Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 23 Dec 2021 07:50:51 IST

మళ్లీ ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’?!

twitter-iconwatsapp-iconfb-icon
మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌?!

ఆఫీసు కన్నా ఇల్లే పదిలం

ఒమైక్రాన్‌ దెబ్బకు మళ్లీ ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కే మొగ్గుచూపుతున్న దిగ్గజ ఐటీ సంస్థలు

రెండో వేవ్‌ ముగిశాక ఆఫీసులకు రమ్మని హుకుం

మూడో వేవ్‌ భయంతో ఇప్పుడు పునరాలోచన

సెట్‌లను ప్రకటిద్దామా? వద్దా?

వచ్చే ఏడాది ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌పై సమాలోచన

రాష్ట్రంలో మరో 14 ఒమైక్రాన్‌ కేసులు

12 మంది ముప్పు జాబితాలో దేశాల నుంచి వచ్చినవారే

సూడాన్‌ నుంచి హైదరాబాద్‌ చేరిన వ్యక్తికి వేరియంట్‌

ఒమైక్రాన్‌ సోకిన సిరిసిల్ల జిల్లా వ్యక్తి తల్లి, భార్యకు కొవిడ్‌

ఒమైక్రాన్‌పై నేడు ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష


(హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి): ‘‘ప్రియమైన ఉద్యోగులారా.. కరోనా పుణ్యమాని దాదాపు రెండేళ్లుగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆ భయం పోయింది. కాబట్టి ఇక ఆఫీసులకు రండి’’ ..డెల్టా వేవ్‌ ముగిసిపోయిందన్న భరోసా వచ్చాక, అక్టోబరు-నవంబరు నెలల్లో దేశంలోని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు చేసిన విజ్ఞప్తి ఇది. విజ్ఞప్తి కాదు.. కొద్దిగా గట్టిగానే చెప్పాయి. సెకండ్‌ వేవ్‌ విజృంభణ నుంచి కాస్త ఉపశమనం లభించి, ఆర్థిక వ్యవస్థ గాడిలో  పడుతుండటం, ప్రభుత్వ లెక్కల్లో దాదాపు 90% ఐటీ ఉద్యోగులకు టీకాలు పూర్తి కావడంతో నూతన సంవత్సరంలో నూతనోత్సాహంతో తిరిగి ఆఫీసులకు తిరిగి రావాల్సి ఉంటుందని ఆదేశాలు జారీచేశాయి. మల్టీనేషనల్‌ కంపెనీలైతే ఫలానా రోజు నుంచి తమ ఉద్యోగులు ఆఫీసుల నుంచే పని చేస్తారని గంభీరమైన ప్రకటనలూ ఇచ్చాయి.


ఐటీ సంబంధిత రంగాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యాపారుల కోసం కంపెనీల ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వమూ కోరింది. దీంతో చాలా మంది తమ ఊర్ల నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చారు కూడా. కానీ, నెలరోజులుగా పరిస్థితి మారిపోయింది. దక్షిణాఫ్రికాలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ గురించి నవంబరు 24న ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటన, మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు, శాస్త్రజ్ఞులు వేస్తున్న అంచనాలతో ఐటీ కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. 


జనవరి నుంచి ఉద్యోగులందరినీ ఆఫీసులకు రప్పించేందుకు భారీస్థాయిలో ప్రణాళికలు వేసుకుంటున్న సంస్థలన్నీ ఆ ఆలోచనలకు కాస్తంత విరామం ఇచ్చి.. వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాయి. ఉదాహరణకు.. దేశంలోని అతి పెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన టీసీఎస్‌ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌) ఉద్యోగుల్లో ప్రస్తుతం 10శాతం మంది కన్నా తక్కువ మందే ఆఫీసులకు వస్తున్నారు. మిగతా 90 శాతానికి పైగా ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. వారందరినీ ఆఫీసులకు రప్పించాలన్న ఆలోచనపై ఆ సంస్థ వెనక్కి తగ్గింది. ఇది కొద్దిగా ఆచితూచి తీసుకోవాల్సిన నిర్ణయమని పేర్కొంది. విప్రో సంస్ధ ముందుగా జనవరి నుంచి ఆఫీసుకు రావాలని సమాచారం అందించింది.. కానీ పది రోజుల క్రితం దానిని ఫిబ్రవరికి మార్చింది. ప్రస్తుతానికైతే డెలివరీ మేనేజర్‌, ఆ పై స్థాయి వ్యక్తులు మాత్రం వారానికి రెండు రోజులు ఆఫీసుకు వెళ్తున్నారు. ఒమైక్రాన్‌ విజృంభణతో ఇంటి నుంచి పని చేసే విధానాన్ని పొడిగించే అవకాశాలున్నాయని ఆ సంస్థ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. అటు ఇన్ఫోసిస్‌ కూడా.. మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడుతోంది.


కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు, కొవిడ్‌-19 తీవ్రత వంటివాటిని పరిశీలిస్తున్నామని.. ప్రస్తుతం తమ కంపెనీ ఉద్యోగులు 5,28,748 మందిలో 10శాతం మంది మాత్రమే ఆఫీసులకు వస్తున్నారని, కొన్నాళ్లపాటు ఇదే ‘మిశ్రమ నమూనా’ను పాటించాలని భావిస్తున్నామని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ పేర్కొంది. అక్టోబరు చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు 2,79,617మందిలో దాదాపు అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. 2021-22 రెండో త్రైమాసికంలో హెచ్‌సీఎల్‌ ఉద్యోగులు 1,87,634మందిలో 5-6ు మందే ఆఫీసులకు వస్తున్నారు. టెక్‌ మహీంద్రా ఉద్యోగుల్లో దాదాపు 20% మంది మాత్రమే ఆఫీసులకు వస్తున్నారు. మొత్తమ్మీద.. కరోనా ఇప్పటితో పోయే సమస్య కాదని అర్థం చేసుకున్న సంస్థలన్నీ దీర్ఘకాల హైబ్రీడ్‌ పని విధానం కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.


అంచనాలు తారుమారు..

కొత్త ఏడాది నుంచి దేశంలోని 45 లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో కనీసం సగం మంది ఆఫీసులకు తిరిగివస్తారని.. వారానికి కనీసం మూడురోజులు ఆఫీసు నుంచే పనిచేస్తారని.. ఇండస్ట్రీ బాడీ నాస్కామ్‌ నవంబరులో అంచనా వేసింది. కానీ, అలాంటి అంచనాలన్నింటినీ ఒమైక్రాన్‌ తల్లకిందులు చేసేసింది. కచ్చితంగా రావాలంటూ ఉద్యోగులను ఆదేశించలేని పరిస్థితి కల్పించింది. దీంతో చాలా కంపెనీలు ఆఫీసులకు రావడాన్ని తప్పనిసరి నుంచి ఐచ్ఛికం చేశాయి. ఈ క్రమంలోనే.. 2022లో అధికభాగం హైబ్రీడ్‌ విధానంలో పనిచేయాలని భావిస్తున్నట్టు ఇన్ఫోసిస్‌ మానవ వనరుల విభాగాధిపతి రిచర్డ్‌ లోబో తెలిపారు.


పరిస్థితి సాధారణానికి చేరుకుని, ఇన్ఫెక్షన్‌ రేటు తగ్గి, వ్యాక్సినేషన్‌ పెరిగితే అప్పుడు ఎక్కువ మంది ఆఫీసుకు వస్తారని ఆయన పేర్కొన్నారు. టీసీఎస్‌ సైతం.. ఉద్యోగులంతా ఆఫీసులకు రావడానికి సిద్ధంగా ఉండాలని.. సీనియర్‌ ఉద్యోగులు వారానికి ఒకటి, రెండుసార్లైనా ఆఫీసుకు రావాలని నవంబరులో ప్రకటించింది. ఇప్పుడా పరిస్థితి లేదని కంపెనీ వర్గాలు పే ర్కొంటున్నాయి. ఇక ముంబైకి చెందిన పలు ఐటీ కంపెనీలు 25/25 విధానం వైపు మొగ్గుచూపుతున్నాయి. అంటే.. 2025 నాటికి సంస్థ ఉద్యోగుల్లో 25ు మంది ఆఫీసుకు వచ్చే విధానం అది. 


వేచి చూడవలె...!

హైదరాబాద్‌ ఐటీ కంపెనీల్లో 60% కు పైగా యూరోప్‌, అమెరికా ప్రాజెక్ట్‌లపైనే ఆధారపడ్డవన్నది ఎంత నిజమో... ఇప్పటికే యూరోప్‌ , అమెరికాలను చుట్టేసిన ఒమైక్రాన్‌ మన దగ్గరకూ వచ్చేసిందన్నదీ అంతే నిజం. ఆ దేశాలు పచ్చగా ఉంటేనే మన ఐటీ కంపెనీలు రెపరెపలాడేది. ప్రస్తుతానికి ఐటీ కంపెనీలకు ప్రాజెక్టుల పరంగా ఇబ్బంది లేదు. కానీ.. మనదగ్గర ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో 2-3 నెలల్లో క్లయింట్‌ సర్వీ్‌సల పరంగా మాత్రం కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.


ప్రస్తుతానికి తాము హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ (మూడు రోజులు ఇంటి నుంచి వర్క్‌, రెండు రోజులు ఆఫీసులో ) అనుసరిస్తున్నామని, ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చేశామని హైదరాబాద్‌కు చెందిన ఒక ఐటీ సంస్ధ అధినేత తెలిపారు. పాక్టెరా టెక్నాలజీస్‌ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ దినేష్‌ చంద్రశేఖర్‌  అయితే  తామిప్పుడు తమ సిబ్బందిలో 30% మాత్రమే హైబ్రీడ్‌ విధానంలో ఆఫీస్‌కు వస్తున్నారని.. మూడోవేవ్‌ తగ్గే వరకూ ఇదే విధానం అనుసరిస్తామని వెల్లడించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.