మళ్లీ గ్యాస్ బాదుడు!
ABN , First Publish Date - 2021-03-02T06:58:55+05:30 IST
వంట గ్యాస్ వినియోగదారుల నడ్డివిరిచేలా చమురు సంస్థలు ధరలు పెంచుతూనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా నాలుగుసార్లు సిలిండర్ ధర పెరగటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
సిలిండర్‌పై మరోసారి రూ.25 పెంపు
నెల రోజుల్లో నాలుగుసార్లు పెరిగిన ధర
మూడు నెలల్లో ఏకంగా 225 పెంపు
హైదరాబాద్‌లో సిలిండర్ ధర 871.50
పెట్రో పన్నుల తగ్గింపుపై కేంద్రం యోచన
ఒపెక్ దేశాల భేటీ తర్వాత నిర్ణయం
గత కొద్ది రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు వంట గ్యాస్ ధరలు తోడయ్యాయి. నెల రోజుల్లోనే నాల్గోసారి గ్యాస్ ధర పెరిగింది. మూడు నెలల్లోనే ఏకంగా 225 రూపాయలు పెంచేశారు.
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): వంట గ్యాస్ వినియోగదారుల నడ్డివిరిచేలా చమురు సంస్థలు ధరలు పెంచుతూనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా నాలుగుసార్లు సిలిండర్ ధర పెరగటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం సిలిండర్ ధర మరో రూ.25 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.846.50 నుంచి రూ.871.50కి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వకపోవడంతో వినియోగదారులు మొత్తం ధర చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక ఫిబ్రవరిలో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.100 పెరిగింది. మార్చి ఒకటిన పెరిగిన ధరతో ఇది రూ.125కు చేరింది. వంటగ్యాస్ ధరను చమురు సంస్థలు తరచుగా సవరిస్తున్నాయి.
దీంతో వినియోగదారులపై భారం పెరుగుతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన వాణిజ్య సిలిండర్ ధర పెరిగినా... గృహ వినియోగ సిలిండర్ ధర పెరగలేదు. అదే నెల నాలుగో తేదీ నుంచి బాదుడు మొదలైంది. అప్పటివరకు సిలిండర్ ధర రూ.746.50 ఉండగా నాలుగో తేదీన రూ.25 పెరగడంతో రూ.771.50కు చేరింది. ఫిబ్రవరి 15నమరో రూ.50 పెరిగిరూ.821.50కు చేరింది. 25న మరో రూ.25 పెరగటంతో సిలిండర్ రేటు రూ.846.50కు చేరింది. మార్చి ఒకటో తేదీన (సోమవారం) మరో రూ.25 బాదిన ఫలితంగా హైదరాబాద్‌లో ధర రూ.871.50కి ఎగబాకింది. ఇక ఢిల్లీలో సిలిండర్ ధర రూ.819కి చేరింది. వాణిజ్య సిలిండర్ ధర రూ.103 పెరగటంతో రూ.1,773కు చేరింది. కాగా సిలిండర్ ధర గత 3 నెలల్లో మొత్తంగా రూ.225 పెరిగింది.