మళ్లీ పీజీ కోర్సులు తొలగించారు

ABN , First Publish Date - 2020-10-17T06:12:50+05:30 IST

భద్రాచలం ఏజెన్సీ నుంచి ఇంత కాలం ప్రభుత్వ కార్యాలయాలు......విద్యాలయాలు, గురుకులాలు

మళ్లీ పీజీ కోర్సులు తొలగించారు

గిరిజన విద్యార్ధులకు ఉన్నతవిద్యను దూరం చేస్తున్న అధికారులు

గత ఏడాది ఇదే తీరు

కమీషనర్‌తో మాట్లాడి కోర్సులు వచ్చేలా కృషి చేస్తా 

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య


భద్రాచలం, అక్టోబరు 16: భద్రాచలం ఏజెన్సీ నుంచి ఇంత కాలం ప్రభుత్వ కార్యాలయాలు......విద్యాలయాలు, గురుకులాలు తరలిపోయాయి....దీంతో భద్రాచలం ఏజెన్సీవాసులు ఇప్పటికే ఎన్నో అగచాట్లు పడుతున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా భద్రాచలం ప్రభుత్వ పీజీ కళాశాలలోని మూడు కోర్సులను తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యశాఖ కమీషనర్‌ నవీన్‌మిట్టల్‌ ఆదేశాలు జారీ చేసారు. దీంతో ఈ ప్రాంతంలోని నిరుపేద విద్యార్ధులకు ఉన్నత విద్య దూరమయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు అత్యధిక శాతం నిరుపేదలే. దీంతో వారికి ఉన్న ఏకైక ఆధారం భద్రాచలం ప్రభుత్వ పీజీ కళాశాలే అని చెప్పక తప్పదు.  ముఖ్యంగా గిరిజన విద్యార్ధులు ఈ కళాశాలలో 50 శాతంపైగా చదువుతున్నారు. ఉన్నతాధికారుల నిర్ణయంతో నిరుపేద విద్యార్ధులకు ఉన్నత విద్య మరింత దూరమవుతోంది. గత ఏడాది సైతం ఇదే రీతిలో మూడు కోర్సులను తొలగించగా ఆనాడు ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రచురించింది. అలాగే భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, అప్పటి ఐటీడీఏ పీవో విపి గౌతమ్‌ ఉన్నతవిద్యాశాఖ కమీషనర్‌తో మాట్లాడటంతో ఆనాడు మూడు కోర్సులు తిరిగి రావడంతో సీట్లను భర్తీ చేసారు. మళ్లీ ఈ  ఏడాది మరోసారి పీజీ కోర్సులను తొలగించడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 


జిల్లాలో ఇక్కడే ఈ కోర్సులున్నాయి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఈ ప్రాంతంలోని విద్యార్ధుల సౌలభ్యం కోసం భద్రాచలం కేంద్రంగా పీజీ కళాశాలను ఏర్పాటు చేసారు. ఇక్కడ 2006లో పీజీలో ఎం.ఎ. ఎకనామిక్స్‌ 40 సీట్లతో కోర్సు మంజూరు చేసారు. అలాగే 2012లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ కోర్సులో 30 సీట్ల చొప్పున మంజూరు చేసారు. దీంతో భద్రాచలం ఏజెన్సీలో నివసించే విద్యార్ధులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్నత విద్యను ఇక్కడే అభ్యసించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇక్కడ చదివే విద్యార్ధుల ఉత్తీర్ణత సైతం సంతృప్తికరంగానే ఉంది. గత ఏడాది గందరగోళ పరిస్థితులున్న క్రమంలో సైతం భద్రాచలం పీజీ కళాశాలలో పీజీ ప్రవేశ పరీక్ష ద్వార కెమిస్ట్రీలో 20 సీట్లు, పిజిక్స్‌లో 15, ఎకనామిక్స్‌లో 14 సీట్లు భర్తీ అయ్యాయి.  ఈ ప్రాంతంలో ఈ కోర్సులకు డిమాండ్‌ ఉన్నా ఉన్నతవిద్యాశాఖ అధికారులు  ఈ కోర్సులను తొలగించడం పట్ల సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. 


కమిషనర్‌తో మాట్లాడి కోర్సులు వచ్చేలా కృషి చేస్తా..భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య

ఈ విషయంపై ఉన్నతవిద్యాశాఖ కమీషనర్‌తో మాట్లాడి పీజీ సీట్లను తిరిగి కళాశాలలో యధావిధిగా భర్తీచేసేలా కృషి చేస్తాను. గత ఏడాది సైతం ఇలాగే చేస్తే ఉన్నతవిద్యాశాఖ అధికారులతో మాట్లాడి పునరుద్దరణ చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే విద్యార్ధులు పూర్తిగా నిరుపేదలు. నగరాలకు వెళ్లి పీజీ చదివేందుకు వారి ఆర్ధిక పరిస్థితులు అనుకూలించవు. ఈ క్రమంలో ఈ ప్రాంతం వారికి ఉన్నత విద్యను దూరం చేయకుండా అధికారులతో మాట్లాడతా. 

Updated Date - 2020-10-17T06:12:50+05:30 IST