మళ్లీ అన్యాయమే!

ABN , First Publish Date - 2022-06-24T05:19:08+05:30 IST

‘2015 డిసెంబరు 31 నాటికి 18 ఏళ్లు పూర్తయిన వారికి మాత్రమే యూత్‌ ప్యాకేజీ వర్తించింది. గ్రామాలు ఖాళీచేసే నాటికి వయసు పరిగణలోకి తీసుకోలే

మళ్లీ అన్యాయమే!


గతంలో యూత్‌ ప్యాకేజీకి 2,400 కుటుంబాలు దూరం

అప్పట్లో పిల్లలకు 18 ఏళ్లు నిండకపోవడమే కారణం

ఇప్పుడు మరోసారి వారికి మొండిచేయి

అదనపు పరిహార జాబితాలో చోటుదక్కని వైనం

(హిరమండలం)

‘2015 డిసెంబరు 31 నాటికి 18 ఏళ్లు పూర్తయిన వారికి మాత్రమే యూత్‌ ప్యాకేజీ వర్తించింది. గ్రామాలు ఖాళీచేసే నాటికి వయసు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో తాము అన్నివిధాలా నష్టపోయాం. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు యూత్‌ ప్యాకేజీ అందుకున్న వారున్నారు. మరికొన్ని ఇళ్ల వారికి అసలు పరిహారమే అందలేదు. ఈసారైనా న్యాయం జరుగుతుందనుకుంటే జాబితాలో చోటుదక్కలేదు. ఇదెక్కడి న్యాయం’.. 2,400 కుటుంబాల వ్యధ ఇది. వంశధార నిర్వాసితులకు వైసీపీ ప్రభుత్వం అదనపు పరిహారం రూ.236 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం పునరావాస గ్రామాల వారీగా రైతులు, పీడీఎఫ్‌, యూత్‌ ప్యాకేజీ లబ్ధిదారుల వివరాలు సేకరించే పనిలో అధికారులు పడ్డారు. కానీ గతంలో వయసు నిబంధనతో యూత్‌ ప్యాకేజీ దక్కని వారు పేర్లు జాబితాలో కనిపించకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లోనే అన్యాయం జరిగిందని.. ఇప్పుడైనా న్యాయం జరుగుతుందనుకుంటే ఎదురుచూపులే మిగిలాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదుచేసేందుకు సమాయత్తమవుతున్నారు. 

నాడు జరిగింది ఇది..

టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కృషిమేరకు నాడు నిర్వాసితులకు రూ.424 కోట్ల పరిహారం మంజూరైంది. 2005 సోసియో ఎకనమిక్‌ సర్వే ప్రకారం.. 7,091 మందికి పీడీఎఫ్‌, 5 వేల మందికి యూత్‌ ప్యాకేజీకి ఎంపిక చేశారు. 2015 డిసెంబరు 31 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే యూత్‌ ప్యాకేజీ అందించేందుకు నిర్ణయించారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కలమట, కలెక్టర్‌ నిర్వాసిత గ్రామాల వారీగా పెద్దలతో సమావేశం నిర్వహించారు. యూత్‌ ప్యాకేజీ వయసును నిర్థారించారు. అందుకు నిర్వాసిత గ్రామాల పెద్దలు కూడా సమ్మతించారు. కానీ అక్కడే చిక్కొచ్చింది. ఒక ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన ఇద్దరు ముగ్గురు రూ.5 లక్షల చొప్పున యూత్‌ ప్యాకేజీ అందుకున్నారు. కొన్ని ఇళ్లలో 17 సంవత్సరాలు నిండిన వారు ఉన్నా వయసు నిబంధన పేరిట యూత్‌ ప్యాకేజీ అందలేదు. వీరిలో సెంటు భూమి లేని నిరుపేద కుటుంబాల వారు ఉన్నారు. అలా కాకుండా గ్రామాలు విడిచిపెట్టే సమాయానికి 18 ఏళ్లు నిండిన వారందరికీ పరిహారం వర్తింపజేయాలని అప్పట్లో డిమాండ్‌ వచ్చింది. కానీ అప్పటికే పరిహారం పంపిణీ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో విపక్ష నేతగా ఉన్న జగన్‌ నిర్వాసితులను పరామర్శించారు. అప్పట్లో అన్యాయం జరిగిన వారందరికీ పరిహారం అందిస్తామని ప్రకటించారు. కానీ తాజాగా అధికారులు విడుదల చేసిన జాబితాలో చోటు దక్కలేదు. 2015 డిసెంబరు 31 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే మరోసారి పరిహారం అందిస్తామని చెబుతుండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో అన్యాయం జరిగింది. న్యాయం చేస్తారని భావిస్తే మరోసారి దగా చేస్తున్నారని నిర్వాసితుతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  


 అర్హులందరికీ పరిహారం

ప్రభుత్వం వంశధార నిర్వాసితుల అదనపు పరిహారం కోసం రూ.226 కోట్లు మంజూరు చేసింది. వీటిని అర్హులకు అందేలా చర్యలు చేపడుతున్నాం. కానీ రికార్డులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటన్నింటినీ అధిగమించి అర్హులందరికీ న్యాయం చేస్తాం.

- విజయసునీత, జాయింట్‌ కలెక్టర్‌



Updated Date - 2022-06-24T05:19:08+05:30 IST