Abn logo
May 29 2020 @ 05:17AM

వైకుంఠధామాల నిర్మాణానికి అడ్డంకులు

మళ్లీ తెరపైకి అటవీ, రెవెన్యూ శాఖల వివాదం

జాయింట్‌ సర్వేలో తేలిన తరువాతే నిర్మాణాలు చేపట్టాలంటున్న అటవీ శాఖ

ప్రభుత్వ భూములపై జబర్దస్తీ ఏమిటంటున్న రెవెన్యూ శాఖ

ఇద్దరు ఎమ్మెల్యేల ఫిర్యాదు  

కలెక్టర్‌ సమక్షానికి చేరిన పంచాయతీ


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఉపాధిహామీ పనుల కింద ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైకుంఠదామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణానికి జిల్లాలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పనులకు అటవీ శాఖ మోకాళ్లు అడ్డుతుందా..? స్థలాల గుర్తింపునకు రెవెన్యూ శాఖ పాతరేసిందా..? తాజా పరిణామాలతో జిల్లాలో మరోసారి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు, చెత్త డంపింగ్‌ యార్డులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బంది గ్రామాల్లో స్థలాలు గుర్తింపు చేపట్టారు. అంతా పూర్తయి పనులు ప్రారంభమైన తరువాత ఈ భూములు తమవేనంటూ అటవీ శాఖ కొర్రీలు పెట్టడంతో జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో పది, పదిహేను గ్రామాల్లో పనులకు బ్రేక్‌ పడింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో స్థలాల గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందా లేదా అన్న కోణాన్ని పరిశీలిస్తే రెండు శాఖ సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.


వాస్తవానికి స్థలాల గుర్తింపు సందర్భంగా రెవెన్యూ శాఖ తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల్లోనే వీటిని ప్రతిపాదించాల్సి ఉంది. అయితే బెజ్జూరు, చింతలమానేపల్లి, రెబ్బెన మండలం తక్కళ్లపల్లి, వాంకిడి మండలం సోనాపూర్‌ వంటి ప్రాంతాల్లో అటవీ భూమిలో వీటిని ప్రతిపాదిం చారంటూ ఆ శాఖకు చెందిన సిబ్బంది పనులను అడ్డుకోవడమే కాకుండా కేసులు పెడుతామంటూ పంచాయతీ సిబ్బందిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పంచాయతీ కాస్త ఎమ్మెల్యేలు అక్కడ నుంచి కలెక్టర్‌కు చేరింది. జాయింట్‌ సర్వే జరిపిన తరువాతే నిర్మాణాలు చేపట్టాలన్న అటవీ శాఖ వాదనలపై కలెక్టర్‌ కూడా సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.  


ఎడతెగని పంచాయితీ 

జిల్లాలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పదంగా నలుగుతున్న భూముల వివాదం నాలుగేళ్లుగా తేలడం లేదు. రెవెన్యూశాఖ తమవిగా చెప్పుకుంటున్న భూములను అటవీ శాఖ తమవేనని వాదిస్తూ వస్తోంది. చాలా ఏళ్ల క్రితం రికార్డుల నమోదులో దొర్లిన తప్పుల కారణంగా ప్రస్తుతం రెవె న్యూ శాఖ ఆ భూములను తమవిగా వాదిస్తోందని అటవీ అధికారులు అంటున్నారు. దీనిపై జిల్లా ఏర్పడిన కొత్తలో అప్పటి కలెక్టర్‌ చంపాలాల్‌ రెవెన్యూ, అటవీ భూములపై సంయుక్తసర్వే జరపాలని ఆదేశించారు. ఈ క్రమంలో భూ సమగ్ర సర్వే ప్రారంభం కావడంతో రెవెన్యూ శాఖ రెవెన్యూ భూముల ప్రక్షాళనపై దృష్టి సారించింది.


