మళ్లీ కొవిడ్‌ కలవరం..!

ABN , First Publish Date - 2022-07-02T06:06:45+05:30 IST

జిల్లాలో మళ్లీ కొవిడ్‌ కలవరం మొదలైంది. మొదటి, రెండు దశల్లో వందల మంది ప్రాణాలుతీసిన వైరస్‌ మరోసారి విజృంభిస్తోంది.

మళ్లీ కొవిడ్‌ కలవరం..!

జిల్లాలో వెలుగుచూస్తున్న   పాజిటివ్‌లు

నాలుగు రోజుల్లో  8 కేసులు నమోదు

నియంత్రణకు ముందస్తు  చర్యలు కరువు 

ఒంగోలు (కార్పొరేషన్‌), జూలై 1 : జిల్లాలో మళ్లీ కొవిడ్‌ కలవరం మొదలైంది. మొదటి, రెండు దశల్లో వందల మంది ప్రాణాలుతీసిన వైరస్‌ మరోసారి విజృంభిస్తోంది. జిల్లాలో గతనెల 28 నుంచి మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ 8 మంది వైరస్‌ బారిన పడ్డారు. వారిలో ఒంగోలు భాగ్యనగర్‌ 4వ లైన్‌కు చెందిన నలుగురు, చీరాల మండలం ఈపూరుపాలెంకు చెందిన ఇద్దరు, చీమకుర్తికి చెందిన ఒకరు, కొరిశపాడు మండలం పి.గుడిపాడుకు చెందిన ఒకరు ఉన్నారు. అనధికారికంగా మరికొందరు కూడా కరోనాతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు గుడులు, సినిమా హాళ్లు, కార్యాలయాలు, యథావిధిగా కొనసాగుతున్నాయి. తాజాగా జిల్లాలో వెలుగుచూస్తున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసులతో ఆందోళన నెలకొంది. మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను జనం మర్చిపోయారు. జనజీవనం సాధారణ స్థితికి వస్తున్న క్రమంలో వెలుగుచూస్తున్న కొవిడ్‌ కేసులతో సర్వత్రా భయం నెలకొంది. అయితే  వైద్యారోగ్య శాఖ, కార్పొరేషన్‌ అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఒకవైపు వానలు కురుస్తుండగా, మరోవైపు సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. సాధారణ జ్వరమొచ్చినా కొవిడ్‌ కలవరం వెంటాడుతోంది. నాల్గో దశ ప్రభావం ఏవిధంగా ఉంటుందో తెలియనప్పటికీ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. 


నిర్ధారణ పరీక్షలేవీ?

జిల్లా ప్రజలను ప్రస్తుతం నాల్గో దశ భయపెడుతుండగా, అధికార యంత్రాంగం అందుకు అనుగుణంగా నిర్ధారణ పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. గతంలో రిమ్స్‌లోని పీపీ యూనిట్‌తోపాటు, పలు ప్రధానకేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేకించి సంజీవిని బస్సును ఏర్పాటు చేయగా ప్రస్తుతం అది మూలకు చేరింది. అయితే పెరుగుతున్న కేసుల దృష్ట్యా అధికారులు పరీక్షలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా, కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 


మాస్క్‌లు, శానిటైజర్లకు మళ్లీ గిరాకీ 

జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపఽథ్యంలో ఆరు నెలలపాటు మరిచిపోయిన మాస్క్‌లు, శానిటైజర్లకు మళ్లీ గిరాకీ పెరిగింది. ప్రజలు నిబంధనల వైపు దృష్టిసారించారు. దీంతో మెడికల్‌ షాపుల్లో మూలకు చేరిన మాస్క్‌లు, శానిటైజర్ల అమ్మకాలు పెరిగాయి. 


Updated Date - 2022-07-02T06:06:45+05:30 IST