విశాఖ ఘటన : నలుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం!

ABN , First Publish Date - 2020-07-14T12:13:13+05:30 IST

ఎల్జీ పాలిమర్స్‌, సాయినార్‌ ఫార్మా ఘటనలు మరువకముందే విశాఖపట్నంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది.

విశాఖ ఘటన : నలుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం!

విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్‌, సాయినార్‌ ఫార్మా ఘటనలు మరువకముందే విశాఖపట్నంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో సోమవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో వైజాగ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా.. ఈ భారీ ప్రమాదంలో నలుగురికి గాయాలవ్వగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వీరందర్నీ హుటాహుటిన ఆస్పత్రి తరలించిన స్థానికులు, అధికారులు వైద్యం అందిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు నలుగురే ఉన్నారా..? లేదా అంతకుమించి ఉన్నారా..? అనే  విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రమాదం జరిగిన సమీపంలో ఆరుగురు కార్మికులు ఉన్నారని సమాచారం. ఈ ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయటపడ్డాడని, మరో నలుగురు లోపల ఉన్నారని పలువురు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగి కొన్ని గంటలు గడుస్తున్నా అసలు ఎంత మంది విధుల్లో ఉన్నారు..? ఎంత మంది గాయపడ్డారు..? అనేదానిపై ఎలాంటి క్లారిటీ రాకపోవడం గమనార్హం.


భయం.. భయం!

సుమారు పది కిలోమీటర్ల మేర దూరం వరకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మంటలు ఇంకా అదుపులోకి రానట్లు తెలుస్తోంది. దట్టంగా పొగ అలుముకుంది. మరో వైపు వర్షం కురుస్తుండటంతో రాత్రి సహాయక చర్యలు ఇబ్బందిగా మారింది. అంతేకాదు ఈ పేలుళ్లు థాటికి ఫైరింజన్లు సైతం ప్రమాదస్థలికి వెళ్లలేకపోయాయి. ఘటనాస్థలానికి దూరంగానే నిలిచిపోయాయి. ఈ పేలుళ్లతో స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్థులు, పలు కంపెనీల సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వరుస ప్రమాదాలతో వైజాగ్ వాసులు భయంతో వణికిపోతున్నారు.

Updated Date - 2020-07-14T12:13:13+05:30 IST