మళ్లీ సిద్దిపేట నుంచే..

ABN , First Publish Date - 2021-06-20T05:41:44+05:30 IST

నేడు కొత్త జిల్లాలన్నింటిలోకెల్లా మొదటగా కలెక్టరేట్‌ భవన సముదాయంతో పాటు పోలీస్‌ కమిషనరేట్‌ భవనాన్ని అందుబాటులోకి తెచ్చుకుంటున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తన సొంత గడ్డ మీద పర్యటించి ఈ భవనాలను ప్రారంభించనున్నారు.

మళ్లీ సిద్దిపేట నుంచే..
కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన స్వాగత తోరణం

కలెక్టరేట్‌, పోలీస్‌ కమిషనరేట్‌ భవనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ 

మూడు గంటలపాటు జిల్లాలో పర్యటన

అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూన్‌ 19: సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న సిద్దిపేట జిల్లా ఆదివారం మరో ప్రత్యేకతకు వేదిక కానున్నది. జిల్లాగా ఆవిర్భవించిన అనంతరంగడిచిన ఐదున్నరేళ్లలో జాతీయ స్థాయిలో పలు అవార్డులను సాధించి కీర్తిని ఇనుమడింపజేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో పలు అంశాల్ల్లో ప్రథమంగా నిలిచి ప్రత్యేకతను చాటుకున్న సంగతీ విధితమే. తాజాగా నేడు కొత్త జిల్లాలన్నింటిలోకెల్లా మొదటగా కలెక్టరేట్‌ భవన సముదాయంతో పాటు పోలీస్‌ కమిషనరేట్‌ భవనాన్ని అందుబాటులోకి తెచ్చుకుంటున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తన సొంత గడ్డ మీద పర్యటించి ఈ భవనాలను ప్రారంభించనున్నారు.

 

నాడు కొత్త జిల్లాను.. నేడు కలెక్టరేట్‌, సీపీ కార్యాలయాలను..

సిద్దిపేట జిల్లా కావాలని 1983లో అప్పటి సీఎం నందమూరి తారకరామారావుకు విజ్ఞప్తి చేసిన అప్పటి టీడీపీ నేత కేసీఆర్‌.. తాను ముఖ్యమంత్రి కాగానే ఆ పనికి శ్రీకారం చుట్టారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా, 2016 అక్టోబరు 11వ తేదీన తానే సిద్దిపేట జిల్లాను ప్రారంభించారు. కలెక్టర్‌ వెంకట్రామారెడ్డిని స్వయంగా కుర్చీలో కూర్చుండబెట్టి మరీ జిల్లా పాలనను ఆరంభింపజేశారు. అదే చేతులతో 2017 అక్టోబరు 11వ తేదీన దుద్దెడ వద్ద కలెక్టరేట్‌, సీపీ కార్యాలయాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయనే ఈ రెండు కీలక భవనాలను స్వయంగా ప్రారంభించనున్నారు.

 

మరోసారి సిద్దిపేట సెంటిమెంట్‌..

సిద్దిపేట నుంచి ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుందని సీఎం కేసీఆర్‌ దృఢ విశ్వాసం. దత్తత గ్రామాలు, కొత్త జిల్లాల ఏర్పాటు, గొర్రెల పంపిణీ, డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ఐటీ టవర్లు, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రారంభం తదితర అన్ని అంశాల్లో ఆయన సిద్దిపేటను సెంటిమెంట్‌గా తీసుకున్నారు. ఇప్పుడు కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణం పూర్తి చేయడం, ప్రారంభోత్సవానికి కూడా సిద్దిపేటనే ఎంచుకున్నారు. కాగా, సిద్దిపేట అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) పరిధిలోని దుద్దెడ గ్రామ శివారులో 70 ఎకరాల విస్తీర్ణంలో కలెక్టరేట్‌, పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయ భవనాలను అధునాతనంగా నిర్మించారు. సోమవారం నుంచి పాలన ఇక్కడి నుంచే జరగనున్నది. 


కేసీఆర్‌ పర్యటన ఇలా..

ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సిద్దిపేట పట్టణానికి విచ్చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత దుద్దెడలో నిర్మించిన పోలీస్‌ కమిషనరేట్‌ భవనం, కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాలను ప్రారంభిస్తారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సమీక్ష నిర్వహిస్తారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌, డీఆర్వోతో పాటు ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్‌ చైర్మన్లు, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, రైతు సమన్వయ సమితుల మండలాల అధ్యక్షులు.. మొత్తం 300 మందికి జిల్లా అభివృద్ధిపై దిశానిర్ధేశం చేస్తారు. కలెక్టరేట్‌లోనే సీఎం మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వెళతారు. కార్యక్రమం ఆద్యంతం సజావుగా సాగేలా మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. అధికార, పోలీస్‌ యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. 

ముస్తాబైన భవనాలు

కొండపాక, జూన్‌ 19 : సమీకృత కలెక్టర్‌ భవన సముదాయం, పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రకరకాల పూలతో అలంకరించారు.  పోలీసు అధికారులు, కలెక్టరేట్‌ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ బుల్లెట్‌ అవుట్‌ రైడర్స్‌ ప్రత్యేక భద్రతా సిబ్బంది సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలకడం కోసం రాజీవ్‌ రహదారి వెంట ఇరువైపులా పెద్దపెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.


1,250 మందితో భారీ పోలీస్‌ బందోబస్తు

సిద్దిపేట క్రైం, జూన్‌ 19 : నేడు సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 15 సెక్టార్లుగా విభజించి బందోబస్తు చర్యలను చేపట్టారు. మొత్తం 1,250 మందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎక్కడ ట్రాఫిక్‌జామ్‌ కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. పార్కింగ్‌ ప్రత్యేక ప్రదేశాలను కేటాయించారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయానికి వచ్చే వాహనదారులు ఆఫీస్‌ పక్కన కుడివైపు ఉన్న మామిడి తోటలో పార్కింగ్‌ చేసుకోవాలి పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయానికి వచ్చే వాహనదారులు కమిషనరేట్‌ ఎడమ వైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చే ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కలెక్టర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ రెసిడెన్సీ పక్కన కుడివైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో, బందారం దర్గా రోడ్డులో వాహనాలను పార్కింగ్‌ చేసుకోవాలి. సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ డైవర్షన్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక పాసులు ఉన్న వారిని మాత్రమే పర్యటనకు అనుమతించనున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి వచ్చే ప్రజాప్రతినిధులకు గ్రీన్‌ కలర్‌ పాసులను అందజేశారు. 




Updated Date - 2021-06-20T05:41:44+05:30 IST