడాన్ని డిమోషన్‌గా భావించవద్దని ఇప్పటికే సీఎం జగన్ చెప్పారు. పదవి నుంచి తప్పుకునే కొందరు మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలియవచ్చింది. పార్టీని గెలిపించుకునివస్తే మళ్లీ మంత్రులు కావచ్చునని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-06T20:17:40+05:30 IST