ధూల్‌పేట్‌లో మళ్లీ గుడుంబా.. దారులను మూసేసి..

ABN , First Publish Date - 2020-04-17T13:48:25+05:30 IST

హైదరాబాద్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ధూల్‌పేట్‌లో 20 రోజుల్లో 11 ప్రాంతాల్లో గుడుంబా తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

ధూల్‌పేట్‌లో మళ్లీ గుడుంబా.. దారులను మూసేసి..

లాక్‌డౌన్‌తో మద్యం షాపులు, బార్లు మూతబడితే.. ఇదే అదునుగా గుడుంబా వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. వైరస్‌ సాకును చూపించి తమ బస్తీల్లోకి అధికారులు రావద్దంటూ.. కర్రలు, రాళ్లను అడ్డుగా పెట్టి మరీ గుడుంబా తయారు చేస్తున్నారు. కావాల్సిన వారు ఫోన్‌ చేస్తే ఇంటికే సరుకు పంపుతున్నారు.


హైదరాబాద్ : హైదరాబాద్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ధూల్‌పేట్‌లో 20 రోజుల్లో 11 ప్రాంతాల్లో గుడుంబా తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వందల లీటర్ల గుడుంబాను, గ్యాస్‌ సిలిండర్లు, సామగ్రిని పెద్ద ఎత్తున సీజ్‌ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 25 మందిని అరెస్టు చేశారు. నిందితులను ప్రస్తుతం జైలుకు పంపే అవ కాశం లేకపోవడంతో వారికి సీఆర్‌పీజీ 41 సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేశారు.


తాజాగా నాలుగు బట్టీలు ధ్వంసం

ధూల్‌పేట్‌ బడాబంగ్లా ప్రాంతంలో పెద్ద ఎత్తున గుడుంబా తయారు చేస్తున్నట్లు గురువారం సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ అధికారులు ఏకకాలంలో నాలుగు ఇళ్లపై దాడులు చేసి గుడుంబా బట్టీలను ధ్వంసం చేశారు. 6 లీటర్ల గుడుంబాను సీజ్‌ చేశారు. నలుగురిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. గుడుంబా వ్యాపారాలపై ఆధారపడిన వారికి ప్రభుత్వం గతంలో నిధులు మంజూరు చేసి ఉపాధి కల్పించింది. లాక్‌డౌన్‌తో నగరంలో మద్యానికి డిమాండ్‌ పెరగడంతో కొందరు మళ్లీ గుడుంబా వ్యాపారంలోకి దిగారు.


బెల్ట్‌ షాపులు

మద్యం షాపులు మూతబడినప్పటికీ ధూల్‌పేట్‌లో బెల్ట్‌ షాపులు అధిక సంఖ్యలో ఉన్నాయి. అధికారులు మూడు ప్రాంతాల్లోని బెల్ట్‌ షాపులపై దాడిచేసి 160 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. మంగళ్‌హాట్‌ పోలీసులు మరో రెండు ప్రాంతాల్లో బెల్ట్‌ షాపులపై దాడులు నిర్వహించి ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌ అధికారులు బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేసి పెద్ద ఎత్తున మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9 మందిపై కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అటు గుడుంబా, ఇటు బెల్ట్‌ షాపులతో ధూల్‌పేట్‌ పేరు మరో మారు వార్తల్ల్లోకెక్కింది.

Updated Date - 2020-04-17T13:48:25+05:30 IST