దాంతో ఈ ఫైల్‌ పెండింగ్‌లో పడింది. తిరిగి పోడు భూముల వ్యవహారం తెరపైకి రావడంతో అప్పుడు కూడా అటవీ శాఖ అభ్యంతరాలు లేవనెత్తడంతో 2018లో ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఆ తరువాత ఇటీవలే బదిలీపై వెళ్లిన రాజీవ్‌గాంధీ హన్మంతు కూడా అటవీ భూముల వ్యవహారం తేల్చాలని ఆదేశించారు. అయినప్పటికీ ఇంతవరకు రికార్డులు చూపించడంలో అటవీ శాఖ అలసత్వం ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ అంశమే సంయుక్త సర్వేకు బ్రేకులు వేస్తున్నట్లు రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం వివాదానికి అస్పష్టమైన రికార్డులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో ఈ తరహా వివాదాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.


అటవీ శాఖ తీరుపై ఎమ్మెల్యేల ఆగ్రహం 

గ్రామాల్లో వైకుంఠదామాలు, డంపింగ్‌ యార్డుల అభివృద్ధిని అడ్డుకుంటూ ఇబ్బందులు పెట్టడం పట్ల అటవీ శాఖాధికారుల తీరుపై ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కులు గుర్రుగా ఉన్నారు. అటవీ శాఖకు అభ్యంతరాలు ఉంటే పనులు ప్రారంభించడానికి ముందే అడ్డుకోవాల్సి ఉన్నా అప్పుడు మౌనం వహించి తీర పనులు ప్రారంభమైన తరువాత అడ్డుకోవడం ఏమిటని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దాంతో మంత్రి ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించగా ఆయన ఫైల్‌ తెప్పించుకుని సమీక్షించినట్లు తెలుస్తోంది. 


జిల్లాలో 334 వైకుంఠదామలు, డంపింగ్‌ యార్డుల అభివృద్ధి

జిల్లాలో 334 గ్రామ పంచాయతీలకు గాను 324 గ్రామ పంచాయతీలలో వైకుంఠదామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో 66 పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చేపడుతుండగా మిగితా పనులు పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ విభాగం చేపట్టింది. ఈ పనులన్నీ కూడా ఉపాధిహామీ నిధులతోనే నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక్కో వైకుంఠదామానికి రూ.12.60 లక్షలు అంచనా వ్యయంగా నిర్ణయించగా, డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించారు. జిల్లాలో చేపట్టిన 324 పనులలో 323 పనులకు ఈజీఎస్‌ నిధులు కాగా ఒక పనికి మాత్రం రూర్బన్‌ నిధులను వెచ్చిస్తున్నారు. 


అటవీ శాఖ తీరు ఆక్షేపణీయం ..ఆత్రంసక్కు, ఎమ్మెల్యే

జిల్లాలో వైకుంఠధామాలు, చెత్త డంపింగ్‌ యార్డుల నిర్మాణ పనులను అటవీ శాఖ అడ్డుకోవడం సరికాదు. ముందుగా  అభ్యంతరం చెప్పాల్సింది కానీ పనులు ప్రారంభమైన తరువాత అడ్డుచెప్పడం ఏమిటి.  కలెక్టర్‌ వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలి.


వివాదాలు సృష్టించడం రివాజుగా మారింది ..కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే 

సిర్పూర్‌ నియోజక వర్గంలోని అటవీ ప్రాంత గ్రామాల్లో వైకుంఠధామాల అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు. మొదటి నుంచి అభివృద్ధి పనులపై వివాదాలు సృష్టించడం అటవీ శాఖకు రివాజుగా మారింది. అటవీ భూములని రికార్డులు ఉన్న పక్షంలో వాటిని చూపించి సమస్యను పరిష్కరించాలి. పనులు ప్రారంభమైన తరువాత అడ్డుకుంటామంటే కుదరదు.


ఆ భూములన్నీ రెవెన్యూ శాఖవే..సిడాం దత్తు, ఆర్డీవో

జిల్లాలో 11 చోట్ల వివాదాస్పదంగా మారింది. వీటి విషయంలో అటవీ శాఖ వద్ద ఎలాంటి ఆధారాలు లేక పోయినా వివాదాలు సృష్టించడం ఆ శాఖకే చెల్లింది. ఆ భూములు అటవీ శాఖవే అయితే రికార్డులు ఎందుకు చూపించడం లేదు. ఒకవేళ ఆధారాలు ఉంటే పనులు ప్రారంభానికి ముందే చూపించాలి. ఇప్పుడు మా భూములంటూ కేసుల పేరుతో బెదిరించడం సరికాదు. 

Advertisement
Advertisement