‘ఎంఎంటీఎస్‌’కు మళ్లీ మొండిచేయి

ABN , First Publish Date - 2022-03-08T12:19:30+05:30 IST

బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపించింది.

‘ఎంఎంటీఎస్‌’కు మళ్లీ మొండిచేయి

హైదరాబాద్‌ సిటీ : బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపించింది. మెట్రోకు రూ.2,377.35 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఎంఎంటీఎస్‌కు రూపాయి కూడా మంజూరు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ వాటా కింద రూ.631 కోట్లను చెల్లించాల్సి ఉందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. మూడేళ్లుగా బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌ ప్రస్తావనే  ఉండడం లేదు. 


యాదాద్రికి మూడో దశ ఇప్పట్లో లేనట్టే..

తిరుమల పుణ్యక్షేత్రం తరహాలో అభివృద్ధి చేయనున్న యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేయడంతో మూడేళ్ల క్రితం రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించింది. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టును పొడిగించాలని (ఎంఎంటీఎస్‌ మూడో దశ పేరిట) నిర్ణయించింది. ఇందుకు రూ. 330 కోట్లతో అంచనాలు రూపొందించింది. ఇప్పటి వరకూ పనులు ప్రారంభం కాకపోవడంతో వ్యయం పెరుగుతూ వస్తోంది. తాజా బడ్జెట్‌లో కొంత మేరకు నిధులు కేటాయిస్తే యాదాద్రికి ఎంఎంటీఎస్‌ పొడిగింపు కోసం టెండర్లు ఆహ్వానించవచ్చని అధికారులు భావించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో దీని గురించి ప్రస్తావనే లేకపోవడంతో ఇప్పట్లో టెండర్లు ఆహ్వానించడం సాధ్యం కాదని చెబుతున్నారు.  

Updated Date - 2022-03-08T12:19:30+05:30 IST