HYD : మళ్లీ భగ్గుమన్న భానుడు.. భాగ్యనగరంలో ఈ ఏరియాలోనే ఎక్కువ..

ABN , First Publish Date - 2022-05-15T12:17:16+05:30 IST

మళ్లీ భగ్గుమన్న భానుడు.. భాగ్యనగరంలో ఈ ఏరియాలోనే ఎక్కువ..

HYD : మళ్లీ భగ్గుమన్న భానుడు.. భాగ్యనగరంలో ఈ ఏరియాలోనే ఎక్కువ..

  • మౌలాలిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు


హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో భానుడు మళ్లీ భగ్గుమంటున్నాడు. రెండు రోజులుగా నిప్పులు కురుస్తున్నాడు. ఉదయం 8 నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5.30 వరకు కూడా వేడి, వడగాలులు వీస్తున్నాయి. ఈ నెల 12న గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33.4 డిగ్రీలు ఉండగా, 13న 38.0 డిగ్రీలు నమోదయ్యాయి. శనివారం గ్రేటర్‌ వ్యాప్తంగా 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా మౌలాలిలో  41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 


వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి..

హైదరాబాద్ సిటీ/అబ్దుల్లాపూర్‌మెట్‌ : వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మజీద్‌పూర్‌ గ్రామానికి చెందిన పోచంపల్లి నర్సింహారెడ్డి (60) వ్యవసాయంతో పాటు ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తుంటాడు. ఈయనకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురికి వివాహం అయింది. వ్యవసాయ పనులు లేకపోవడంతో నర్సింహారెడ్డి భార్య ఈశ్వరమ్మతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. శనివారం నర్సింహారెడ్డి ఒక్కడే పనికి వెళ్లాడు. గ్రామంలోని ఓ వ్యవసాయ బావి వద్ద సుమారు 400 మంది ఉపాధి హామీ పనులు చేస్తుండగా 10.40 గంటల సమయంలో నర్సింహారెడ్డి వడదెబ్బతో ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలాడు. తోటి కూలీలు అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే మృతిచెందాడు. మృతుడు గ్రామ సర్పంచ్‌ పోచంపల్లి సుధాకర్‌రెడ్డి సోదరుడు.


చాదర్‌ఘాట్‌లో గుర్తు తెలియని వ్యక్తి..

వడదెబ్బ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కాచిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 45 ఏళ్ల వయసు గల వ్యక్తి చాదర్‌ఘాట్‌ రైల్వే బ్రిడ్జి వద్ద ఫుట్‌పాత్‌పై చనిపోయి ఉన్నాడు. పోలీసులు అతడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతు డి శరీరంపై తెలుపు రంగు షర్ట్‌, నీలి రంగు జీన్స్‌ ఫ్యాంట్‌ ఉంది. వడదెబ్బతో చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2022-05-15T12:17:16+05:30 IST