తెలుగు రాష్ర్టాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన చెంచు లక్ష్మి మళ్లీ అరెస్ట్

ABN , First Publish Date - 2021-05-11T17:48:56+05:30 IST

రెండున్నరేళ్లుగా మహిళా జైలు పెట్రోల్‌ బంకులో పని చేస్తూ

తెలుగు రాష్ర్టాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన చెంచు లక్ష్మి మళ్లీ అరెస్ట్

  • మారని చెంచు లక్ష్మి
  • గతంలో 100పైగా  దొంగతనాల కేసులు.. 
  • మరోసారి అరెస్ట్‌

హైదరాబాద్/సైదాబాద్‌ : రెండున్నరేళ్లుగా మహిళా జైలు పెట్రోల్‌ బంకులో పని చేస్తూ, మారినట్లుగా నటించిన ఘరానా దొంగ చెంచులక్ష్మి మళ్లీ దొంగతనాలు  మొదలుపెట్టి. మాదన్నపేట పోలీసులకు చిక్కింది. ఆమె నుంచి 9 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు, రూ.11,520 నగదును స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా మాదన్నపేటలో చెంచులక్ష్మి (33)  నివాసముంటోంది. ఆరోగ్యం బాగా లేదని వారం రోజులుగా పెట్రోల్‌ బంకుకు వెళ్లడం లేదు. ఈ నెల 7, 8 తేదీలలో కుర్మగూడలో రెండు ఇళ్లతో పాటు గుడిలో చోరీ జరగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చెంచులక్ష్మి చేసినట్లుగా గుర్తించి మాదన్నపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


100 కేసుల్లో నిందితురాలు

చెంచు లక్ష్మి అలియాస్‌ గడ్డం లక్ష్మి, గోదావరి, గుండ్లపోచిగా తెలుగు రాష్ర్టాల పోలీసులను 2004 - 2009 కాలంలో ముప్పుతిప్పలు పెట్టింది. 14 ఏట నుంచి దినసరి కూలీగా పనిచేస్తూ తల్లి చెన్నమ్మ నుంచి దొంగతనాల్లో టెక్నిక్‌లు నేర్చుకుంది. చెట్లు ఎక్కడం, గోడలు దూకడంలో నైపుణ్యం పొందింది. 2004లో చెంచులక్ష్మి మహిళా జైలు 12  ఫీట్ల గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించింది. దీంతో జైలుగోడ ఎత్తును మరింత పెంచాల్సి వచ్చింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లు, మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో 100కు పైగా చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చింది. 2016లో చోరీ కేసులలో అరెస్ట్‌ అయిన చెంచులక్ష్మి మూడేళ్ల జైలు శిక్ష పూర్తికావడంతో నవంబర్‌ 2018లో జైలు నుంచి విడుదలైంది. జైలులో ఆమె ప్రవర్తనను గమనించిన అధికారులు తిరిగి నేరాల బాట పట్టకుండా సాధారణ జీవితం గడిపేందుకు మహిళ పెట్రోల్‌ బంకులో ఉపాధి కల్పించారు. అయినా ఆమె తీరు మారలేదు. దొంగతనాలకు పాల్పడి మరోసారి అరెస్టు అయింది.

Updated Date - 2021-05-11T17:48:56+05:30 IST